కె.పెంచలయ్యను హత్యచేసిన వారిని కఠినంగా శిక్షించాలి.

(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు హోంశాఖా మంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

 

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

విజయవాడ,

తేది : 30 నవంబర్‌, 2025.

 

శ్రీమతి వంగలపూడి అనిత గారికి,

హోంశాఖా మాత్యులు,

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం,

అమరావతి.

విషయం: కె.పెంచలయ్యను హత్యచేసిన హంతకులను, వారికి అండదండలిచ్చి ప్రోత్సహించిన వారందరినీ అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని, గంజాయిపై పోరాటంలో హత్యచేయబడిన కుటుంబాన్ని పరామర్శించి వారికి అన్ని విధాలా పునరావాస చర్యలు తీసుకోవాలని కోరుతూ...

అమ్మా!

గంజాయి, మత్తుమందులను అడ్డుకుని ప్రజలకు అండగా నిలిచిన కె.పెంచలయ్య హత్యకు కుట్రపన్ని దారుణంగా హత్య చేసిన విషయం మీకు తెలిసే ఉంటుంది.

నెల్లూరులోని కల్లూరుపల్లి హౌసింగ్‌ బోర్డు కాలనీలో కె.పెంచలయ్య తన కళారూపాలతో, చైతన్యపరుస్తూ గంజాయి, మత్తుమందులతో కుటుంబాలు నాశనం కారాదని పట్టుదలతో పోలీసులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి గంజాయి అంతం చేయాలని చురుకుగా పని చేస్తున్నారు. వారిని వెంటాడి, వేటాడి అత్యంత దారుణంగా, క్రూరంగా,  కన్నబిడ్డల ముందే కత్తులతో నరికి చంపడం రాష్ట్రంలో తీవ్ర ఆందోళన, ఆవేదన కల్గించింది. హంతకులు కత్తులు, రాడ్లు, మారణాయుధాలతో స్వైరవిహారం చేసి, బైక్‌పై వెళ్తున్న అతడిని తరిమి తరిమి చంపడం వెనుక గంజాయి మాఫియా ఉందనేది స్పష్టం.

గత కొంతకాలంగా గంజాయి ముఠాను నడుపుతూ వారిచేత చోరీలు, నేరాలు గంజాయి, మత్తుమందుల అమ్మకాలు చేయిస్తున్న ఒక మహిళ కారణమని పోలీసులు ఇప్పటికే ప్రకటించారు. ఆమెను తక్షణం అరెస్టు చేయాలి. ఎవరు అధికారంలో ఉంటే వారి అండదండలు ఆమెకు పుష్కలంగా ఉన్నాయని ప్రజలు భావిస్తున్నారు.

గంజాయి మీద ఉక్కు పాదం మోపుతున్నట్లు మీరు పదే పదే ప్రకటిస్తూ వచ్చారు. కానీ గంజాయి ముఠా చేసిన ఈ హత్యపై మీరు కనీసం స్పందించలేదు. మాటమాత్రంగా కూడా ఖండిరచలేదు. గంజాయిపై పోరాడే వారికి మీరు ఎలా భరోసా ఇవ్వగలరు? ఇప్పటికైనా ఆ గంజాయి మాఫీయాకు బలైన యువకుడి కుటుంబాన్ని మీరు సందర్శించి, ఆ కుటుంబానికి భరోసా కల్పించాలని కోరుతున్నాను.  వారిది అత్యంత నిరుపేద దళిత కుటుంబం. పెంచలయ్య భార్యతో పాటు ఇద్దరు చదువుకుంటున్న పిల్లలున్నారు. ఆ కుటుంబానికి కనీసం రూ.50 లక్షల సహాయం, ఆరు ఎకరాల భూమి, ఒక ఇల్లు శాంక్షన్‌ చేయాలి. ఆయన భార్య దుర్గకి ఉద్యోగం కల్పించాలి. ఇద్దరి పిల్లల చదువుకి ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. ఆ మేరకు మీనుండి ప్రకటన వస్తుందని, ఇప్పటికైనా వెంటనే ఆ కుటుంబాన్ని సందర్శించి వారికి భరోసా కల్పిస్తారని ఆశిస్తున్నాను.

రాష్ట్ర వ్యాప్తంగా అక్కడో, ఇక్కడో గంజాయి నేరస్తులను పట్టుకుంటున్నప్పటికీ కీలక సూత్రధారులు యధాతధంగా       ఉన్న ఫలితమే ఈ హత్య. రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి, మద్యం, మత్తుపదార్దాల అక్రమ అమ్మకాల మాఫీయాను అరికట్టేందుకు మరింత స్పష్టమైన, సమగ్రమైన చర్యలు చేపట్టాలని ఈ దారుణ ఘటన హెచ్చరిస్తుంది. ఈ మాఫియా ముఠాలు రాష్ట్రంలో ఎక్కడున్నా అధికార యంత్రాంగంతో అంటకాగి రక్షణ పొందుతున్నారు. ఇలాంటి శక్తులను ప్రోత్సహించేవారు ఏ పార్టీలో ఉన్నా, అధికార యంత్రాంగంలో ఏ స్థానంలో ఉన్నా అలాంటి శక్తులపట్ల కఠినంగా వ్యవహరించాలి. డ్రగ్గు మాఫియాను అరికట్టేందుకు త్రికరణశుద్ధితో తగిన చర్యలు చేపట్టాలి. డ్రగ్గు మాఫియాపై పోరాడే ప్రజలకు బాసటగా మీ ప్రభుత్వం నిలబడాలని కోరుతున్నాను.

అభివందనములతో...

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి