
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 25 నవంబర్, 2025.
(ఈరోజు (25.11.2025) జరిగిన సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ సమావేశంలో ఆమోదించిన తీర్మానం ప్రచురణార్థం/ ప్రసారార్థం విడుదల చేస్తున్నాము. ఈ సమావేశానికి పార్టీ కేంద్రకమిటీ సభ్యులు కె.లోకనాథం అధ్యక్షత వహించారు. సమావేశంలో పోలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పాల్గొన్నారు. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)
తీర్మానం
మావోయిస్టులపై ప్రభుత్వ నిర్బంధాన్ని ఆపాలి
ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులపై జరుగుతున్న నిర్బంధాన్ని తక్షణమే నిలిపివేయాలని సిపిఐ(యం) రాష్ట్రకమిటీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది. వారితో చర్చలు జరిపి ఈ సమస్యకు పరిష్కారాన్ని కనుగొనాలని కోరుతున్నది. మావోయిస్టుల భౌతిక నిర్మూలనే లక్ష్యంగా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రకటనలు ప్రజాస్వామ్యానికి ప్రమాదంగా మారుతుంది.
ఇటీవల మన రాష్ట్రంలో కూడా ఆపరేషన్ సంభవ్ పేరుతో వరుసగా జరిగిన రెండు ఘటనల్లో పట్టుకొని కాల్చేసి ఎన్‌కౌంటర్లుగా పేర్కొన్నట్లు వార్తలొచ్చాయి. మరికొంత మందిని అరెస్టు చేశారు. ఇప్పటికీ కొంత మంది పోలీసు నిర్బంధంలో ఉన్నారు. తక్షణం అణచివేత చర్యలు నిలిపివేయాలి. అమాయక గిరిజనులను మావోయిస్టులకు సహకరిస్తున్నారని, మిలిషియాగా పనిచేస్తున్నారని పోలీసులు వివిధ రూపాల్లో వేధిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వేధింపులను, అణచివేతను ఆపాలని, పోలీసు ఆధీనంలో ఉన్న మావోయిస్టులను కోర్టుముందు హాజరుపర్చాలని సిపిఐ(యం) డిమాండ్ చేస్తున్నది. ఎన్‌కౌంటర్‌లపై న్యాయ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేస్తున్నది.
విలువైన ఖనిజ సంపదతో కూడిన విశాలమైన అడవుల్ని, సహజ సంపదను కార్పొరేట్లకు అప్పగించే లక్ష్యంతో ఆపరేషన్ కగార్ చేపట్టింది. ఇందుకు అడ్డును తొలగించుకోవడం కోసం ఈ ఏడాది కాలంలోనే మావోయిస్టులు, అర్బన్ నక్సల్స్ పేరుతో వారి సానుభూతిపరులను ఏడెనిమిది వందల మందిని కేంద్ర ప్రభుత్వ దళాలు కాల్చి చంపాయి. అందులో ఆదివాసీలు, మహిళలు అధికంగా ఉన్నారు. మావోయిస్టులు, ఆదివాసీలపై జరుగుతున్న సాయుధ దళాల నిర్బంధాన్ని తక్షణమే నిలిపివేయాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది.
= = = =
