
ఈరోజు (11 డిసెంబర్, 2025) విలేకర్ల సమావేశం (విజయవాడలో) జరిగింది. ఆ వివరాలను ప్రచురణార్థం/ ప్రసారర్థం పంపుతున్నాము. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి
ఎస్‌సి పారిశ్రామికవేత్తలపై వివక్ష తగదు
సబ్సిడీ నిధులు తక్షణమే విడుదల చేయాలి
అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలి
ఇండిగో సంక్షోభానికి కేంద్రమే కారణం
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు
రాష్ట్రంలో ఎస్‌సి పారిశ్రామికవేత్తలకు ఇవ్వాల్సి సబ్సిడీ నిధులను వెంటనే విడుదల చేయాలని, వారిపై వివక్ష తగదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు తెలిపారు. గురువారం విజయవాడలోని బాలోత్సవ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు డి.రమాదేవితో కలిసి ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో దళిత పారిశ్రామికవేత్తలకు గత మూడేళ్లుగా రావాల్సిన పారిశ్రామిక సబ్సిడీలను విడుదల చేయడం లేదని అన్నారు. దీంతో విసిగిపోయిన వారందరూ మంగళగిరిలోని ఎపిఐఐసి ప్రధాన కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారని పేర్కొన్నారు. మహిళలు పిల్లలు అందరూ వచ్చి అక్కడ ఆందోళనలో పాల్గొంటున్నారని వివరించారు. అయితే మహిళలు వాష్‌రూముకు వెళ్లేందుకు అక్కడ అనుమతి ఇవ్వడం లేదని, దీనికి కారణమైన ప్రభుత్వంపైనా, బాధ్యులపైనా వారిపై ఎస్‌సి, ఎస్‌టి అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయాలని అన్నారు. దీనిపై మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేయాల్సి ఉందని తెలిపారు. వారికి ఇవ్వాల్సిన బకాయిలు విడుదల చేస్తే అక్కడ ఆందోళన చేయాల్సిన అవసరం వారికి ఉండదని అన్నారు. మరోవైపు మూడేళ్లుగా వీరికి సబ్సిడీ విడుదల చేయడంలో వైసిపి, టిడిపి పాలకులు తీవ్ర నిర్లక్ష్యంగా ఉన్నారని అన్నారు. ఇంటికో పారిశ్రామివేత్త తయారవ్వాలని చెబుతున్న చంద్రబాబునాయుడు ఆచరణలో అటువంటిదేమీ చేయకపోగా పూర్తి నిరుత్సాహపరిచే విధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఇటీవల రూ.1100 కోట్లు పారిశ్రామిక సబ్సిడీ విడుదల చేసిన ప్రభుత్వం కియా సంస్థకు రూ.250 కోట్లు, మిగిలినవి ఎమామి ఆగ్రోటెక్, టిజి వెంకటేష్ కంపెనీలు, అపోలోటైర్స్, ఇసుజు, అమర్‌రాజా, కెసిపి, సీమెన్స్ వంటి కంపెనీలకు ఇచ్చారని తెలిపారు. కొత్త యూనిట్లు ప్రారంభించారనే పేరుతో అన్ని రకాల సబ్సిడీలూ అందజేశారని అన్నారు. మరోవైపు బలహీనవర్గాలు, దళితులు, గిరిజనులు, చదువుకున్న నిరుద్యోగులు అప్పులు కట్టలేక అవస్థలు పడుతూ బతకలేని పరిస్థితి ఏర్పడిరదని పేర్కొన్నారు. నిజంగా పారిశ్రామిక సబ్సిడీలు అందరికీ ఇవ్వాలి అనుకుంటే 2022 నుండి సినీయారిటీ ప్రకారం ఇవ్వాలని, అలా కాకుండా వారు అనుకున్న వారికి ఇస్తున్నారని అన్నారు. దీనిలో ప్రధానంగా ఎస్‌సి, ఎస్‌టిల పట్ల వివక్షత కనిపిస్తోందని, ఇది కులవివక్షతకు మించిన, అస్పృశ్యతకు మించిన అస్ఫృశ్యతని అన్నారు. పరిస్థితి ఇలా ఉంటే వారు ఎలా బతకాలని ప్రశ్నించారు. ఇది పారిశ్రామివేత్తలపట్ల వివక్ష కాదని, ఎస్‌సి, ఎస్‌టిలపట్ల వివక్ష అన్నారు. దీనికి ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వారికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని, వారి కుటుంబాలను ఆదుకోవాలని అన్నారు. విశాఖపట్నంలో గూగుల్ వస్తుందని రూ.22 వేల కోట్ల సబ్సిడీ ఇస్తున్నారని, అది అదానీ కంపెనీ అని అన్నారు. ఇప్పటికే విశాఖలో అదానీ కంపెనీకి 400 ఎకరాలు ఇచ్చారని అన్నారు. ఇప్పుడు గూగుల్‌ను అడ్డం పెట్టుకుని వేల కోట్ల సబ్సిడీలు పొందుతున్నారని అన్నారు. రాష్ట్రాన్ని అదానీ, అంబానీని తాకట్టు పెట్టేందుకేగా టిడిపి పరిపాలన చేస్తుందా అని ప్రశ్నించారు.
