ఈపురుపాలెం స్ట్రయిట్‌కట్‌ కాలువ సహజ స్థితిని పునరుద్దరించి, బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ

శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,
గౌరవ ముఖ్యమంత్రి,
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం,
అమరావతి.
విషయం : ఈపురుపాలెం స్ట్రయిట్‌కట్‌ కాలువ సహజ స్థితిని పునరుద్దరించి, బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ...
అయ్యా!
చీరాల మండలం ఈపురుపాలెం సముద్రతీరంలో ఉన్న స్ట్రయిట్‌కట్‌ కాలువ ద్వారా వరద నీరు సముద్రంలో కలవడంతో పాటు, స్థానిక మత్స్యకారులు తమ బోట్లు నిలిపేందుకు, సైక్లోన్‌ కాలాల్లో రక్షణ స్థలంగా ఉపయోగించుకునేందుకు అనుకూలంగా ఉంది. ఈ సహజ నిర్మాణం వల్ల సముద్ర అలలు, గాలుల ప్రభావం నుంచి వారి బోట్లు రక్షించబడతాయి.
అయితే 2021 తర్వాత ఈ పరిసరాల్లో రిసార్ట్‌లు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలు వేగంగా విస్తరించడంతో, కొంతమంది ప్రైవేటు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, రాజకీయ మద్దతుతో కలిసి కాలువ పూడ్చివేత పనులు ప్రారంభించారు. ‘‘శ్రీ బాహా ఇన్‌ఫ్రా డెవలపర్స్‌’’ పేరుతో ఈ ప్రాంతంలో ప్రైవేట్‌ బీచ్‌ ఏర్పాటుకు, రిసార్ట్‌ నిర్మాణాలకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనివల్ల మత్స్యకారులు తమ వృత్తిని కొనసాగించలేని పరిస్థితి ఏర్పడిరది.
కాలువ పూడ్చివేత వలన సముద్ర ముఖద్వారంలో బోట్ల రాకపోకలు ఆగిపోయాయి. సహజ ‘‘ఎల్‌-ఆకారం’’ నిర్మాణం చెదిరిపోయి, 45 కు పైగా బోట్లు ధ్వంసమయ్యాయి. పలు గ్రామాల మత్స్యకారుల జీవనాధారం తీవ్రంగా దెబ్బతింది.
ఈ పరిస్థితులపై 13 గ్రామాల మత్స్యకారులు నెలల తరబడి ఆందోళనలు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్‌ విచారణ జరిపి, ఎల్‌ ఆకారంలో తిరిగి పునరుద్దరించడం, బీచ్‌ డెవలప్‌ మెంట్‌ పేరుతో పూడ్చిన భూభాగంపై పరిహారం చెల్లించడం వంటి హామీలు ఇచ్చినా, ఇవి ఇప్పటివరకు అమలు కాలేదు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ఇక్కడ తమ నిర్మాణాలను కొనసాగిస్తూ తీర ప్రాంత మత్యకారుల వృత్తికి తీవ్ర ఆటంకాలు కల్పిస్తున్నారు. కావున ప్రభుత్వం వెంటనే ఈ క్రింది చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను.
(1) సహజ స్థితిలో ఉన్న ఎల్‌ ఆకారపు స్ట్రయిట్‌ట్‌ కట్‌ కాలువను పునరుద్ధరించాలి.
(2) హెచ్‌టిఎల్‌ (నఱస్త్రష్ట్ర ుఱసవ ూఱఅవ) నుండి 200 మీటర్ల పరిధిలో ఉన్న రిసార్ట్‌, కాంక్రీట్‌ నిర్మాణాలను వెంటనే తొలగించాలి.
(3) సర్వే నంబర్‌ 499/2 భూమిపై జారీ చేసిన డీకే పట్టాను రద్దు చేయాలి ` ఆ భూమిని మత్స్యకారుల అవసరాలకు కేటాయించాలి.
(4) పూడ్చివేత కారణంగా దెబ్బతిన్న బోట్లకు ప్రభుత్వ ఖర్చుతో నష్టపరిహారం చెల్లించాలి.
(5) రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల అక్రమ భూకబ్జా, తీరరేఖ నిబంధనల ఉల్లంఘనపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి.
మత్స్యకారులు ఈ కాలువపై ఆధారపడి దశాబ్దాలుగా జీవనం సాగిస్తున్నారు. ఈ సహజ వనరును నాశనం చేయడం అంటే, వారి జీవన హక్కును హరించడం వంటిదే. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకొని సహజ స్థితిని పునరుద్ధరించి, మత్స్యకారులకు న్యాయం చేయాలని కోరుతున్నాను.

అభివందనములతో...
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి