మెడికల్ కాలేజీల పిపిపి విధానంపై హైకోర్టు వ్యాఖ్య దురదృష్టకరం

హైకోర్టు వ్యాఖ్య దురదృష్టకరం 

మెడికల్ కాలేజీల పిపిపి విధానంపై  సిపిఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు

తక్షణమే టెండర్ ప్రక్రియను ఆపాలని డిమాండ్

పిపిపి విధానం లోకి 10 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తీసుకువచ్చే టెండర్ ప్రక్రియను ఆపాలని హైకోర్టులో పిల్ విచారణకు వచ్చిన సందర్భంగా ప్రభుత్వ విధాన పరమైన నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేమని హైకోర్టు వ్యాఖ్యానించడం దురదృష్టకరమని సిపిఐ(ఎం)రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు అన్నారు.
ఇప్పటివరకు న్యాయస్థానాలు అనుసరిస్తున్న సహజ న్యాయ సూత్రాలకు  హైకోర్టు వ్యాఖ్య విరుద్ధంగా ఉంది. ప్రభుత్వ నిర్ణయాలు ప్రజా సంక్షేమానికి సమాజ శ్రేయస్సుకి విరుద్ధంగా ఉంటే జోక్యం చేసుకోకుండా కోర్టులు దూరంగా ఎలా ఉండగలవని ఆయన ప్రశ్నించారు.  ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పిపిపి విధానంలోకి మార్చి ప్రైవేట్ పరం చేయటం రాజ్యాంగానికి లోబడి ఉన్నదా లేదా అన్నది పరిశీలించాలి. ప్రభుత్వ ఆస్తులను  ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం ప్రాథమిక హక్కులకు భంగకరం. ప్రభుత్వ నిర్ణయం సామాజిక న్యాయానికి తూట్లు పొడుస్తుంది. ఈ విషయంలో ఉన్నత న్యాయస్థానం జోక్యం చేసుకొని ప్రజాప్రయోజనాలు కాపాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం తక్షణం టెండర్ ప్రక్రియను ఆపాలని, ప్రభుత్వ ఆధ్వర్యంలోనే  వైద్య కళాశాలల నిర్మాణాన్ని కొనసాగించాలని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.
-జె. జయరాం 
ఆఫీస్ కార్యదర్శి