గంజాయిపై ప్రభుత్వ స్పందన బాగోలేదు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు

ఈరోజు (03 డిసెంబర్‌, 2025) విలేకర్ల సమావేశం (విజయవాడలో) జరిగింది. ఆ వివరాలను ప్రచురణార్థం/ ప్రసారర్థం పంపుతున్నాము.  - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి

 

గంజాయిపై ప్రభుత్వ స్పందన బాగోలేదు

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు 

పెంచలయ్య హత్యపై సిఎం, హెచ్‌ఎం స్పందికపోవడం అన్యాయం

రాజకీయ హత్యలకు పరిహారం, ప్రజల కోసం పనిచేసిన అమరులకు అన్యాయం

 

గంజాయి గ్యాంగులపైనా, పెంచలయ్య హత్యపైనా ప్రభుత్వం స్పందన బాగోలేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం విజయవాడలోని బాలోత్సవభవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నవంబరు 28వ తేదీన నెల్లూరులో గంజాయి గ్యాంగ్‌ పెంచలయ్యను హత్య చేయడంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోందని, అయినా ఇప్పటికీ ముఖ్యమంత్రిగానీ, హోమ్‌శాఖ మంత్రిగానీ స్పందించలేదని తెలిపారు. హోమ్‌శాఖ మంత్రి వంగలపూడి అనితకు లేఖ కూడా రాశామని అన్నారు. రాజకీయ హత్యల్లో తమవారు పోతే వెంటనే ప్రకటనలు గుప్పించి, నానా హడావుడి చేసి, భారీ ఎత్తున సాయం ప్రకటిస్తున్న ప్రభుత్వం ప్రజల కోసం, మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా పనిచేసిన పెంచలయ్య హత్యకు గురైతే కనీసం మాట్లాడకపోవడం అన్యాయమని పేర్కొన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే గంజాయి మాఫియాకు బలైన పెంచలయ్య కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. ఇటీవల ఓ రాజకీయ సభలో నెల్లూరులో లేడీడాన్ల గురించి మాట్లాడిన సిఎం దాన్ని రాజకీయ నిందల కోసం వాడుకున్నారేగానీ గంజాయి గ్యాంగ్‌లపై పోరాడి చనిపోయిన పెంచలయ్య హత్యపై మాట్లాడ లేదని విమర్శించారు. సమాజాన్ని పీడిస్తున్న గంజాయి, మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా నెల్లూరులో పెంచలయ్య ప్రజల తరుపున బలిదానం చేశారని అన్నారు. కందుకూరులో రాజకీయ హత్య జరిగితే సిఎం నేరుగా వెళ్లి భారీ ఎత్తున పరిహారం ఇచ్చారని, అలాంటిది ప్రజల కోసం చనిపోయిన వారికి సాయం చేయలేరా అని ప్రశ్నించారు. దీనిపై ముఖ్యమంత్రిని కలవడానికి అపాయింట్‌మెంట్‌ కూడా కోరామని, జిల్లా కలెక్టర్‌ను కూడా కలుస్తామని స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేపడతామని అన్నారు. రాష్ట్రంలో గంజాయి బాగా పెరిగిపోయిందని, పిల్లలు కూడా బలైపోతున్నారని అన్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు దీనిపై నోరెత్తకపోవడం అన్యాయమని అన్నారు. గంజాయి మాఫియాలు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో ఉంటున్నారని, నెల్లూరులో కామాక్షి కూడా రెండు పార్టీలనూ వాడుకుందని అన్నారు. టిడిపి, వైసిపి పార్టీలు దీనిపై స్పందించి వారి పార్టీలో ఉన్న గంజాయి వ్యాపారులు, సరఫరాదారులు, పంపిణీదారులను బహిష్కరించాలని డిమాండు చేశారు. మరోవైపు పోలీసులకు ఫిర్యాదు చేస్తుంటే వారితో మీకెందుకని పోలీసులే భయపట్టే పరిస్థితి ఏర్పడిరదని, ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో గంజాయికి ఎంతోమంది పెంచలయ్యలు బలయ్యే ప్రమాదం ఉందని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గంజాయి నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. 

బోర్డు ప్రభుత్వం, పెత్తనం ప్రైవేటుదా ? 

పది మెడికల్‌ కళాశాలల టైటిల్‌ బోర్డు మాత్రమే ప్రభుత్వం చేతిలో ఉంటుందని పెత్తనం ప్రైవేటు కంపెనీల చేతుల్లో ఉంటుందని తాజా మార్గదర్శకాలు వెల్లడిస్తున్నాయని శ్రీనివాసరావు విమర్శించారు. అంటే ఉచితంగా ప్రైవేటు వ్యక్తులకు దారాధత్తం చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే మెడికల్‌ కళాశాలల్లో కన్వీనర్‌ కోటా సీట్లను సగానికి తగ్గించారని, గత ప్రభుత్వ విధానాన్నే వీరు అనుసరిస్తున్నారని, అనేక రాష్ట్రాల్లో పి3 కింద  మెరిట్‌ సీటు వచ్చినా కనీసం రూ.8 లక్షల నుండి రూ.12 లక్షల వరకూ వసూలు చేస్తున్నాని అన్నారు. రాష్ట్రంలో కొన్ని మెడికల్‌ కళాశాలలు నాణ్యతతో ఉన్నా కొన్నింటిల్లో ఫేక్‌ వైద్యులు, ఫేక్‌ రోగులు ఉన్నారని ఇటీవల ఈడి తనిఖీల్లో తేలిందన్నారు. విశాఖలోని గాయత్రి మెడికల్‌ కళాశాలను ఆయన ఉదహరించారు. ఇలా ప్రైవేటు చేతుల్లోకి వెళితే వాటిల్లో పేదలకు వైద్యం అందడం కష్టంగా మారుతుందని విమర్శించారు. ఇప్పటికే పేదలకు బెడ్లు ఉండటం లేదని, భవిష్యత్‌లో అవి కూడా లేకుండా పోతాయని అన్నారు. సమర్థ పాలకులం అని చెప్పుకుంటున్న నేతలు పది మెడికల్‌ కళాశాలలను నిర్వహించలేరా అని ప్రశ్నించారు. అలా నిర్వహించలేనప్పుడు సమర్థ పాలన ఎలా అవుతుందని ప్రశ్నించారు. మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణపై ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పెద్దఎత్తున వ్యతిరేకత వస్తోందని, ఇది ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తుందని అన్నారు. ఇప్పటికైనా జిఓ 847, 107, 108 లను ఉపసంహరించుకోవాలని డిమాండు చేశారు. 

రాష్ట్రంలో పేరెంట్‌ టీచర్స్‌ సమావేశాలను రాజకీయ వేదికలుగా మార్చొద్దని, గతంలో రాజకీయాలకు, విద్యార్థి సంఘాలకు అవకాశం లేదని జిఓ ఇచ్చి ఇప్పుడు తెలుగుదేశం కార్యకర్తలు పిటిఎంలకు వెళ్లాలని చెప్పడం విద్యా వ్యవస్థను చెడగొట్టడమేనన్నారు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు శ్రీనివాసరావు స్పందించారు. పిటిఎంలు నిర్వహించడం మంచిదని, అది విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలతో నిర్వహించాలని అప్పుడే సరైన పద్ధతిలో విద్యా వ్యవస్థ ముందుకు వెళుతుందని పేర్కొన్నారు. అలా కాకుండా రాజకీయ నాయకులు వెళితే అక్కడ రాజకీయ ఘర్షణలు జరుగుతాయని, దీనివల్ల విద్యా వ్యవస్థ పాడవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులను మంచి పౌరులుగా నాయకులుగా తీర్చిదిద్దాలంటే మాక్‌ అసెంబ్లీ జరిపితే సరిపోదని, విద్యార్థి సంఘాలకు ఎన్నికలు జరపాలని, తద్వారా సమాజానికి రాజకీయనాయకత్వం వస్తుందని అన్నారు. చంద్రబాబునాయుడు కూడా అలా వచ్చినవారేనని తెలిపారు. 

ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే విధంగా పవన్‌కల్యాణ్‌ వ్యాఖ్యలు ఉన్నాయని అన్నారు. వాటికి వీడియో ఆధారాలు కూడా ఉన్నాయని అయినా వక్రీకరించొద్దని బుకాయించడం ఏమిటని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వ పాలనలో కొబ్బరి, అరటి, పొగాకు, పత్తితోపాటు అన్ని పంటలకూ ధరలు తగ్గాయని, రైతులను కాపాడే పనిచేయకుండా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం సరికాదని అన్నారు. పైగా దిష్టితగిలితే పంటలు ఎండిపోతాయని అనడమేనా ఆయనకు తెలిసిన సనాతన ధర్మం అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలను బాధ్యత కలిగిన ఉపముఖ్యమంత్రి ఉపసంహరించుకోవాలని డిమాండు చేశారు. 

--