అంగన్‌వాడీలతో చర్చించి సమస్య పరిష్కరించాలి
అంగన్‌వాడీలు ఆందోళనకు సిద్ధమవుతున్నారని, రెండేళ్లకు పూర్వం జరిగిన ఆందోళనకు అప్పటి ప్రభుత్వం దిగివచ్చి అనేక హామీలు ఇచ్చిందని, తెలుగుదేశం నాయకులు చంద్రబాబునాయుడు కూడా తాము అధికారంలోకి వస్తే పరిష్కరిస్తామని చెప్పారని, ఇప్పటికీ పరిష్కారం చేయలేదని అన్నారు. అంగన్‌వాడీ వేతనాలు కూడా పెంచలేదని తెలిపారు. వాస్తవంగా అంగన్‌వాడీ సెంటర్లలో ఎక్కువగా పేదల పిల్లలే ఉన్నారని, వారికి అంగన్‌వాడీలు ఎంతో ఉపయోగంగా ఉంటే వారిని మాత్రం ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తెలిపారు. పైగా అక్షయపాత్రలో కలిపేస్తున్నారని, వారు కనీసం గుడ్డు కూడా పెట్టరని తెలిపారు. అలా అయితే పోషకాలు ఎలా అందుతాయని ప్రశ్నించారు. ప్రభుత్వం స్పందించి అంగన్‌వాడీ సెంటర్లను బలోపేతం చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. గుజరాత్ హైకోర్టు అంగన్‌వాడీలకు రూ.20 వేలు ఇవ్వాలని తీర్పు ఇచ్చిందని, రాష్ట్రంలో మాత్రం కనీస వేతనం ఇవ్వడం లేదని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వారికి కనీస వేతనాలు ఇవ్వాలని, ఆందోళనకు ముందే వారితో చర్చించి సమస్యలు పరిష్కరించాలని కోరారు. అంగన్‌వాడీలు ఫోన్లు పనిచేయడం లేదని తిరిగి ఇచ్చేస్తేనే ప్రభుత్వం రూ.70 కోట్లతో ఫోన్లు కొని ఇస్తోందని, ప్రభుత్వానికి దయకలిగి చేయడం లేదని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా తెలిపారు.
ఇండిగో సమస్యకు కేంద్రమే కారణం
ఇండిగో సమస్యకు కేంద్రమే కారణమని సరైన నియంత్రణ, పాలనా లేకుండా ఇండిగోకు పెద్దఎత్తున అనుమతులు ఇచ్చిన కేంద్రమే దీనికి బాధ్యత వహించాలని శ్రీనివాసరావు అన్నారు. ఎన్నికలకు ఫండ్ ఇచ్చారనే పేరుతో ఏమి చేసినా పట్టించుకోలేదని, దీనివల్ల సంక్షోభం ఏర్పడిరదని అన్నారు. దీన్నుండి బయటపడేందుకు వందేమాతరం అంశాన్ని ముందుకు తెచ్చారని, దానికి మతం రంగు పులుముతున్నారని అన్నారు. వాస్తవంగా స్వాతంత్య్రపోరాటకాలంలో వందేమాతరం హిందూ ముస్లిం ఐక్యతకు ప్రతీకగా ఉందని తెలిపారు. బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా ప్రజలను సమీకరించిందని తెలిపారు. అలాగే ఇంక్విలాబ్ జిందాబాద్, జైహింద్ అనే నినాదాలు కూడా స్వాతంత్య్ర పోరాటకాలంలో చైతన్యాన్ని రగిల్చాయని, అవి వారసత్వ నినాదాలని తెలిపారు. వీటిని మతానికి కలిపి మత ఘర్షణలు సృష్టించేలా ఉపయోగించడాన్ని ప్రజలు సహించకూడదని తెలిపారు.
దళితవాడల్లో భారీగా బెల్టుషాపులు
సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు రమాదేవి మాట్లాడుతూ అంగన్‌వాడీలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తెలిపారు. ఇప్పటికీ 1200 కేంద్రాలు మినీ కేంద్రాలుగా ఉన్నాయని, అంటే అన్ని పనులూ అంగన్‌వాడీలే చేసుకోవాలని తెలిపారు. వారు ఎదుర్కొంటున్న జీతాల సమస్యను పరిష్కరించలేదని పేర్కొన్నారు. మరోవైపు దళితవాడల్లో బెల్టుషాపులు ఎక్కడికక్కడ పెద్దఎత్తున వ్యాపారం చేస్తున్నాయని వివరించారు. కుటుంబాలు చిధ్రమవుతున్నాయని, వీటిల్లో ఎక్కువగా దళితుల కుటుంబాలే ఉన్నాయని తెలిపారు. ఎసైన్డ్ భూములు సాగు చేసుకుంటున్నచాలా చోట్ల వారికి పరిహారం ఇవ్వడం లేదని వివరించారు. అసైన్డ్ భూములనే పేరుతో తుఫాన్లలో దెబ్బతిన్నా వారికి పరిహారం ఇవ్వడం లేదని పేర్కొన్నారు. 25 వేల కోట్ల పొదుపు గ్రూపుల డబ్బులు బ్యాంకుల్లో ఉన్నాయని తెలిపారు. దళితవాడల్లో మహిళలు రుణాలు కట్టకపోతే అన్ని గ్రూపులకూ వసూలు బాధ్యత అప్పగిస్తున్నారని అన్నారు. అకివీడులో డ్వాక్రా మహిళ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలని, బెల్టుషాపులపై చర్యలు తీసుకోవాలని, పొదుపు గ్రూపుల రుణాల పేరుతో మహిళలపై వేధింపులు ఆపాలని కోరారు.
