ఆదివాసీ చట్టాలు, హక్కులకు విరుద్ధంగా మంజూరు చేసిన హైడ్రో పవర్‌ ప్రాజెక్టుల ఒప్పందాలు, జి.ఓ.లు నెం. 51, 13, 2 ను వెంటనే రద్దు చేయాలని కోరుతూ.

(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖలను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)
విజయవాడ,
తేది : 09 అక్టోబర్‌, 2025.
(1)
శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,
గౌరవ ముఖ్యమంత్రి,
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం,
అమరావతి.
విషయం : ఆదివాసీ చట్టాలు, హక్కులకు విరుద్ధంగా మంజూరు చేసిన హైడ్రో పవర్‌ ప్రాజెక్టుల ఒప్పందాలు, జి.ఓ.లు నెం. 51, 13, 2 ను వెంటనే రద్దు చేయాలని కోరుతూ...
అయ్యా!
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని 5వ షెడ్యూల్డ్‌ ఏరియాలో ఉన్న అల్లూరి సీతారామరాజు (ఏ.ఎస్‌.ఆర్‌.), పార్వతీపురం మన్యం జిల్లాలు, అనకాపల్లి సబ్‌ప్లాన్‌ ఏరియాలలో పంప్డ్‌ స్టోరేజీ హైడల్‌ ప్రాజెక్టుల ప్రతిపాదన ఆదివాసుల్ని తీవ్రమైన ఆందోళనకు గురిచేస్తున్నది. ఆదివాసీల హక్కులు, భూములు, సంస్కృతి, పర్యావరణం దారుణంగా దెబ్బతింటాయి. పైన పేర్కొన్న ప్రాంతాల్లో హైడ్రో పవర్‌ ప్రాజెక్టుల నిర్మాణానికి  నవయుగ, మెగా, అదానీ, శ్రీ శిరిడిసాయి మొదలగు కార్పొరేట్‌ కంపెనీలకు ఆదివాసీ గ్రామ సభ ఆమోదం లేకుండానే జి.ఓ.లు నెం. 51,13,2 (ఇంధన మరియు శక్తి విభాగం) రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. ఆదివాసీల చట్టాలు, హక్కులకు పూర్తి విరుద్ధంగా కార్పొరేట్‌ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం అక్రమ ఒప్పందం  చేసుకుంది. కనీసం గిరిజన సలహా మండలి అభిప్రాయం కూడ తీసుకోలేదు. ప్రభుత్వ చర్యలు, ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీల (ఎక్స్‌టెన్షన్‌) షెడ్యూల్డ్‌ ఏరియాలకు (పెసా) చట్టం 1996 నిబంధనలు 2011, అడవి హక్కుల చట్టం (ఎఫ్‌ఆర్‌ఏ) 2006, ఆంధ్రప్రదేశ్‌ భూమి బదిలీల నియంత్రణ (1/70 నియమం) చట్టాలకు వ్యతిరేకం. సుప్రీం కోర్టు సమతా జడ్జిమెంట్‌ ఇప్పటికీ విలువ కలిగి ఉంది. అలాగే, ఎఫ్‌ఆర్‌ఏ చట్టం కింద ఆదివాసీల అటవీ హక్కులు (ఉమ్మడి మరియు వ్యక్తిగత హక్కులు) గుర్తించబడకుండా ప్రాజెక్టులను నిర్మించాలనుకోవడం అన్యాయం.
ఈ ప్రాజెక్టుల వల్ల 8 మండలాల్లో 250 గ్రామాలలో 50,000 మంది ఆదివాసీలతోపాటు 20వేల ఎకరాల  స్వంత భూములైన అటవీ, వ్యసాయ భూములు జలసమాధి కానున్నాయి. గుజ్జీలి, పెదకోట, చిట్టం వలస, సీలేరు, ఎర్రవరం వంటి ప్రాజెక్టుల్లో మొత్తం 7,400 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి  ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రాజెక్ట్‌  ఆదివాసీల  పూర్వీకుల భూములు, అడవులు, నదులు, సంస్కృతిని, జీవనాధారాలను పూర్తిగా ధ్వంసం చేస్తుంది. పంప్డ్‌ స్టోరేజ్‌ హైడ్రో పవర్‌ (పిఎస్‌పి) వల్ల  అడవుల నిర్మూలన, జల వనరుల దుర్వినియోగం, భూకంపాల ప్రమాదం, జీవవైవిధ్య నష్టానికి దారితీస్తాయి.  ఇటీవల పార్వతీపురం మన్యం జిల్లాలో అదాని సంస్థలకు సంబంధించిన రెండు పంప్డ్‌ స్టోరేజ్‌ ప్రాజెక్టులు (జి.ఓ.ఎమ్‌ఎస్‌. నెం.55) స్థానిక సమస్యలు మరియు ఆదివాసీల ఆందోళనల కారణంగా జూలై 29, 2025న రద్దు చేయబడ్డాయి. కానీ మిగిలిన ప్రాజెక్టులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి, ఇది ఆదివాసీల అణచివేతతో సమానం. ఆదివాసీల పట్ల ప్రభుత్వం  వివక్షపూరిత వైఖరి ప్రదర్శిస్తున్నది. కావున సావధానంగా పై అంశాలను పరిశీలించి ఈ క్రింది చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను.
డిమాండ్స్‌ :
(1) జి.ఓ.లు నెం. 51, 13, 2 ద్వారా మంజూరు చేసిన హైడ్రో పవర్‌ ప్రాజెక్టుల ఒప్పందాలను వెంటనే రద్దు చేయాలి.
(2) ఆదివాసీల గ్రామసభలతో సంప్రదింపులు నిర్వహించి, వారి అనుమతి లేకుండా ఏ పనులు చేయకూడదు.
(3) ప్రభుత్వం ఆదివాసీల  భూమి హక్కులు, పర్యావరణ రక్షణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి.
(4) గ్రామాలు, పొలాలు ఆక్రమణ లేకుండా జనావాసాలు లేని నది ప్రవాహ ప్రాంతాల్లో పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టులను పెట్టాలన్న అంతర్జాతీయ నిబంధనలను గౌరవించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూడాలి.
(5) అక్రమంగా సర్వేరాళ్ళు పాతి గిరిజనులను భయబ్రాంతులకు గురిచేస్తున్న కంపెనీలు, వాటి ప్రతినిధులపై చట్టబద్దమైన చర్యలు తీసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ, పి.వో.ఏ.యాక్ట్‌ ప్రకారం కేసులు బుక్‌ చేయాలి.
(6) ఈ విషయంపై స్వతంత్ర జాతీయ మానవహక్కుల కమిషన్‌ (ఎన్‌ఎచ్‌ఆర్‌సీ) మరియు జాతీయ గిరిజన కమిషన్‌ (ఎన్‌సీఎస్‌టి)ల చేత విచారణ జరిపించాలి.