
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 29 అక్టోబరు, 2025.
మరో గిరిజన జిల్లాను ఏర్పాటు చేయాలి.
సరిహద్దుల మార్పులపై ప్రజాభిప్రాయాన్ని తీసుకొని సమగ్ర నివేదిక ఇవ్వాలి.
` సిపిఐ(యం) డిమాండ్
పాలనా సౌలభ్యం, ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని చింతూరు, రంపచోడవరం, పోలవరం డివిజన్‌లను కలిపి ప్రత్యేక గిరిజన జిల్లాగా ఏర్పాటు చేయాలని సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్న ఈ ప్రాంతాలను తూర్పుగోదావరి జిల్లాలో కలపాలనుకోవడం సరైంది కాదు.
జిల్లాలు, మండళు సరిహద్దుల పునర్విభజన కోసం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం కొత్తగా రెండు కొత్త జిల్లాలను (మదనపల్లె, మార్కాపురం) ప్రతిపాదించినట్లు మీడియాలో వార్తలొచ్చాయి. గత ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు చింతూరు, రంపచోడవరం, పోలవరం ప్రాంతాలతో ప్రత్యేక జిల్లా ఏర్పాటు ప్రస్తానం లేకపోవడం ఆశ్చర్యం కలిగించింది. పైగా చింతూరు, రంపచోడవరం రెవెన్యూ డివిజన్‌లను తూర్పుగోదావరి జిల్లాలో కలపాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ఉపసంఘంతో చెప్పినట్లుగా వార్తలొచ్చాయి. ఈ రెండు రెవెన్యూ డివిజన్‌లతోపాటు, పోలవరం నియోజకవర్గాన్ని కూడా కలిపి ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలన్నది అక్కడ గిరిజనుల వాంఛగా ఉంది.
మంత్రివర్గ ఉపసంఘం రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించి ప్రజల నుండి వినతులు స్వీకరించకుండానే అక్కడక్కడ కొంతమంది అభిప్రాయాలు తీసుకొని పాక్షిక అభిప్రాయాలకు వచ్చినట్లుగా కనిపిస్తున్నది. మరోసారి బహిరంగంగా ప్రజల అభిప్రాయాలు తీసుకొని సమగ్ర నివేదిక ఇవ్వాలని శ్రీనివాసరావు కోరారు.
(జె.జయరాం)
ఆఫీసు కార్యదర్శి
