
(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
విజయవాడ,
తేది : 09 నవంబర్, 2025.
శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,
గౌరవ ముఖ్యమంత్రి,
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,
అమరావతి.
విషయం : తిరుపతి జిల్లాలోని రాయలచెరువు గండిపడి సర్వస్వం కోల్పోయిన కళత్తూరు దళితవాడకు పునరావాసం గురించి...
అయ్యా!
తిరుపతి జిల్లా కేవీబి పురం మండలం ఓళ్ళూరు రాయల చెరువు కట్టకు గండిపడి కళత్తూరు దళితవాడ, పాతపాలెం అరుంధతి వాడ పూర్తిగా వరద ప్రవాహనికి గురై 7అడుగుల మేర బురద నీరు పేరుకుపోయి తీవ్ర నష్టం వాటిల్లింది. ఈనెల 7వ తేదీన నేను ఆ గ్రామాన్ని సందర్శించి స్వయంగా వారి బాధలను గమనించాను. అధికార యంత్రాంగం తక్షణం కదిలి రిలీఫ్ యాక్టివిటీ ప్రారంభించడం హర్షణీయం. దాదాపు 700 కుటుంబాలు పూర్తిగా సర్వస్వం కోల్పోయి కట్టు బట్టలతో మిగిలారు. ఇళ్లల్లో వాడుకునే నిత్యవసర సరుకులు దగ్గర నుంచి బట్టలు, వంట సామాగ్రి వస్తువులు, స్కూటర్లు, ఆటోలు, ట్రాక్టర్లు, బీడీ కార్మికుల బీడీలు, మత్స్య కార్మికుల వలలు మొత్తం వరద ప్రవాహానికి కొట్టుకుపోయాయి. సుమారు 900 ఆవులు, గేదెలు, 23 పూరిళ్ళు పూర్తిగా కొట్టుకుపోయాయి. రాయలచెరువు ఆయకట్టు మరియు కలత్తూరు చెరువు రాయకట్టు పరిధిలోని సుమారు 2000 ఎకరాలకు పైగా ఇసుక మేటలు వేసి సాగుకు పనికిరాకుండా పోయాయి. దీంతో తీవ్ర నష్టాలకు గురైన రైతులను, ప్రజలను ప్రభుత్వం ఆదుకోవాలి.
లోతట్టు ప్రాంతమైన కళత్తూరు దళితవాడను ఎగువ ప్రాంతానికి తరలించాలని స్థానిక ప్రజలు ఎప్పటి నుండో కోరుతున్నారు. ప్రత్యామ్నాయ స్థలం విషయంలో పెత్తందార్లు ఆటంకాలు కల్పిస్తున్నట్లు నా దృష్టికి వచ్చింది. ఇప్పటికైనా పూర్తిగా మెట్ట ప్రాంతానికి తరలించి శాశ్వత పునరావాసం కల్పించాలి. ప్రభుత్వం ఈ విపత్తును ప్రత్యేకంగా పరిగణించి ఐదు సెంట్లు ఇంటి స్థలంతోపాటు ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇవ్వాలి. ప్రతి కుటుంబానికి రెండు ఎకరాలు సాగు భూమి ఇవ్వాలి. స్థానికంగా 700 ఎకరాలు ఇప్పటికే పేదలు సాగులో ఉన్నాయి. అటవీ శాఖ వారి పరిధిలో లేకున్నా దీనిపై అభ్యంతరాలు పెడుతున్నారు. పేద రైతుల్ని వేధిస్తున్నారు. రెవెన్యూ ఫారెస్ట్ మధ్య వివాదంగా ఉన్న ఈ భూమి సమస్యను పరిష్కరించి ప్రతి కుటుంబానికి రెండు ఎకరాలు చొప్పున పట్టాలు ఇవ్వాలని కోరుతున్నాను.
దారుణంగా దెబ్బతిన్న కుటుంబాలు కోలుకోడానికి చాలాకాలం పడుతుంది. వారికి ప్రస్తుతం ప్రభుత్వం ప్రకటించిన సహాయంతోపాటు రూ.5 లక్షల పునరావస ప్యాకేజీ ఇచ్చి ప్రభుత్వం వారిని ఆదుకోవాలి. ఇసుక మేటలు వేసిన పొలాలకు ఎకరాకు రూ.50 వేల చొప్పున పరిహారం ఇచ్చి ఆదుకోవాలని కోరుతున్నాను.
చాలా సంవత్సరాలుగా ఈ చెరువుకు మరమ్మత్తులు చేయకపోవడం, నిర్వహణ లోపం వల్ల గండ్లు పడి గ్రామాలను ముంచెత్తింది. దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చర్య తీసుకోవాలి. తక్షణం నిధులు కేటాయించి మరమ్మత్తులు చేయించి తదుపరి పంట వేసుకోడానికి సహాయం చేయాలని కోరుతున్నాను.
అభివందనములతో...
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి
--
COMMUNIST PARTY OF INDIA (MARXIST)
Andhra Pradesh Committee
H.No. 27-30-9,
Akula vari Street,
Governorpet,
Vijayawada - 520 002.
Phone: 0866-2577202;
Web: www.cpimap.org
