ఈరోజు (09 జనవరి, 2026) విలేకర్ల సమావేశం (విజయవాడలో) జరిగింది. ఆ వివరాలను ప్రచురణార్థం/ ప్రసారర్థం పంపుతున్నాము. -జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి
ఉపాధి హామీ చట్టం రద్దుకు నిరసనగా
18 నుండి 21 వరకూ ‘‘ఇంటింటికీ ఉపాధి’’ ప్రచారం
14న భోగిమంటల్లో జీరాంజీ పథకం ప్రతుల దగ్ధం
అమరావతే ఏపి రాజధాని
లోకేష్ చదివేది మోడీ స్క్రిప్టే
ఎస్‌సి, ఎస్‌టి పారిశ్రామివేత్తల బకాయిలు విడుదల చేయాలి
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు
మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దుచేసి జీరాంజీ పథకాన్ని తీసుకురావడానికి నిరసనంగా సిపిఎం ఆధ్వర్యాన రాష్ట్ర వ్యాప్తంగా ‘‘ఇంటింటికీ ఉపాధి’’ పేరుతో కార్యక్రమం నిర్వహించనున్నట్లు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. 14వ తేదీన భోగిమంటల్లో జీరాంజీ చట్టం కాపీలను దగ్ధం చేయాలని పిలుపునిచ్చారు. శుక్రవారం విజయవాడలోని బాలోత్సవ భవన్లో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు లోకనాథంతో కలిసి ఆయన మాట్లాడారు. పనిదినాలు పెంపు పేరుతో గతంలో ఉన్న చట్టాన్ని మార్చామని చెబుతున్నారని, దీనికి చట్టాన్ని మార్చాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. వామపక్షాలుగా తాము 200 పనిదినాలు కల్పించాలని డిమాండు చేస్తున్నామని, వాస్తవంగా ఇప్పుడు 50 పనిదినాలు కూడా ఉండటం లేదని తెలిపారు. రూ.304 రూపాయలు కనీస వేతనం ఇవ్వాలని ఉన్నా ఇప్పుడు కనీసం రూ.220 కూడా రావడం లేదని, వాటిని మెరుగుపర్చాల్సింది పోయి చట్టాన్ని రద్దు చేశారని విమర్శించారు. దీనికి వ్యతిరేకంగా జనవరి 18 నుండి 21 వరకూ రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం ఆధ్వర్యాన ‘‘ఇంటింటికీ ఉపాధి’’ పేరుతో ప్రజలను చైతన్యం చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. దీనిలో భాగంగా ప్రతి ఇంటికీ కరపత్రం ఇవ్వడంతోపాటు అధికారులకు మహజర్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం స్పందించకపోతే జాతీయస్థాయిలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. వ్యవసాయ కార్మికులు, పేదరైతులు, చేతివృత్తిదారులు వాస్తవాలను గుర్తించి సిపిఎం చేస్తున్న కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ లోపు ఉపాధి కార్మికులతో సమావేశాలు నిర్వమించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.
బలవంతంగా భూములు లాక్కుంటున్నారు
