
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 16 సెప్టెంబరు, 2025.
రైతులకు యూరియా సరఫరా చేయకుండా రాయితీ ఊరింపులా?
రాష్ట్ర రైతాంగానికి అవసరమైనంత యూరియా సరఫరా చేయకుండా దాని వాడకాన్ని తగ్గించుకుంటే రాయితీ ఇస్తామని ప్రభుత్వం ఊరించడం ప్రజలను వంచించడమే. కేంద్రం నుండి రూ.500 కోట్లు తీసుకొని రైతులకు యూరియా వాడకాన్ని తగ్గించుకోమని సుద్దులు చెప్పడం దారుణం. వ్యవసాయంలో నత్రజని పాత్ర చాలా కీలకమైనదని పరిశోధనల్లో తేలింది. ఆయా పంటలు, నేల స్వభావాన్నిబట్టి మోతాదు నిర్ణయించి వాడాల్సి వుంటుంది. వ్యవసాయాభివృద్ధికి, ఆహార ధాన్యాల ఉత్పత్తికి కీలకమైన ఎరువులను అవసరమైనన్ని సరఫరా చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తోంది.
నిలువు మీదనున్న పంటల దిగుబడి తగ్గకుండా వుండేందుకు అవసరమైనంత ఎరువులను సరఫరా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. కానీ ఎరువుల సబ్సిడీని తగ్గించుకోవాలన్న కక్కుర్తితో ఈ ఏడాది రాష్ట్రాలకు కేటాయింపు తగ్గించి, ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలకే రాయితీ ఇస్తామని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కుట్ర పన్నింది. టిడిపి కూటమి ప్రభుత్వం దానికి తోడవ్వడం, మిగిలిన రాష్ట్రాలు పది శాతం తగ్గించుకోగా ఆంధ్రప్రదేశ్ 25 శాతం కోతకు అంగీకరించడం దారుణం. రాష్ట్రానికి వచ్చిన ఎరువులను కూడా రాజకీయ నాయకులు, ఉన్నతాధికారుల మద్దతుతో వ్యాపారులు బ్లాక్ మార్కెట్‌కు తరలించారు. ప్రభుత్వ సంస్థల ద్వారా సరఫరా చేయాల్సింది పోయి పెత్తందార్లు చేజిక్కించుకోవడంతో ఎరువులకు కొరత ఏర్పడిరది. ఎరువుల కొరతకు కారణాలు ఇది కాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలెక్టర్ల కాన్ఫరెన్సులో యూరియా వాడకం తగ్గిస్తే బస్తాకు రూ. 800 రాయితీ ఇస్తామని చెప్పడం రైతులను మభ్యపుచ్చడానికే! ఎరువుల కోటా తగ్గించుకొని దానికి బదులుగా రైతుల్ని బలిపెట్టి కేంద్రం నుండి డబ్బులు తీసుకొని ఇప్పుడు వాటినే రైతులకు ఇస్తాననడం మోసపూరితం. ఈ వైఖరిని సిపిఐ(యం) తీవ్రంగా ఖండిస్తున్నది.
అలాగే క్యాన్సర్ రావడానికి అనేక కారణాలుండగా యూరియా వాడకంతో వస్తుందని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు. ఏ వైద్య పరిశోధనా సంస్థ లేదా శాస్త్రవేత్త ఈ విషయం చెప్పారో ముఖ్యమంత్రి గారు వెల్లడిరచాలని కోరుతున్నాము. ఒకవేళ అదే నిజమైతే ఇంత కాలం ఎందుకు మౌనంగా ఉన్నారు? ఇప్పుడు ఎరువులు సరఫరా చేయలేక క్యాన్సర్ అని భయపెట్టడం ప్రజారోగ్యంపట్ల ప్రభుత్వ చిత్తశుద్దినే శంకించాల్సి వస్తుంది.
అలాగే ఎరువు సరఫరాకు ఇ` క్రాప్ నమోదు లింక్ పెడుతున్నారు కనుక వాస్తవ సాగుదార్లను నమోదు చేయాలి. కౌలు రైతులను రికార్డు చెయ్యకుండా లింకేజి నిబంధన అమలు చేస్తే సమస్య మరింత జటిలమవుతుందన్న విషయం ప్రభుత్వం గుర్తెరగాలి. భవిష్యత్తులో ఎరువులకూ ప్రభుత్వాలు నగదు బదిలీ విధానాన్ని తెచ్చే ప్రమాదంపట్ల అప్రమత్తంగా ఉండాలని సిపిఐ(ఎం) రాష్ట్ర కమిటీ రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నది.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి
