ఆయుధ ఫ్యాక్టరీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ శాంతియుతంగా గ్రామాల్లో పర్యటిస్తున్న గిరిజనులపై ప్రభుత్వం నిర్బంధం

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 23 సెప్టెంబరు, 2025.

        ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం వంకావారి గూడెం పంచాయతీ పరిధిలో నేవీ
ఆయుధ ఫ్యాక్టరీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ శాంతియుతంగా గ్రామాల్లో
పర్యటిస్తున్న గిరిజనులపై ప్రభుత్వం నిర్బంధం ప్రయోగించడాన్ని సిపిఐ(యం)
రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది. గ్రామ సభ, పీసా కమిటీ రెండు మూడు
దఫాలు తీవ్రంగా వ్యతిరేకించినా ప్రభుత్వం ఆయుధ కర్మాగారం పెట్టితీరుతామని
ప్రయత్నాలు చేయడం దారుణం. ఈరోజు శాంతియుతంగా నిరసన తెలిపేందుకు
ప్రయత్నిస్తున్న గిరిజనులు, గిరిజనులకు అండగా ఉన్న వామపక్ష నాయకులపై,
గిరిజన మహిళలపై పోలీసులు దౌర్జన్యానికి, దాడికి పూనుకున్నారు.
ప్రజాస్వామికంగా నిరసన తెలియజేసే అవకాశం లేకుండా సెక్షన్‌లు 144, 30
విధించి నిర్బంధానికి పూనుకోవడం, అరెస్టులకు ప్రయత్నించడం అన్యాయం. భోజనాలు
తయారు చేయకుండా వంటలను అడ్డుకోవడం మరీ దుర్మార్గం. ప్రజల అనుమతి లేకుండా
నిర్మాణం చేయబోమని గతంలో ప్రకటించిన ఎంపి, ఎమ్మెల్యే ఇప్పుడు ప్లేటు
ఫిరాయించి గిరిజనులకు అన్యాయం చేసేలా వ్యవహరిస్తున్నారు. గిరిజన గ్రామాలు,
సారవంతమైన భూములను నాశనం చేస్తే ప్రజలు సహించరు. ప్రభుత్వం షెడ్యూల్డు
ఏరియా చట్టాలను గ్రామ సభ, పీసా కమిటీ తీర్మానాలను గౌరవించి ఆయుధ ఫ్యాక్టరీ
ఏర్పాటు ఉపసంహరించుకోవాలని, గిరిజన గ్రామాలకు, భూములకు రక్షణ కల్పించాలని
డిమాండ్‌ చేస్తున్నాము. ప్రభుత్వం గిరిజనులపై నిర్బంధాన్ని, తప్పుడు కేసుల,
అరెస్టుల ప్రయత్నాలు మానుకోవాలని కోరింది. ప్రభుత్వం మొండిగా ముందుకు
వెళితే గిరిజనులు, రైతుల నుండి ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వుంటుందని
హెచ్చరిస్తున్నాము. ఈ ఉద్యమానికి మద్దతుగా త్వరలో వామపక్ష పార్టీల రాష్ట్ర
నాయకులు పర్యటిస్తారు.

(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి

--
COMMUNIST PARTY OF INDIA (MARXIST)
            Andhra Pradesh Committee
H.No. 27-30-9,Akula vari Street,
Governorpet, Vijayawada - 520 002.
Phone: 0866-2577202;
Web: www.cpimap.org