ఈరోజు (02 నవంబర్, 2025) విలేకర్ల సమావేశం (విజయవాడలో) జరిగింది. ఆ వివరాలను ప్రచురణార్థం/ ప్రసారర్థం పంపుతున్నాము. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి
ఉచిత పంటల భీమా పున:ప్రారంభించాలి.
కౌలు రైతులను ఆదుకోవాలి.
పరిహారంతో పాటు ధాన్యం కొనుగోలు చేయాలి
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు డిమాండ్
రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని మొంథా తుఫాన్ బాగా దెబ్బతీసిందని, ఈ తుఫాన్‌తో నష్టపోయిన వాస్తవ బాధితులను నమోదు చేయడం లేదని సిపిఎం రాష్ట్రకార్యదర్శి వి శ్రీనివాసరావు అన్నారు. తుఫాన్‌ను నియంత్రిచడం వల్ల తక్కువ నష్టం జరిగిందని రాష్ట్రప్రభుత్వం చూపించేందుకు తగ్గించి చూపుతుందని పేర్కొన్నారు. తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులకు పూర్తి పంట నష్టపరిహారం చెల్లించడంతో వారి నుంచి ధాన్యం కూడా కొనుగోగుల చేయాలని డిమాండ్ చేశారు. విజయవాడలోని బాలోత్సవ భవన్‌లో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని మొంథా బాగా దెబ్బతీసిందని శ్రీనివాసరావు అన్నారు.
ప్రకృత్తి వైపరీత్యాలు వచ్చిన సమయంలో పంటల బీమా పథకం రైతులకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దాలని కోరారు. 2019`20లో నాటి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం రూ.1తో ఉచిత పంటల బీమా పథకం తీసుకొచ్చిందన్నారు. ప్రీమియం మొత్తం కేంద్ర,రాష్ట్రప్రభుత్వాలు భరించాయని, ఈ`క్రాప్ చేసిన ప్రతి రైతుకు ఇన్సూరెన్స్ వచ్చిందన్నారు. 2022లో వచ్చిన వరదల సమయంలో ఈ పథకం వల్ల రాష్ట్రం మొత్తం రూ.3వేల కోట్లు వస్తే ఒక్క అనంతపురం జిల్లాకే రూ.1000కోట్లు వచ్చిందని వివరించారు. కాని దీని వల్ల కౌలు రైతులకు ఏ మేలు జరగలేదన్నారు. ఎన్నికల సమయంలో కౌలు రైతులకు కూడా వర్తించేలా సమగ్ర పంటల బీమా పథకం ప్రవేశపెడతామని టిడిపి వాగ్దానం చేసిందని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చిన తరువాత కేంద్రప్రభుత్వం ఒత్తిడితో 2024 రబీ నుంచి ఉచిత పంటల బీమా పథకాన్ని ఎత్తివేసి, రైతులే ప్రీమియం చెల్లించే స్వచ్ఛంధ బీమా పథకాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు. ఉచిత పంటల బీమా పథకం వల్ల 2024 ఖరీప్‌లో 35లక్షల మంది రైతులకు 84లక్షల ఎకరాలకు ఇన్సూరెన్స్ వర్తిస్తే, కొత్త పథకం వల్ల ప్రస్తుతం ఈ సంఖ్య19 లక్షల ఎకరాలకు పడిపోయిందన్నారు. భీమా చెల్లిస్తున్న రైతుల సంఖ్య 7 లక్షలకు తగ్గిందన్నారు. అన్ని పంటలు వర్తించేలా ఉన్న ఫసల్, వాతావరణ బీమా పథకాలు కేవలం బ్యాంకు రుణాలు తీసుకున్న రైతులకే వర్తిస్తున్నాయన్నారు. ఉచిత పంటల కింద గతంలో ఎన్ని ఎకరాలు రూ.1లు చెల్లించే రైతులు ఇప్పుడు ఎకరాకు రూ.600ల నుంచి రూ.2వేల వరకు చెల్లిస్తున్నారని వివరించారు. ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రభుత్వాలు నిర్వహించకూడదని మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఒత్తిడి వల్ల రాష్ట్రప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న పంటల బీమా కార్పొరేషన్‌ను వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. రైతుల ప్రయోజనాల కోసం రాష్ట్రప్రభుత్వం ఇన్సూరెన్స్ కంపెనీ ఏర్పాటు చేసుకునే అధికారం ప్రభుత్వాలకు లేదా? అని నిలదీశారు. ప్రైవేట్, కార్పొరేట్ కంపెనీలకు ఉండే అధికారం రాష్ట్రప్రభుత్వానికి లేదా? అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం దీనిని ప్రశ్నించలేదని, ప్రస్తుత ప్రభుత్వం అసలు పట్టించుకోలేదన్నారు. ప్రభుత్వమే పంటల బీమా కంపెనీ పెట్టి ఉచిత బీమా పథకం అమలు చేస్తే ఎలాంటి నష్టం ఉండదని తెలిపారు. 2024 ఖరీఫ్‌లో రైతులు, కేంద్ర,రాష్ట్రప్రభుత్వాలు కలిపి రూ.1100 కోట్ల ప్రీమియం చెల్లిస్తే రైతులకు కేవలం రూ.9కోట్లే వచ్చిందన్నారు. పంటల బీమా పథకం 75శాతం ప్రైవేట్ కంపెనీలదే అని, ఆ కంపెనీలు రైతులకు పరిహారం ఇవ్వడం లేదన్నారు. గతేడాది రూ.1875కోట్ల పరిహారం చెల్లించాల్సి ఉండగా ప్రైవేట్ కంపెనీలు ఒక్క రూపాయి కూడా విడుదల చేయకుండా సవాలక్ష కొర్రీలు పెడుతున్నాయని తెలిపారు. ప్రభుత్వ, రైతుల డబ్బులను ప్రైవేట్ కంపెనీలకు కట్టబెట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం పంటల భీమా ఏ స్థితిలో ఉందో అధికారులకు కూడా తెలియక గందరగోళంలో ఉన్నారన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వంపై రాష్ట్రప్రభుత్వం ఒత్తిడి తెచ్చి ఇన్సూరెన్స్ కంపెనీని తిరిగి ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేయాలని, ప్రైవేట్ కంపెనీల జోక్యం లేకుండా ప్రభుత్వాలే రైతులకు సకాలంలో ఇన్సూరెన్సు పరిహారం అందించాలని కోరారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఆటోమేటిక్‌గా ఇన్సూరెన్స్ అప్లై అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
కౌలుదారులకే పరిహారం అందించాలి
భూమిలేని కౌలుదారులు 91శాతం మందికి తుఫాన్ పరిహారం అందడం లేదన్నారు. 25 లక్షల మంది కౌలుదారులు ఉంటే కేవలం 4లక్షల కార్డులే ఇచ్చారని, భూ యాజమాని సంతకం లేకుండా బ్యాంకులు రుణం ఇవ్వడం లేదని తెలిపారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో తుఫాన్ వల్ల 80శాతం నష్టపోయింది కౌలు దారులేని పేర్కొన్నారు. వీరికి రుణాలు ఇవ్వకుండా వ్యవసాయాన్ని ప్రభుత్వం ఎలా రక్షిస్తుందని ప్రశ్నించారు. గుర్తింపు కార్డులు, బ్యాంకు రుణాలతో నిమిత్తం లేకుండా కౌలు దారుల దరఖాస్తులను సచివాలయాల్లో బహిరంగంగా విచారణ జరిపించి తుఫాను నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కౌలు దారులకు కాకుండా భూ యాజమానికి పరిహారం చెల్లించడం దారుణమని, ఘోరమని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విధానం వ్యవసాయాన్ని చేజేతులా నాశనం చేసినట్లు అవుతుందని పేర్కొన్నారు. వరిపంట పండిస్తోంది ఎక్కువమంది కౌలుదారులేనని చెప్పారు. ఈ పంట దెబ్బతింటే ఆహార భద్రతకు మప్పు వస్తుందని మార్కెట్‌లో బియ్యం ధరలు పెరగడంతో పాటు దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుందని పేర్కొన్నారు. కౌలుదారులను ఆదుకునేందుకు కార్డులతో నిమిత్తం లేకుండా పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పంట నష్టం 33శాతానికి మించితే రూ.10వేలు పరిహారం చెల్లించాలని వ్యవసాయ శాఖ ఆదేశాలు జారీ చేసిందన్నారు. పంట నష్టపరిహారం అందినవారికి ధాన్యం కొనుగోలు చేయబోమని ఈ ఆదేశాల్లో వ్యవసాయ శాఖ కొర్రి పెట్టిందన్నారు. దెబ్బతిన్న ధాన్యాన్ని మిల్లర్లకు అమ్ముకోవాలని, తమకు కొనుగోలు చేయొద్దని స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని వ్యవసాయ శాఖ అధికారుల చెప్తున్నారని రైతులు అంటున్నారు. మరో పక్క అందరి ధాన్యం కొనుగోలు చేస్తామని పౌరసరఫరాల శాఖమంత్రి మాత్రం వివరణ ఇచ్చారని తెలిపారు. అలాంటప్పుడు వ్యవసాయ శాఖ తన ఆదేశాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. నష్ట పరిహారంతో నిమిత్తం లేకుండా రైతులందరి నుంచి పౌరసరఫరాల శాఖ, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్‌సిఐ)లు ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. తడిచిన ధాన్యం కొనుగోల్లో నిబంధనలు సడలించాలని కోరారు.
అనకాపల్లి జిల్లాలో తుమ్మపాల వద్ద మోకాలి లోతులో ఉన్న 300 ఎకరాల వరిపంటపొలాలను శనివారం తాను పరిశీలించానని తెలిపారు. ఈ పంటకు పరిహారం ఇప్పించాల్సిన సచివాలయ అధికారులు, మూడు నెలల నుంచి మునిగే ఉందని నమోదు చేయబోమన్నారు. రియల్ ఎస్టేట్ వెంచర్లు డ్రైనేజ్ వ్యవస్థను పూర్తిగా మూసివేయడంతో ఇవి మునిగాయని తెలిపారు. కాలువలను తవ్వకుండా రియల్ ఎస్టేట్‌కు కొమ్ముకాసి మునిగిన పంటకు పరిహారం ఇవ్వబోమని అధికారులు చెప్పడం సరికాదని, రాష్ట్రంలో ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయని వివరించారు.
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో జరిగిన సంఘటన చాలా ఘోరం
ఉత్తరాంధ్ర తిరుపతి ప్రచారంలో ఉన్న దేవాలయం ప్రభుత్వ దృష్టిలో లేదని దేవాదాయ శాఖ మంత్రి చెప్పడం సరికాదన్నారు. తుఫాన్‌ను అడ్డుకునే శక్తి ఉందని చెప్పుకుంటున్న వారికి దేవాలయంలో ఏం జరుగుతుందో తెలియకపోవడం ఆశ్చర్యకరమన్నారు. ప్రైవేట్ వ్యక్తుల ఆధ్వర్యంలో ఇంత పెద్ద దేవాలయాన్ని అప్పగించకూడదని, ఏవరికీ బాధ్యత ఉండదని, ఏవరికీ నిర్వాహకులు సమాధానం ఇవ్వరని తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ గుడిని దేవాదాయ శాఖ తన పరిధిలోకి తీసుకొని నియంత్రించాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన సాయం సరిపోదని, మృతుల కుటుంబాలకు రూ.25లక్షలు, క్షతగాత్రులకు రూ.5లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వెంకటేశ్వరస్వామి దేవాలయం వద్ద జరిగిన సంఘటనలో ప్రభుత్వం తప్పించుకునే ధోరణి చూస్తుంటే ప్రజలకు భద్రత కల్పించేందుకు పోలీసులు ఉన్నారా? లేదా ప్రజా ఉద్యమాలను అణచి అంబానీ, అదానీలను ఆదుకోవడానికా? అనే మౌళిక ప్రశ్న తలెత్తుతోందన్నారు.
అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో జరుగుతున్న ఆందోళన వద్దకు శనివారం తాను వెళ్తున్న దారిలో ప్రసిద్ధి చెందిన దేవాలయానికి పెద్దఎత్తున జనాలు వస్తే కేవలం ఇద్దరు కానిస్టేబుళ్లు మాత్రమే ఉన్నారని తెలిపారు. తాము ఆందోళనకు వెళ్తున్న మార్గంలో వందల సంఖ్యలో పోలీసులను మోహరించడంతో పాటు అడుగడుగున చెక్‌పోస్టులు పెట్టారని వివరించారు. ఇప్పటికైనా పోలీస్ వ్యవస్థ తీరును సంస్కరించాలని, ప్రజాపోలీస్‌గా మార్చాలని కోరారు. నిర్బంధ పోలీస్‌గా ప్రజలను అణచివేసే సాధనంగా పోలీస్ యంత్రాంగం ఉండకూడదన్నారు.
పేదరిక నిర్మూలనలో కేరళను రాష్ట్ర ప్రభుత్వం ఆదర్శంగా తీసుకోవాలి
పేదరిక నిర్మూలనలో మన రాష్ట్రప్రభుత్వం కేరళ ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకొని క్షేత్రస్థాయిలో స్థానిక సంస్థలను, ప్రజలను భాగస్వామ్యం చేసి ప్రభుత్వమే పేదరికాన్ని పరిష్కరించాలని శ్రీనివాసరావు సూచించారు. దేశంలోనే మొట్టమొదటి పేదల రహిత రాష్ట్రంగా కేరళను నీతిఆయోగ్ ప్రకటించిందని,వామపక్ష ఉద్యమానికి ఇది పెద్ద విజయమని చెప్పారు. రాష్ట్రంలో పి4 పేరుతో పేదరికం నిర్మూలిస్తామని రాష్ట్రప్రభుత్వం డప్పు వాయిస్తుందని,కానీ ఈ పథకం కింద ఒక్కరూ కూడా పేదరికం నుంచి బయటపడలేదన్నారు. కార్పొరేట్లు పెద్దగా స్పందించకపోవడంతో అధికార పక్షం కూడా పి4 ఫెయిలైందని అంగీకరిస్తుందని వివరించారు. ఇలాంటి పథకాలు, ప్రచార ఆర్భాటంతో పేదరిక నిర్మూలన సాధ్యం కాదన్నారు. పేదరికం నుంచి బయటపడేందుకు అవసరమైన మౌలిక సమస్యలను పంచాయతీల ఆధ్వర్యంలో అన్ని శాఖలు సమన్వయం చేసుకొని కేరళలో పరిష్కరించి పేదరికాన్ని అధిగమించారని తెలిపారు. రాష్ట్రంలో తీవ్ర పేదరికం 17శాతం ఉంటే కేరళలో 0.7శాతం మాత్రమే ఉందని పేర్కొన్నారు. ఇప్పుడు దీనిని కూడా నిర్మూలించి పేద రహిత రాష్ట్రంగా కేరళ దేశానికి ఆదర్శంగా నిలబడిరదన్నారు.
--
COMMUNIST PARTY OF INDIA (MARXIST)
Andhra Pradesh Committee
H.No. 27-30-9,
Akula vari Street,
Governorpet,
Vijayawada - 520 002.
Phone: 0866-2577202;
Web: www.cpimap.org