రాష్ట్రంలో కార్పొరేట్ల కోసం బలవంతపు భూసేకరణ చేస్తున్నారని, దీన్ని సమర్థించుకునేందుకు లోకేష్ రూ.0.99 పైసలకు భూములు ఇస్తే తప్పేంటని ప్రశ్నిస్తున్నారని అన్నారు. గతంలో తాము ఉచితంగా ఎవరికీ ఇవ్వడం లేదని, మార్కెట్ రేటు ప్రకారం ఇస్తున్నామని అన్న లోకేష్ ఇప్పుడు మాట మార్చి రూ.0.99 పైసలకు ఇస్తామని చెప్పడం బరితెగింపు అన్నారు. భూములు లాక్కునే హక్కు ప్రభుత్వానికి ఎవరిచ్చారని, రైతుల భూములు బలవంతంగా లాక్కుని కార్పొరేట్లకు ఇచ్చేందుకేనా అధికారం ఇచ్చింది అని ప్రశ్నించారు. విశాఖ స్టీలు ప్లాంటుకు సహకరించాల్సింది పోయి పక్కనే ఆర్సిలర్ మిట్టల్ పెట్టి వారికి సొంతగనులు, క్యాప్టివ్ పోర్టు నిర్మాణానికి అనుమతులు ఇచ్చారని తెలిపారు. విశాఖపట్నం రీజనల్ డెవలప్‌మెంట్ పేరుతో నీతిఅయోగ్ ఇచ్చిన రిపోర్టు పట్టుకుని తిరుగుతున్నారని, అందులో విశాఖస్టీలు ప్లాంటుకు చెందిన 2500 ఎకరాలను ప్రైవేటు పార్టీలకు మళ్లించాలని, నక్కపల్లిలో పరిశ్రమలకు ఇవ్వాలని పొందుపరిచారని తెలిపారు. స్టీలు ప్లాంటుకు చెందిన ఒక్క ఎకరం కూడా తీసుకోబోమని మొన్ననే లోకేష్ చెప్పారని, మరి ప్రజలను ఎందుకు మోసం చేస్తున్నారని ప్రశ్నించారు. 2500 ఎకరాలు నక్కపల్లి పారిశ్రామిక ప్లాంటుకు ఇస్తామని నివేదికలో ఉందని, 800 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వస్తున్నాయని అందులో పేర్కొన్నారని వివరించారు. ఒకవేళ భూములు తీసుకోబోమనుకుంటే నీతి అయోగ్ రిపోర్టును చెత్తబుట్టలో వేయాలని, లేనిపక్షంలో తీసుకుంటున్నామని ప్రజలకు చెప్పాలని, అంతేకానీ ప్రజలను మోసం చెయొద్దని కోరారు. రూ.11400 కోట్లు ప్లాంటుకు ఇస్తే అందులో రూ.1500 కోట్లు మాత్రమే ఉపయోగపడతాయని తెలిపారు. రూ.2000 కోట్లు కరెంటు బిల్లులకు ఇచ్చారని తెలిపారు. అదే సమయంలో రూ.22 వేల కోట్లు గూగుల్ అదానీకి ఇచ్చారని, మిట్టల్‌కు ట్యాక్స్ మినహాయింపు ఇచ్చారని వాటి సంగతేమిటో తేల్చాలన్నారు. వీటిల్లో ప్రభుత్వం వాటాలు తీసుకుంటుందా లేదా అదన్నా చెప్పాలన్నారు. ప్రజలకు ఇవ్వాలంటే మాత్రం డబ్బులు లేవని చెబుతున్నారని, కార్పొరేట్లకు వేలకోట్లు కట్టబెడుతున్నారని విమర్శించారు. ఈ భూ దోపిడీని అడ్డగించినందుకు సిపిఎం నాయకులు అప్పలరాజును తీసుకెళ్లి డిటైన్ చేశారని, ఆయన్ను కలుసుకునే అవకాశం కూడా ఇవ్వడం లేదని తెలిపారు. కోర్టులో పిటీషన్ వేస్తే నెలరోజుల్లో అఫిడవిట్ వేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిందని తెలిపారు. ఏ రకంగా చూసినా ఆయనపై పెట్టిన పిడి యాక్టు ఒక్కశాతం కూడా వర్తించదని తెలిపారు.
ఇటీవల కేంద్ర క్యాబినెట్ సెక్రటరీ బలవంతంగా భూములు తీసుకోబోమని చెప్పారని, చట్టాలకు లోబడి తీసుకుంటామని చెప్పారని ఆయన మాట అయినా వింటారా లేదా అని ప్రశ్నించారు. అన్నింటికన్నా ప్రజాభిప్రాయం, ప్రజాస్వామ్యం గొప్పవని కేబినేట్ సెక్రటరీ చెప్పారన్నారు. ఈ మాటల్ని గౌరవిస్తారా లేదా చెప్పాలని కోరారు. ప్రజల హక్కులు హరించి ఎలా అభివృద్ధి చేస్తారో చెప్పాలన్నారు. వ్యవసాయం అభివృద్ధిలో భాగం కాదా ? ప్రజల అభివృద్ధి అవసరమా లేదా? అని ప్రశ్నించారు. వారి హక్కులు హరిస్తూ ఎలా అభివృద్ధి చేస్తారో చెప్పాలన్నారు. అదానీ, అంబానీలను పోషించేందుకా అధికారం కట్టబెట్టిందని ప్రశ్నించారు.
సిపియంపై లోకేష్ విమర్శలు బాధ్యతా రహితం
లోకేష్ విశాఖలో మాట్లాడుతూ సిపిఎం నాయకులు ఎవరో ఇచ్చిన స్క్సిప్టు చదువుతున్నారని అన్నారని, దమ్ముంటే తాము ఎవరి స్క్సిప్టు చదువుతున్నామో ధైర్యంగా చెప్పాలని లేదా ఆ మాటల్ని ఉపసంహరించుకోవాలని డిమాండు చేశారు. గతంలో జగన్ కూడా అసెంబ్లీలో మాట్లాడుతూ విశాఖలో సిపిఎం నాయకులు లోకనాథం భూములు ఇచ్చేందుకు అడ్డుపడుతున్నారని, ఆయన సంగతి తేలుస్తామని హెచ్చరించారని తెలిపారు. అప్పుడు జగన్, ఇప్పుడు లోకేష్ తేడా అప్పుడు లోకనాథం, ఇప్పుడు అప్పలరాజని తెలిపారు. పనిగట్టుకుని సిపిఎంపై దాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్, లోకేష్‌ది ఒకే స్క్సిప్టని, దాన్ని మోడీ రాశారని, ఈ విషయాన్ని తాము బహిరంగంగా ధైర్యంగా చెబుతున్నామని అన్నారు. తాము ఎవరి స్క్సిప్టు చదువుతున్నామో లోకేష్ ధైర్యంగా చెప్పగలరా? అని ప్రశ్నించారు. జగన్ ఉన్నప్పుడు భూ కేటాయింపులను సిపిఎం వ్యతిరేకిస్తే తమ పక్కనే ధర్నాలో కూర్చుని లోకేష్ పార్టీ వారు బలపరిచారని, ఆ రోజు తప్పు కానిది, ఇప్పుడు తప్పు ఎలా అవుతుందో చెప్పాలన్నారు. బాధ్యతాయుతమైన క్యాబినెట్ మంత్రిగా ఉండి అపరిపక్వంగా మాట్లాడకూదని, జాతీయ పార్టీగా ఉన్న సిపిఎంపై నిందలు మోపడం సరికాదని ఖండిరచారు. తాము ఎవరో రాసిన స్క్సిప్టు చదివేవాళ్లము కాదని, ప్రతిష్ట కలిగిన పార్టీ ప్రతినిధులమని , అలాంటి పార్టీపై విమర్శలు బాధ్యతాయుతంగా ఉండాలని సూచించారు.
అమరావతే ఎపి రాజధాని
ఆంధ్రప్రదేశ్ రాజధాని ఖచ్చితంగా అమరావతేనని, అందులో సందేహం లేదని దాన్ని వివాదం చేయడాన్ని తాము అంగీకరించబోమని శ్రీనివాసరావు తెలిపారు. రాజధాని అభివృద్ధికి సూచనలు చేయాలని, దాన్ని బలపరుస్తామని, అనవసరపు భూసేకరణ చేస్తే ప్రజలు ఊరుకోరని అన్నారు. రాజధానిపై పెత్తనం ఎవరికీ శాశ్వతం కాదని, టిడిపికి, వైసిపి పార్టీలు దాన్ని గుర్తుంచుకోవాలని తెలిపారు. అమరావతి రాజధానిలో తీవ్ర నిర్బంధాన్ని అనుభవించి ఇబ్బందులు పడి ఓట్లువేసి టిడిపిని గెలిపించిన రైతులు తొలుత సంబరపడ్డారని, ఇప్పుడు ఆందోళన పడుతున్నారని వారి భూములు, ప్లాట్లు ఎక్కడో చెప్పాలని ఆవేదన చెందుతున్నారని తెలిపారు. ఆవేదనతో ఇటీవల రామారావు అనే రైతు కూడా మరణించాడని దానికి సమాధానం చెప్పాలని డిమాండు చేశారు. గతంలో తీసుకున్న భూములను అభివృద్ధి చేయకుండా ఇంకో 20 వేల ఎకరాలు లాక్కుంటామంటున్నారని, ఇది తీవ్ర అన్యాయమని పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అక్కడ రాజధాని అని చెప్పడాన్ని ఖండిరచారు. అలా అని రాజ్యాంగంలో ఉందా అని ప్రశ్నించారు. ప్రస్తుత రాజధానిని వివాదం చేయడాన్ని అంగీకరించబోమన్నారు.
పారిశ్రామిక రాయితీలు చెల్లించాలి
ఎంఎస్‌ఎంఈలో 3500 మంది ఎస్‌సి, ఎస్‌టి పారిశ్రామికవేత్తలకు ఇవ్వాల్సిన రూ.1200 కోట్ల రాయితీ బకాయిలు చెల్లించాలని కోరారు. పెద్దవారికి ప్రోత్సాహకాలు ఇచ్చారని, చిన్నవారిని అందులోనూ ఎస్సీ, ఎస్టీలను వదిలేశారని అన్నారు. అభివృద్ధి గురించి చెప్పే మాటల్లో వాస్తవం లేదని అన్నారు. ఉర్సా, అదానీ, లులూకు భూములు ఇచ్చారని వారేమి పెట్టారో చెప్పాలని డిమాండు చేశారు. రిటైల్ వ్యాపారస్తులకు భూములు ఇవ్వడానికి ప్రభుత్వానికి ఏమి పనని ప్రశ్నించారు. రిటైల్ వ్యాపారులకు ప్రపంచంలో ఎక్కడా ప్రభుత్వాలు భూములిచ్చిన దాఖలాలు లేవని తెలిపారు.
మోడీపై ట్రంప్ వ్యాఖ్యలు దేశానికి అవమానం
మోడీ గురించి ట్రంప్ అవమానకరంగా మాట్లాడారని, ఇది దేశానికి అవమానమని తెలిపారు. సర్.. ప్లీజ్.. అని మోడీ సంభోదించినంట్లుగా ట్రంపు వ్యంగ్యంగా అనుకరించినా కేంద్రం స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. మోడీ, ట్రంప్ వ్యక్తిగతంగా ఎన్నైనా మాట్లాడుకోవచ్చని, ప్రధానిగా ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించాల్సి ఉన్నా స్పదించలేదని అన్నారు. రష్యా నుండి అయిల్ దిగుమతి చేసుకుంటే 500 శాతం పన్ను వేస్తామని చెబితే దానిపై స్పందించకపోవడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. మోడీని ట్రంప్ మంచి బాలుడు తరహాలో సంబోధించారని, ఇది అవమానమని అన్నారు. మోడీ ఇప్పటికైనా నోరు విప్పాలని డిమాండు చేశారు. వెనిజులాపైనా ప్రధాని నోరెత్తలేదని అన్నారు. బిజెపిని బలపరిచే టివి చానళ్లు కూడా ఖండిస్తే మోడీ ఖండిరచలేదని అన్నారు. భవిష్యత్‌లో ఇండియాపై దాడి జరగదనే గ్యారంటీ కూడా లేదనానరు. ఇటువంటి సమయంలో మోడీ మౌనంగా ఉండటాన్ని ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.
భూములు ప్రైవేటు ఉత్తరాంధ్ర, కోనసీమ వాళ్లకు
సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు లోకనాథం
విశాఖ ఎకనమిక్ రీజియన్ పేరుతో ఉత్తరాంధ్ర, కోనసీమ ప్రాంతాల్లో భూములను ప్రైవేటు కంపెనీలకు యథేచ్ఛగా ధారాదత్తం చేస్తున్నారని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు కె.లోకనాథం అన్నారు. వపన్‌కల్యాణ్ గతంలో గిరిజనులకు చెప్పులు ఇచ్చొచ్చారని, ఇప్పుడు కార్పొరేట్లను నెత్తిన పెట్టుకుని భూములు వారికి ఇవ్వాలని చెబుతున్నారని విమర్శించారు. గిరిజన ప్రాంతాల్లో చట్టాలను, కోస్టల్ కారిడార్ నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారని అన్నారు. మత్స్యకారులను తరిమేస్తున్నారని మండిపడ్డారు. హోమ్‌శాఖ మంత్రి అనిత ప్రతిపక్షంలో ప్రజాస్వామ్యం గురించి మాట్లాడారని, ఇప్పుడు ప్రశ్నించిన వారిపై పిడి యాక్టులు పెడుతున్నారని ఆగ్రహించారు. సిపిఎం నాయకులు అప్పలరాజు ప్రజల కోసం పోరాడితే గత 25 ఏళ్లలో 19 కేసులు పెట్టారని, ఇప్పుడు ఆయన్ను జైలుకు పంపించి పేదల నుండి భూములు లాగేసుకుంటున్నారని మండిపడ్డారు. మంత్రిగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన వ్యక్తి ప్రజల కోసం పోరాడుతున్న వ్యక్తిని తీసుకెళ్లి జైల్లో పెట్టారని అన్నారు. విశాఖ ప్లాంటులో సిబ్బందిని తగ్గించారని, విఆర్‌ఎస్ పేరుతో ఉద్యోగులను తొలగిస్తున్నారని అన్నారు. నాసిరకం ముడిసరుకు ఇస్తున్నారని, ఇవన్నీ కూడా ప్లాంటును దెబ్బతీసేవని అన్నారు. ప్రజల తరపున నిలబడుతుందనే సిపిఎం అంటే భయపడుతున్నారని మండిపడ్డారు.
--
COMMUNIST PARTY OF INDIA (MARXIST)
Andhra Pradesh Committee
H.No. 27-30-9,
Akula vari Street,
Governorpet,
Vijayawada - 520 002.
Phone: 0866-2577202;
Web: www.cpimap.org
