H1B వీసాలపై ఆమెరికాలో ఉంటున్న ఉద్యోగులు, ఇతర విద్యార్ధులకు భరోసా కల్పించేందుకు మీ పర్యటన దోహదపడాలని కోరుతూ.

Revised :

 

(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విద్యాశాఖా మంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

 

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

విజయవాడ,

తేది : 06 డిసెంబర్‌, 2025.

 

శ్రీయుత నారా లోకేష్‌ గారికి,

విద్యాశాఖా మాత్యులు,

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం,

అమరావతి.

విషయం:  H1B వీసాలపై ఆమెరికాలో ఉంటున్న ఉద్యోగులు, ఇతర విద్యార్ధులకు భరోసా కల్పించేందుకు మీ పర్యటన దోహదపడాలని  కోరుతూ...

అయ్యా!

నేటి నుండి 10వ తేదీ వరకు మీరు అమెరికాలో పర్యటించనున్నట్లు మీడియా ద్వారా తెలుసుకున్నాను. తెలుగువారి నుండి పెట్టుబడులు ఆహ్వానించనున్నట్లు ప్రకటించారు. మంచిదే. కానీ అదే అమెరికాలో నేడు లక్షలాది మంది తెలుగు (ప్రత్యేకించి మన రాష్ట్రానికి చెందినవారు) వారు ఐటి తదితర ఉద్యోగాలు చేస్తున్నవారు, చదువు (ఎంఎస్‌)కుంటున్నవారు అభద్రతా భావంతో జీవిస్తున్నారు. వారికి ఉద్యోగ భద్రత, జీవన భద్రతకోసం అమెరికా ప్రభుత్వంతో కూడా మట్లాడాలని కోరుతున్నాను.

ఎన్నారైలు మన రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతున్నారు. విదేశీ రెమిటెన్సిస్‌ గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ సంక్షోభాన్ని తట్టుకోడానికి కొంత వరకు తోడ్పడుతున్నాయి. ప్రస్తుతం అమెరికా విధానాల వల్ల వాటికి గండి పడుతున్నది.

గతంలో చంద్రబాబునాయుడు గారిని అరెస్టు చేసిన సందర్భంలో మొదటగా గళమెత్తినవారు వీరే. 2024 ఎన్నికల్లో కూడా సెలవులు పెట్టి మీ పార్టీ విజయం కోసం కృషి చేశారు. అలాంటి వారు నేడు మీ నుండి తగిన భరోసా, స్పందన రాక  బాధతో ఉన్నారు. నిత్యం జెన్‌జెడ్‌ లేదా యువతరం, ఐటి అంటూ మాట్లాడే ప్రధాని మోడీ ఒక్కసారి కూడా ఈ సమస్యపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో మాట్లాడలేదు. కనీసం అమెరికా ప్రభుత్వంతో సంప్రదించలేదు.

నేడు అనేక పెద్ద ఐటి కంపెనీలు (గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, ఐబియం, మెటా, అమెజాన్‌ తదితర) వేల సంఖ్యలో ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. టిఎపిఎస్‌, విప్రో,  ఇన్ఫోసిస్‌ తదితర భారతీయ కంపెనీలు కూడా పెద్ద సంఖ్యలో ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. అనేక కంపెనీలు ఆంధ్రాకు వచ్చి కొత్తగా ఉద్యోగాలిస్తామని భ్రమపెడుతున్నాయి. మీరు అలాంటి కంపెనీలకు పెద్ద ఎత్తున రాయితీలు,సౌకర్యాలు కల్పిస్తున్నారు. కానీ వారి నుండి మన రాష్ట్రం వారికి ఉద్యోగాలిచ్చేందుకు ఎలాంటి హామీ తీసుకోవడం లేదు. పైగా వారిని సులభంగా తొలగించడానికి చట్ట సవరణ (లేబర్‌ కోడ్స్‌) చేశారు. షాప్స్‌ అండ్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ చట్టాన్ని సవరించి అదనపు గంటలు పనిచేయాలని నిర్దేశించారు. మధ్యంతర వయస్సులో ఉన్నవారు అప్పులు చేసి ఇల్లు, కార్లు కొనుకున్నారు. పిల్లల చదువులు మధ్యలో ఉన్నాయి. ఇప్పుడు వారికి ఉద్యోగాలు పోతే (లే ఆఫ్‌, రిక్రూట్‌మెంట్‌) కనీసం ఇయంఐలు కూడా కట్టుకోలేక కట్టుబట్టలతో వీధిన పడతారు. వీరు ఇంత సంక్షోభంలో ఉన్నా మీ నుండి స్పందన, సానుభూతి వ్యక్తం కాలేదు. ఆపే ప్రయత్నం చేయలేదు. అమెరికాలో ఉంటున్నవారు తిరిగి ఇక్కడకు వస్తే వారికి ఉద్యోగాల కల్పన చేయలేకపోతే తీవ్ర నిస్పృహకు గురవుతారు. కావున మీరు చొరవ తీసుకొని వీరికి ఉద్యోగ భద్రత కల్పించేందుకు, తొలగింపులు ఆపేందుకు భారత ప్రభుత్వం, అమెరికా అధ్యక్షుడు, వివిధ కంపెనీల అధికారులతో మీకున్న సంబంధ బాధవ్యాలను ఉపయోగించగలరని కోరుతున్నాను. మన రాష్ట్రం నుండి వేలాదిమంది అమెరికాలో ఉపాధి పొందుతూ రాష్ట్రాభివృద్ధికి  తోడుగా నిలబడ్డ ఐటి తరగతిని, యువతరాన్ని ఆదుకోవడానికి ముందుకు రావాలని, భరోసా ఇవ్వాలని కోరుతున్నాను. ఈ పర్యటనలో ఆ మేరకు మీ నుండి కృషి జరుగుతుందని ఆశిస్తున్నాను.

అభివందనములతో...

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి