మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రముఖ నేత తిప్పిరి తిరుపతి అలియాస్‌ దేవ్‌ జీ సహా అరెస్టు చేసిన అందరినీ వెంటనే కోర్టులో హాజరు పరచాలి. ఎదురు కాల్పుల పై న్యాయ విచారణ జరిపించాలి.

వామపక్ష పార్టీల తరపున

 

మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రముఖ నేత తిప్పిరి తిరుపతి అలియాస్‌ దేవ్‌ జీ సహా అరెస్టు చేసిన 

అందరినీ వెంటనే కోర్టులో హాజరు పరచాలి.

ఎదురు కాల్పుల పై న్యాయ విచారణ జరిపించాలి.                     

అడవులనూ, అటవీ సంపదలనూ బడా కార్పొరేట్లకు కట్టబెట్టే ఆపరేషన్‌ కగార్‌ ని  నిలిపివేయాలి.              

ఆంధ్రప్రదేశ్‌ వామపక్షాల డిమాండ్‌

 

అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి ఏజెన్సీలో జరిగిన వరుస ఎన్‌కౌంటర్లపై న్యాయ విచారణ జరపాలని వామపక్ష పార్టీలు డిమాండ్‌ చేస్తున్నాయి. హిడ్మాతో సహా ఈ ఎన్‌కౌంటర్‌లో మొత్తం 13 మంది మావోయిస్టులు మరణించారు. అటవీ ప్రాంతంలో మావోయిస్టులను ముందుగానే నిర్బంధించి ఆ తరువాత పోలీసులు కాల్చి చంపారని  ప్రజలలో పలు అనుమానాలు, సందేహాలున్నాయి. వివిధ చోట్ల నిర్బంధించబడిన మావోయిస్టులు, వారి అనుయాయులను వెంటనే సంబంధిత న్యాయ స్థానాల ముందుంచాలని కోరుతున్నాం. 

ఇంతవరకూ అడవుల్లో దొరికిన వారిని అడవుల్లోనే ఎదురు కాల్పుల పేరిట కాల్చి చంపారు. ఇప్పుడు అడవుల నుండి బయటకు వచ్చి పట్టణ, నగర ప్రాంతాలలో తల దాచుకున్న వారిని పట్టుకొని అడవులకు తీసుకెళ్లి ఎదురు కాల్పుల పేరిట కాల్చి చంపుతున్నారు. విదేశీ, స్వదేశీ పెట్టుబడిదారులకు సహజవనరులు, అటవీ సంపద, భూమి కట్టబెట్టేందుకే చంద్రబాబు ప్రభుత్వం మద్దతుతో మోడీ ప్రభుత్వం ఈ తరహా ఎదురు కాల్పుల ప్రక్రియకు మన రాష్ట్రాన్ని ప్రయోగశాలగా మారుస్తున్నది. ఈ తరహా నయాఫాసిస్టు నిర్భంద విధానాన్ని వామపక్ష పార్టీలు తీవ్రంగా ఖండిస్తున్నాయి.          

మోడీ షా ప్రభుత్వం తలపెట్టిన ఆపరేషన్‌ కగార్‌ దాదాపు ఏడాది కాలంగా అడవులను, ముఖ్యంగా దండకారణ్య ప్రాంతాన్ని రక్తసిక్తం చేస్తున్నది. విలువైన ఖనిజ సంపదతో కూడిన విశాలమైన అడవుల్ని అంబానీ ఆదానీ, వంటి కార్పొరేట్లకు అప్పగించే లక్ష్యంతో ఆపరేషన్‌ కగార్‌ చేపట్టింది. అందుకు అడ్డుకున్నారని భావించి మావోయిస్టు పార్టీ నాయకులతో పాటు వందలాది ఆదివాసీలను కాల్చి చంపుతున్నది. ఈ ఆపరేషన్‌ కగార్‌ వాస్తవ లక్ష్యం అటవీ సంపదతో సహా కొట్లాది ఎకరాల అడవుల్ని కార్పొరేట్‌ కంపెనీలకి కారుచౌకగా అప్పగించడమే. ఏడాది కాలంలోనే ఏడెనిమిది వందల మందిని కాల్చి చంపింది. అందులో ఆదివాసీల శాతం అధికంగా వుంది. ముఖ్యంగా మహిళల శాతం గణనీయంగా వుంది. ఆఖరికి అడవుల నుండి బయటకు వచ్చి పట్టణ సురక్షిత స్థలాలకు చేరి తల దాచుకున్న వారిని కూడా ప్రాణాలతో మిగలనివ్వడం లేదు. మొన్న, నిన్న జరిగిన పరిణామాలు ఇందుకు నిదర్శనం.  నవంబర్‌ 18, 19 తేదీల్లో విజయవాడ, ఏలూరు వంటి నగరాలలో సైతం ప్రాణ భద్రత కోసం తమ తల దాచుకున్న వారిని సజీవంగా బంధించారు. వారిని కోర్టుకు అప్పగించాలి.

మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా ప్రచారం అవుతున్న తిప్పిరి తిరుపతి ఉరఫ్‌ దేవ్‌ జీ ని కూడా అరెస్టు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. తమ అదుపులో ఉన్నట్లు ఒకసారి, అలాంటిదేమీ లేదని మరోసారి, ఎదురు కాల్పుల్లో మరణించినట్లు ఒకసారి, అలాంటిదేమీ లేదని మరోసారి రకరకాల కధనాలు వస్తున్నాయి. ఆయనతో పాటు విజయవాడ, ఏలూరు వంటి చోట్ల అరెస్టు చేసిన అందరినీ వెంటనే కోర్టులో అప్పగించాలని మా పార్టీలు కేంద్ర, రాష్ట్ర సర్కార్లను డిమాండ్‌ చేస్తున్నాయి. 

ఆపరేషన్‌ కగార్‌ పేరిట జరిగే మొత్తం ఎదురు కాల్పుల మీద ఉన్నత న్యాయస్థానం తో సమగ్ర విచారణ జరపాలని, ఆదివాసీ ప్రజలను నిర్వాసితుల్ని చేసే విధానాల్ని విరామించుకోవాలని, ఆపరేషన్‌ కగార్‌ని వెంటనే ఆపాలని వామపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

 

   (వి.శ్రీనివాసరావు) (జి.ఈశ్వరయ్య) (పి.ప్రసాద్‌)

      సిపిఐ(యం)                            సిపిఐ                 సిపిఐ(యంఎల్‌) న్యూడెమోక్రసీ

 

   (జాస్తి కిషోర్‌బాబు)                (కాటం నాగభూషణం)                                     (బి.బంగార్రావు)    

    సిపిఐ(యంఎల్‌)                         యంసిపిఐ(యు)                 సిపిఐ(యంఎల్‌) లిబరేషన్‌

 

 

       (యం.రామకృష్ణ)      (బి.ఎస్‌. అమర్‌నాథ్‌)    (పి.వి.సుందరరామరాజు)      (జానకి రాములు) 

  సిపిఐ(యంఎల్‌) న్యూడెమోక్రసీ    యస్‌యుసిఐ(సి)   ఫార్వర్డ్‌బ్లాక్‌      రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