
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 01 నవంబరు, 2025.
అమెరికాలో నివసిస్తున్న భారతీయులపై నిందలు మోపుతూ అమెరికా లేబర్ డిపార్ట్మెంట్ ‘ఎక్స్’ లో ప్రకటన విడుదల చేయడాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది. హెచ్ 1 బి వీసా దుర్వినియగం అవుతుందన్న నెపంతో భారతీయ విద్యార్థులు, ఉద్యోగులపై విద్వేషం రెచ్చగొడుతున్నారు. తీవ్ర జాతీయ ఉన్మాదానికి ట్రంప్, ఆయన అనుచరులు ఆజ్యం పోస్తున్న తీరు గర్హనీయం. ప్రాజెక్ట్ ఫైర్‌వాల్ (Fire wall) పేరిట లేబర్ విధానం ఆడిట్ నిర్వహిస్తూ మరోవైపు భారత్ పై విషం కక్కడం శోచనీయం.
అమెరికా ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో ఉన్న నేపథ్యంలో దాన్ని పరిష్కరించుకోవటానికి బదులు అమెరికా యువతను భారతీయులకు వ్యతిరేకంగా రెచ్చగొట్టడం అంతర్జాతీయ సౌహర్ధతకు భంగం కలిగిస్తుంది. ఇంత జరుగుతున్నా, మన ప్రధాని గానీ, రాష్ట్ర ముఖ్యమంత్రిగాని స్పందించకపోవడం అవమానకరం. మౌనంగా ఉండటం అంటే లక్షలాదిమంది భారతీయ విద్యార్థులకు, ఉద్యోగులకు అన్యాయం చేయటమే. ట్రంపు పదేపదే మన ఆత్మగౌరవంపై దెబ్బ కొడుతున్నా మోడీ చంద్రబాబులు మౌనంగా ఉండటం గర్హనీయం.
చంద్రబాబు చొరవ తీసుకొని భారతీయ విద్యార్ధులు, ఉద్యోగులకు తగిన భద్రత, భరోసా కల్పించేందుకు అమెరికా ప్రభుత్వంతో మోడీ ప్రభుత్వం ద్వారా రాయబారం నెరపి తక్షణ ఉపశమనం కల్పించాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది. అమెరికా లేబర్ డిపార్ట్మెంట్ ఈ యాడ్‌ను ఉసంహరించుకునేటట్లు ఒత్తిడి తేవాలని సిపిఐ(యం) కోరుతున్నది.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి
