ఏలూరు జిల్లాలో గిరిజనులపై పోలీసు దాడిని తక్షణం ఆపండి

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 23 డిసెంబర్‌, 2025.

 

ఏలూరు జిల్లాలో గిరిజనులపై పోలీసు దాడిని తక్షణం ఆపండి

రాష్ట్ర ప్రభుత్వానికి సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి విజ్ఞప్తి

 

ఏలూరు జిల్లా ఇనుమూరు గ్రామంలో అనేక సంవత్సరాలుగా గిరిజనులు సాగుచేసుకుంటున్న ప్రభుత్వ భూమిలో పంట పొలాల్లోని మొక్కజొన్న పంటను ధ్వంసం చేసి, అడ్డొచ్చిన గిరిజనులు, గిరిజన మహిళలపై దాడికి పాల్పడిన పోలీస్‌, రెవెన్యూ అధికారులపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. తక్షణం ఈ విషయంలో పోలీసు జోక్యాన్ని ఆపాలని హోంమంత్రి, రాష్ట్ర డిజిపికి ఆయన విజ్ఞప్తి చేశారు. పోలీసులు ఆ గ్రామాన్ని చుట్టుముట్టి భయోత్పాతక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. తక్షణం పోలీసులను ఉపసంహరించి పేద గిరిజనులకు న్యాయం చేయాలని ఆయన కోరారు. జిల్లా కలెక్టర్‌ స్పందించి రెవెన్యూ అధికారుల అనుచిత జోక్యాన్ని నివారించాలని విజ్ఞప్తి చేశారు.

అక్రమంగా భూమి కాజేయాలని చూస్తున్న కొంతమంది గిరిజనేతర భూస్వాములకు అనుకూలంగా పోలీసులు, మండల రెవెన్యూ అధికారులు దౌర్జన్యంగా పంటను ధ్వంసం చేయడం దుర్మార్గం. గిరిజన మహిళలపై మగ పోలీసులే దాడికి పాల్పడడం దారుణం.

ప్రభుత్వ భూములను గిరిజనులు తమ పూర్వికుల నుండి చదును చేసి సాగు చేసుకుంటున్నారు. అసైన్‌మెంట్‌ చేయమని అధికారులకు దరఖాస్తులు పెట్టుకున్నప్పటికీ ప్రభుత్వం నుండి స్పందన లేదు. ఈ సమస్యపై ఇప్పటికే హైకోర్టులో కేసు నమోద్కె ఉన్నప్పటికీ పోలీసులు భూస్వాములపక్షం వహించడం కోర్టు ధిక్కరణే. 1/70 అమల్లో ఉన్న ఏజెన్సీలో ఈ రకంగా పోలీసు, అధికార యంత్రాంగం వ్యవహరించడం, గిరిజనులపై చట్టవిరుద్దంగా దాడికి దిగడాన్ని ప్రజలు, ప్రజాతంత్రవాదులు ఖండిరచాలని విజ్ఞప్తి చేశారు.

 

(జె.జయరాం)

ఆఫీసు కార్యదర్శి