
ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మంత్రిగారికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి
విజయవాడ,
తేది : 04 నవంబరు, 2025.
శ్రీయుత నారా లోకేష్ గారికి,
రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్స్ శాఖా మంత్రివర్యులు,
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,
అమరావతి.
విషయం: రాష్ట్రంలో స్పోర్ట్స్ యూనివర్సిటీ (క్రీడా విశ్వవిద్యాలయం) స్థాపించుట గురించి..
అయ్యా,
జాతీయ, అంతర్జాతీయంగా క్రీడలకు పెరుగుతున్న ఆదరణ రీత్యా మన రాష్ట్రం నుండి వివిధ క్రీడలలో నైపుణ్యం కలిగిన వారికి అత్యుత్తమ శిక్షణ ఇచ్చి తీర్చిదిద్దేందుకు, క్షేత్రస్థాయి నుండి క్రీడాకారులను ప్రోత్సహించేందుకు, రాష్ట్రంలో క్రీడా కార్యకలాపాలను సమన్వయం చేయడానికి ప్రత్యేకంగా క్రీడా విశ్వవిద్యాలయం స్థాపించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
ఇటీవల ముంబయిలో జరిగిన క్రికెట్ వన్డే ప్రపంచ కప్ పోరులో మన మహిళా టీం ఘనవిజయం సాధించడం పట్ల యావత్ భారతదేశం హర్షం వ్యక్తం చేసింది. ఇటీవల కాలంలో మహిళలు క్రీడారంగంలో ముందంజలో దూసుకు వస్తున్నప్పటికీ ప్రభుత్వాల నుండి తగిన ప్రోత్సాహం లేదు. ఏదో ఒక క్రీడలో స్వశక్తిపై విజయం సాధించాక ప్రభుత్వాలు వారికి సన్మానాలు చేసి ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. తాజాగా క్రికెట్‌లో విజయం సాధించిన టీమ్‌లో సభ్యులు వివిధ మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలను పరిశీలిస్తే తల్లిదండ్రులు, బంధుమిత్రులు, కోచ్‌లు ఇచ్చిన ప్రోత్సాహమే ప్రధానంగా ఉంది తప్ప ప్రభుత్వాల ప్రోత్సాహం ఉన్నట్టుగా ఎవరూ చెప్పలేకపోయారు. బీసీసీఐ, ఐసిసి లాంటి సంస్థలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయి నుండి క్రీడాకారులను ప్రోత్సాహించే విధానం లేదు. క్రికెట్ పోటీలకు వివిధ కార్పొరేట్ సంస్థలు క్రీడాకారులను కొనుగోలు చేసేందుకు పోటీలు పడుతున్నాయి. ఒకరకంగా క్రీడలు ప్రత్యేకించి క్రికెట్ వ్యాపార రంగంగా మారిపోయింది. విజయం సాధించేందుకు, ఇతరులను ఓడిరచడానికి తప్పుడు పద్ధతులు అనుసరించడం, బెట్టింగులు ప్రవేశించడంతో క్రీడా స్ఫూర్తి దెబ్బతింటున్నది. క్రీడాకారులకు అన్యాయం జరుగుతున్నది. ఈ బెట్టింగ్‌లకు మాఫియా కేంద్రంగా ఉన్నది. దీనికి యువత బలైపోతున్నది. అందుకే అంతర్జాతీయ పోటీలో మన క్రీడాకారులు రాణించలేకపోతున్నారు.
విద్యార్ధి దశనుండే క్రీడా నైపుణ్యాన్ని తీర్చిదిద్దాలి. ఇది వ్యాపార రంగంగా కాకుండా జాతీయ ప్రతిష్టను పెంచే సాధనంగా ఉండాలి. యువతరం దృఢమైన శక్తిగా మారాలంటే దీనికి ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి. అందుకు విద్యా విధానంలో మార్పులు తీసుకురావాలి. మన రాష్ట్రంలో మూడు క్రీడా పాఠశాలలున్నప్పటికీ అందులో విజయనగరం కేంద్రాన్ని మూసివేశారు. మిగతా రెండు అంతంత మాత్రమే నడుస్తున్నాయి. స్టేడియాల్లో తగినంత మంది కోచ్‌లు కూడా లేరు. శాప్ తరఫున కొంతమంది కోచ్‌లు అక్కడక్కడ ఉన్నప్పటికీ నిధులు లేక కార్యకలాపాలు పెద్దగా సాగటం లేదు. వాస్తవిక పరిస్థితిని పరిశీలించి క్రీడా శిక్షణ సమర్ధవంతంగా నడిచేటట్లు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. ఇందుకు ప్రత్యేక విశ్వవిద్యాలయాన్ని స్ధాపించడం ముందడుగుగా ఉంటుంది. మీ పరిశీలన కోసం ఈ ఉత్తరాన్ని రాస్తున్నాను. సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నాను.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి
