
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 02 డిసెంబర్, 2025.
పిటిఎంలను రాజకీయ ప్రచార వేదికలుగా మార్చొద్దు
డిసెంబర్ 5న రాష్ట్రవ్యాపితంగా పాఠశాలల్లో జరగనున్న మెగా పేరెంట్, టీచర్ సమావేశాలలో పాల్గొనమని తెలుగుదేశం కార్యకర్తలకు ముఖ్యమంత్రి పిలుపునివ్వడం తీవ్ర అభ్యంతరకరం. అధికారిక కార్యక్రమాల్లో తమ పార్టీ కార్యకర్తలను పాల్గొనమని చెప్పడం పార్టీ, ప్రభుత్వ కార్యకలాపాలకు తేడా లేకుండా చేయడమే. పాఠశాల అకడమిక్ కార్యకలాపాలను అధికార పార్టీ రాజకీయ ప్రచారానికి వినియోగించుకోవడం సరైంది కాదు. విద్యా కమిటీలు, తల్లిదండ్రులు, విద్యార్థి ` ఉపాధ్యాయ సంఘాలను మాత్రమే వీటికి అనుమతించాలి.
బయట వ్యక్తులు, విద్యార్థి సంఘాలు విద్యా సంస్థల్లోకి ప్రవేశించరాదని ఒకపక్కన జివో ఇచ్చి మరోపక్కన తమ పార్టీ కార్యకర్తలను మాత్రం విద్యా సంస్థల్లో జరిగే సమావేశాల్లో పాల్గొనమని చెప్పడం ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని వెల్లడిస్తుంది. విద్యాసంస్థల్లో బయటి వ్యక్తులనే పేరుతో విద్యార్థి సంఘాలను నిషేధిస్తూ జారీ చేయడాన్ని రాష్ట్రంలోని విద్యార్థి సంఘాలు, ప్రజాతంత్రవాదులు, మేధావులందరూ నిరసించినా ప్రభుత్వం తన మొండి వైఖరిని కొనసాగిస్తున్నది. కానీ మరోపక్క తమ పార్టీ కార్యకర్తలకు మాత్రం ఎటువంటి ఆటంకం లేకుండా ప్రవేశం కల్పించడం గర్హనీయం.
ప్రజాస్వామ్యయుతంగా విద్యాసంస్థల్లో ప్రవేశానికి అవకాశం కల్పించే విధంగా ప్రభుత్వం ఇప్పటికైనా ఆ జివోను ఉపసంహరించుకోవాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది.
పవన్‌కళ్యాణ్ వ్యాఖ్యలు బాధ్యాతారాహిత్యం
నాలుగు రోజుల క్రితం కోనసీమ కొబ్బరిచెట్లకు తెగులు సోకి ఉత్పత్తి తగ్గడంపై పవన్ కళ్యాణ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల్ని ఇప్పటికైనా ఉపసంహరించుకొని ప్రాంతీయ విద్వేషాలు పెరక్కుండా నివారించాలని సిపిఐ(యం) డిమాండ్ చేస్తున్నది. తెగులును నిర్మూలించడానికి చర్యలు తీసుకోడానికి బదులు తెలంగాణా దిష్టి తగిలిందని ఉపముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమైనవి. కొబ్బరి రైతుల్ని ఆదుకోవడంలో తమ వైఫల్యాన్ని కప్పెట్టుకోడానికి తెలంగాణా ప్రజలపై ఆ నెపం నెట్టడం సహించరానిది. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే ఈ వ్యాఖ్యలను సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది. పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా వాటిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నది.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి
--
COMMUNIST PARTY OF INDIA (MARXIST)
Andhra Pradesh Committee
H.No. 27-30-9,
Akula vari Street,
Governorpet,
Vijayawada - 520 002.
Phone: 0866-2577202;
Web: www.cpimap.org
