
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 26 నవంబర్, 2025.
(నిన్న (25.11.2025) జరిగిన సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ సమావేశంలో ఆమోదించిన తీర్మానం ప్రచురణార్థం/ ప్రసారార్థం విడుదల చేస్తున్నాము. ఈ సమావేశానికి పార్టీ కేంద్రకమిటీ సభ్యులు కె.లోకనాథం అధ్యక్షత వహించారు. సమావేశంలో పోలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పాల్గొన్నారు. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)
తీర్మానం
పత్తి, అరటి, మొక్కజొన్న రైతులను ఆదుకోవాలి
పత్తి, అరటి, మొక్కజొన్న పంటలకు గిట్టుబాటు ధర కల్పించి రైతుల్ని ఆదుకోవాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. కౌలుకార్డులు లేకపోయినా ఈక్రాప్‌కి ఎడిట్ ఆప్షన్ ఇచ్చి వాస్తవ సాగుదారుల పేర్లతో పంటలను కొనుగోలు చేయాలని, వారి పేరుతోనే డబ్బులు జమ చేయాలని డిమాండ్ చేస్తున్నది.
రాష్ట్రంలో సుమారు 13 లక్షల ఎకరాలు పత్తి సాగు అయ్యింది. ఇందులో ఒక్క కర్నూలు జిల్లాలోనే సుమారు 6 లక్షల ఎకరాలు సాగు అయ్యింది. పత్తి కొనుగోలు విషయంలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడంలోనే అలసత్వం వహించింది. సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభించాల్సిన పత్తి కొనుగోలు కేంద్రాలను అక్టోబర్ చివరలో ప్రారంభించారు. కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన పత్తిని తేమశాతం పేరుతో కొనుగోలు చేయకుండా తిరస్కరిస్తున్నారు. దీనితో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. కపాస్ యాప్‌ని రద్దు చేయాలి. ఈ`క్రాప్ ఆధారంగా నిబంధనలు సడలించి ప్రభుత్వం ప్రకటించిన క్వింటాలుకు రూ.8110లతో మద్దతు ధరలకు సిసిఐ పత్తి కొనుగోలు చేయాలని, కొనుగోలు కేంద్రాలలో తూకాలలో జరుగుచున్న మోసాలను అరికట్టాలి.
అరటి పంటకు గత సంవత్సరం నవంబర్ నెలలో టన్ను రూ.22 వేల వరకు ధర లభించింది. కానీ ఈ సంవత్సరం టన్ను కేవలం రెండు నుంచి మూడు వేల రూపాయలు మాత్రమే ధర పలుకుతున్నది. అనంతపురం, నంద్యాల, కడప జిల్లాలలో అరటి సాగు చేసిన రైతులు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు నష్టపోతున్నారు. గిట్టుబాటు ధర లేకపోవడంతో చాలా ప్రాంతాలలో అరటి తోటలను ట్రాక్టర్లతో దున్ని వేస్తున్నారు. తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకొని మార్కెట్ సౌకర్యం కల్పించాలి. టన్నుకు కనీసం రూ.15 వేలు ధర ఇచ్చి మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేసి అరటి రైతులను ఆదుకోవాలి.
గత సంవత్సరం మిర్చి, పొగాకు తదితర పంటలకు సరైన గిట్టుబాటు ధర లేకపోవడంతో ఈ సంవత్సరం మొక్కజొన్న విస్తీర్ణం బాగా పెరిగింది. నంద్యాల, కర్నూలు, అనంతపురం, సత్యసాయి, కడప, విజయనగరం జిల్లాలలో మొక్కజొన్న పండిరచిన రైతులు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర అమలుకాక ప్రయివేటు వ్యాపారుల దోపిడీకి గురి అవుచున్నారు. తక్షణమే ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాలుకు రూ.2,400లతో కొనుగోలు చేసి మొక్కజొన్న రైతులను ఆదుకోవాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది.
ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు తెరవకపోవడంతో ఇప్పటికే మధ్య దళారులు రైతుల వద్ద సగానికి పైగా కొనుగోలు చేసేశారు. దళారీలు మళ్ళీ మద్దతు ధరకు కొనుగోలు కేంద్రాలలో అమ్మే అవకాశం ఉంది. దీన్ని నివారించి రైతులకు న్యాయం చేయాలి.
= = = =
--
COMMUNIST PARTY OF INDIA (MARXIST)
Andhra Pradesh Committee
H.No. 27-30-9,
Akula vari Street,
Governorpet,
Vijayawada - 520 002.
Phone: 0866-2577202;
Web: www.cpimap.org
