రాష్ట్రానికి మోడీ శఠగోపం గూగుల్‌కు రూ.22 వేల కోట్ల సబ్సిడీ అన్యాయం రాయలసీమ డిక్లరేషన్‌పై బిజెపి సమాధానం చెప్పాలి..

(ఈరోజు (17 అక్టోబర్‌, 2025) విలేకర్ల సమావేశం (విజయవాడలో) జరిగింది. ఆ వివరాలను ప్రచురణార్థం/ ప్రసారర్థం పంపుతున్నాము.  - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

 

రాష్ట్రానికి మోడీ శఠగోపం

గూగుల్‌కు రూ.22 వేల కోట్ల సబ్సిడీ అన్యాయం

రాయలసీమ డిక్లరేషన్‌పై బిజెపి సమాధానం చెప్పాలి

మోడీ భజనమాని ప్రభుత్వం నిధులు రాబట్టాలి

ప్రధాని మోడీ ఆంధ్రప్రదేశ్‌కు శఠగోపం పెట్టారని, రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వడం లేదని, పైగా జిఎస్‌టి సభ పేరుతో రూ.300 కోట్లు ఖర్చు చేసినా రాష్ట్రానికి రూపాయి పెట్టుబడి ప్రకటించలేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విమర్శించారు. ఆత్మనిర్భర్‌ భారత్‌ పేరుతో పేదలను దోచుకుని పెద్దలకు రాయితీలు ఇస్తున్నారని, ఇటువంటి విధానాలను ప్రజలు అంగీకరించరని, తిరగబడతారని హెచ్చరించారు. శుక్రవారం విజయవాడలోని బాలోత్సవ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు లోకనాథం, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.ప్రభాకరరెడ్డితో కలిసి శ్రీనివాసరావు మాట్లాడారు. కర్నూలులో మోడీ సభ అట్టహాసంగా నిర్వహించారని, ఆయన రాష్ట్రానికి వచ్చిన ప్రతిసారీ రూ.300 కోట్ల నుండి రూ.400 కోట్లు ఖర్చు చేస్తున్నారని, అంటే ఏడాదిలో రూ.1200 కోట్ల నుండి రూ.1500 కోట్లు ఖర్చు పెట్టారని అన్నారు. అయినా రాష్ట్రానికి ఎటువంటి హామీ ఇవ్వలేదని అన్నారు. ఒకవైపు ప్రజలపై ధరలు, ఛార్జీలు పెంచుతూ ఇంత ఖర్చు చేయాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. సభలో మోడీ చంద్రబాబు, లోకేష్‌, పవన్‌కల్యాణ్‌ను పొగడటం తప్ప చేసిందేమీ లేదని అన్నారు. ఇదే సభలో కరెంటుషాక్‌తో అర్జున్‌ అనే యువకుడు మరణిస్తే వారి కుటుంబాన్ని పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా సిపిఎం, సిపిఐ నాయకులను, అదోనీలో విద్యార్థి నాయకులను  అరెస్టు చేశారని అన్నారు. ఈ ప్రభుత్వానికి వామపక్షపార్టీల కార్యకర్తలంటే ఎందుకంత భయమని ప్రశ్నించారు. మోడీ రాయలసీమకు ఏమి చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. రూ.13 వేలకోట్ల పేరుతో ప్రారంభించిన 16 ప్రాజెక్టుల్లో రాష్ట్రానికి చెందినవి, కర్నూలు జిల్లా, రాయలసీమకు చెందినవి ఎన్నో చెప్పాలన్నారు. దేశంలో అన్ని ప్రాజెక్టులను ఇక్కడ నుండి ప్రారంభించి రాష్ట్రానికి ఇచ్చినట్లు ప్రచారం చేశారని విమర్శించారు. విభజన సందర్భంగా కర్నూలు పంచలిగంగాల వద్ద రైల్వేవ్యాగన్‌ వర్కుషాపు, ఆదోని వద్ద టెక్స్‌టైల్‌ పార్కు, కడపలో స్టీలుప్లాంటు ఏర్పాటు చేస్తామని చెప్పినా వాటికి అతీగతి లేదని తెలిపారు. కడప స్టీలు ప్లాంటుకు అయితే శంకుస్థాపనల మీద శంకుస్థాపనలు చేశారని, వాటికి అంతర్జాతీయ అవార్డులు కూడా ఇవ్వొచ్చని అన్నారు. జైరాజ్‌ ఫ్యాక్టరీకి ప్రారంభోత్సవం చేశారని, 1100 మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 300 మందికి ఇచ్చారని అన్నారు. నిర్మాణ కార్మికులను ఉపాధి లెక్కల్లో చూపిస్తున్నారన్నారు. బిజెపి గతంలో టిడిపిని తిట్టి రాయలసీమ డిక్లరేషన్‌ పేరుతో రూ.20 వేల కోట్లు స్పెషల్‌ ప్యాకేజీ అని డిమాండు చేశారని, కానీ శాసనసభలో బిజెపి నాయకులు ఎవరూ దీని గురించి మాట్లాడటం లేదని తెలిపారు. ఆర్‌డిఎస్‌, వేదావతి, గుండ్రేవుల అభివృద్ధి లేదన్నారు. హంద్రీనీవా ద్వారా 125 చెరువులకు నీటిని ఇస్తే వేల ఎకరాలు సాగులోకి వస్తాయిని పేర్కొన్నారు.  వాటిని అభివృద్ధి చేయడానికి ఎవరు అడ్డుపడ్డారని ప్రశ్నించారు. బిజెపి నాయకులు చెప్పే అభివృద్ధి బూటకం, రాయలసీమ డిక్లరేషన్‌ నాటకం అన్నారు. దాన్ని కప్పిపుచ్చుకునేందుకు జిఎస్‌టి పేరుతో సభలు జరుపుతున్నారని పేర్కొన్నారు. జిఎస్‌టి వల్ల పెద్దగా మిగిలేదేమీ లేదని, మనిషికి రూ.1600 మాత్రమేనని అన్నారు. రూ.5000 కోట్లు పెడితే మెడికల్‌ కళాశాలలు పూర్తవుతాయని, అయినా చేయకుండా గూగుల్‌కు రూ.22 వేల కోట్లు మినహాయింపులు ఇచ్చారని ప్రపంచ చరిత్రలో ఇంత పెద్దమొత్తంలో సబ్సిడీ ఇచ్చింది లేదన్నారు. ట్రంప్‌ టారిఫ్‌లు విధించిన సమయంలో విదేశాలపై ఆధారపడటమే ప్రధాన శత్రువు అన్నారు, ఆత్మనిర్భర్‌ భారత్‌ పేరుతో గూగుల్‌ తెచ్చి పెట్టడమేనా అత్మనిర్భర్‌ భారత్‌ అని ప్రశ్నించారు. ఇప్పటికీ ఇండియాకు సొంత సెర్చ్‌ ఇంజన్‌ లేదని తెలిపారు. గూగుల్‌, మైక్రోసాప్ట్‌ను పోషించింది ఇండియన్లేనని, మన నాలెడ్జితో ఎదిగి రూ.85 వేలకోట్లు పెట్టుబడి పెడతామని అంటే రూ.22 వేల కోట్లు రాయితీ ఇస్తున్నారని అన్నారు. డేటా సెంటర్‌ వల్ల వచ్చే వేడి చాలా ఎక్కువని తెలిపారు. అమెరికాలోని వర్జీనియాలో దీన్ని వ్యతిరేకిస్తే, లాగిపెట్టి తంతే ఇండియాకు వచ్చి పెడుతున్నారని చెప్పారు. దాని నుండి ఉత్పత్తయ్యే వేడితో విశాఖ ప్రజల భవిష్యత్‌ ఏమిటని ప్రశ్నించారు. విశాఖలో అదానీకి 300 ఎకరాలు ఇచ్చారని, ఇప్పుడు గూగుల్‌కు 500 ఎకరాలు ఇచ్చారని అన్నారు. గూగుల్‌తో ఒప్పందం తరువాత అదానీ భాగస్వామని బయటపెట్టారని పేర్కొన్నారు. మోడీ మిత్రుడు కావడంతో అన్ని కంపెనీల్లోనూ ఆయనకు వాటా ఇస్తున్నారని అన్నారు. గతంలో ఇచ్చిన 300 ఎకరాలు తిరిగి ప్రజలకు ఇస్తారా ? ఇవ్వరా ? చెప్పాలని ప్రశ్నించారు. సింహాచలం పంచగ్రామాల్లో 164 ఎకరాలకు ఇప్పటి వరకూ పట్టాలు ఇవ్వలేదని తెలిపారు. గూగుల్‌కు మాత్రం 160 ఎకరాలు ఉచితంగా ఇచ్చారని అన్నారు. పేదల గోళ్లూడగొట్టి కార్పొరేట్లకు రాయితీలు ఇవ్వడమేనా ఆత్మనిర్భర్‌ భారత్‌ అని ఫ్రశ్నించారు. బిజెపి అధికారంలోకి ఉండి రాయలసీమ డిక్లరేషన్‌ అమలు చేయకపోవడంపై ప్రజలకు సంజాయిషీ ఇవ్వాలన్నారు. చంద్రబాబు, లోకేష్‌, పవన్‌ పొగడటం మాని రాష్ట్రానికి రావాల్సిన నిధులను రాబట్టాలని సూచించారు. కేంద్రం ప్రకాశం జిల్లాలో నిమ్జ్‌ పేరుతో 5000 ఎకరాలు తీసుకుందని ఏమీ పెట్టలేదన్నారు. కాకినాడలో 10వేల ఎకరాలు ఖాళీగా ఉన్నాయని, అక్కడ ప్రజలు పోరాడుతుంటే 2500 ఎకరాలు వెనక్కు ఇచ్చారని అన్నారు. 2019లో చంద్రబాబు, 2024లో జగన్‌ ఓడిపోవడానికి మోడీ పల్లకి మోయడమే కారణమని అన్నారు. బిజెపితో కలిసిన ఏ ప్రాంతీయ పార్టీ బాగుపడిరది లేదని అన్నారు. బిజెపి మోసపూరిత చర్యలను ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. గూగుల్‌ ఒప్పందాలు బయటపెట్టి వేల కోట్ల సబ్సిడీలను ప్రజలకు ఖర్చు చేయాలని, మెడికల్‌ కళాశాలలను పూర్తి చేయాలని కోరారు. పర్యావరణాన్ని దెబ్బకొట్టే డేటా సెంటర్లను పెట్టద్దని అన్నారు. దీనివల్ల టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్‌ కూడా అవదని, అది లేకుండా రాయితీలు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు. గూగుల్‌కు ఇస్తున్న సబ్సిడీలన్నా ఆపాలని, లేదా 22 శాతం ప్రభుత్వానికి వాటా ఇవ్వాలని డిమాండు చేశారు. 16000 డిఎస్‌సి తప్ప ఉపాధి కల్పన మరొకటి లేదని పేర్కొన్నారు. ఎంఎస్‌ఎంఈలు మూతపడుతున్నాయని అన్నారు. ప్రైవేటు పరిశ్రమల్లో లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పడం అబద్ధమని తెలిపారు. అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో 52 మంది క్యాన్సర్‌తో చనిపోయారని, దీనికి అక్కడ ఫార్మా కాలుష్యమే కారణమని పేర్కొన్నారు. దీనిపై స్థానిక ఎమ్మెల్యే హోమ్‌శాఖ మంత్రి అనిత ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండు చేశారు.