అప్పలరాజుపై అక్రమంగా పెట్టిన పిడి చట్టం ఉపసంహరించాలి

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
 విజయవాడ,
తేది : 24 డిసెంబర్‌, 2025.

అప్పలరాజుపై అక్రమంగా పెట్టిన పిడి చట్టం ఉపసంహరించాలి
వెంటనే విడుదల చేయాలి - సిపిఐ(యం) డిమాండ్‌
రైతు నాయకులు, సిపిఐ(యం) అనకాపల్లి జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు యం.అప్పలరాజుపై అక్రమంగా బనాయించిన పిడి చట్టం కేసును వెంటనే ఉపసంహరించాలని, ఆయనను వెంటనే విడుదల చేయాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేస్తున్నది. ఉమ్మడి విశాఖపట్నం, ప్రస్తుతం అనకాపల్లి జిల్లాలో ప్రజల సమస్యలపై నిరంతరం పనిచేస్తున్న ఆయనను చట్టవిరుద్దంగా నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నది.
ఫార్మా లాబీ, కార్పొరేట్లు కొమ్ముగాసి, వారిని సంతృప్తిపర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి నిరంకుశ చర్యలకు పాల్పడుతోంది. ఏనాడో ఉమ్మడి రాష్ట్రంలో 2013 మే నెలలో నమోదైన వాటి మొదలు తాజాగా రాజయ్యపేట బల్క్‌డ్రగ్‌ పార్క్‌ కేసు 10.12.2025 వరకు మొత్తం 19 కేసుల్లో ప్రభుత్వం అప్పలరాజును నిందితునిగా పేర్కొంది. కానీ ఆ 19 కేసుల్లో రెండిరటిలో కోర్టులు నిర్దోషిగా తేల్చగా 12 కేసులు మూసివేయబడ్డాయి. ఒకకేసు సివిల్‌ వివాదంగా ఖరారు చేయగా మరో నాలుగు కేసులు దర్యాప్తులో ఉన్నాయి. ఇందులో 151 సెక్షన్‌ కేసులే ఎక్కువ. కాబట్టి అప్పలరాజును నిర్బంధించాలన్న దుర్భుద్దితో నమోదు చేసిన అక్రమ పిడి చట్టం కేసు అని స్పష్టంగా అర్థమవుతోంది. ప్రజల ప్రయోజనాలు, ముఖ్యంగా భూములు కోల్పోతున్న పేద రైతులు, అందునా అసైన్డ్‌ భూములు సాగుచేస్తున్న దళిత, గిరిజన బలహీనవర్గాల వారికోసం, అలాగే వృత్తి, ఉపాధి కోల్పోయే వ్యవసాయ కార్మికులు, మత్స్యకారులు, ఇతర వృత్తిదార్ల ప్రయోజనాలు కాపాడడానికి అప్పలరాజు ఉద్యమాల్లో పాల్గొంటున్నారు. వాటికి నాయకత్వం వహిస్తున్నారు తప్ప స్వంత ప్రయోజనాలకోసం కాదు. ప్రజల, ప్రభుత్వ ఆస్థుల్ని కాపాడే ధ్యేయంతో ప్రజల్ని కదిలించి ఉద్యమాలు నడుపుతున్నందుకే ప్రభుత్వం ఆయనపై కక్షకట్టింది. పిడి చట్టం నోటీసులో పేర్కొన్నట్టు అప్పలరాజు భూకబ్జాదారుకాదు. కార్పొరేట్ల లాభాలకోసం సముద్రతీరాన్ని, పర్యావరణాన్ని విషతుల్యం చేస్తున్న ప్రయత్నాలను ఎండగట్టి రాజ్యాంగం, చట్ట ప్రకారం ప్రభుత్వం వ్యవహరించాలని ప్రజలను సమీకరిస్తున్నారే తప్ప ఆయన ఏ రకంగాను ఎవరిపైనా గూండా గిరి చేయలేదు. ఈ కేసులు పరిశీలిస్తే ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌, ఆ తరువాత టిడిపి, వైసిపి, ఇప్పుడు టిడిపి కూటమి ఇలా ఏ పార్టీ అధికారంలో ఉన్నా అప్పలరాజు స్థానిక ప్రాజెక్టు బాధితుల పక్షాన నిలబడ్డారని, పాలన చేస్తున్నవారు కార్పొరేట్‌ సేవలోనే తరిస్తున్నారని విదితమవుతుంది. గంజాయి, ఎర్రచందనం  రేపిస్టులు, హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ చేసేవారిని వదిలి నిజాయితీలో నిస్వార్థంగా ప్రజలకోసం పోరాడుతున్న అప్పలరాజుపై పిడి చట్టం ప్రయోగించడం ప్రభుత్వ నైజాన్ని తెలియజేస్తున్నది. విశాఖలో సిఐటియు అఖిలభారత మహాసభలు జరుగుతున్న నేపథ్యంలో ఈ అరెస్టు చేయడం దాన్ని మరింత రుజువు చేస్తున్నది.
తాజాగా సుప్రీం కోర్టు తెలంగాణాలో చట్టవిరుద్దంగా పిడియాక్టు అనేకమందిపై ప్రయోగించడాన్ని తప్పుబట్టిందని ప్రభుత్వం గుర్తించాలి. ఇటీవల కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి భూసేకరణకు అడ్డుపడేవారిపై పిడియాక్టు ప్రయోగించమని ఆర్డరు జారీ చేశారు. ఆ స్పూర్తితోనే కలెక్టర్‌ కనీసం ఆయనపై ఇప్పటి వరకున్న నేర చరిత్రను కూడా చదవకుండానే సంతకం  పెట్టి ఆర్డర్‌ జారీ చేసినట్లు కనిపిస్తున్నది.
ప్రజలకోసం పనిచేస్తున్న అప్పలరాజుపై చట్టవిరుద్దంగా బనాయించిన అక్రమ పిడి చట్టం కేసును ఉపసంహరించి, వెంటనే విడుదల చేయాలి. ప్రజాతంత్రవాదులు, వామపక్ష, లౌకిక పార్టీలు, సంఘాలు ప్రభుత్వ చర్యను ఖండిరచాలని, పిడి యాక్టు కేసును ఉపసంహరించేలా ఒత్తిడి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం.

(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి