
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 14 సెప్టెంబరు, 2025.
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ వ్యాఖ్యలు గర్హనీయం
సారధ్య యాత్ర ముగింపు సభ పేరిట అబద్దాలు, అర్థ సత్యాలు చెబుతూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పి.ఎన్.వి.మాధవ్ రాష్ట్ర ప్రజలను మభ్యపుచ్చేందుకు ప్రయత్నించడం గర్హనీయం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలవల్ల ప్రజలకు, కార్మికులకు జరుగుతున్న నష్టాన్ని ఎప్పటికప్పుడు వివరించి వాటిని ఎదిరించేందుకు ప్రజలను పోరాట పంథాలో నిలబెడుతున్న వామపక్షాలపై మాధవ్ చేసిన వ్యాఖ్యలను సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది. ప్రత్యేకహోదాను తిరస్కరించి, విభజన హామీలను అమలుచేయ నిరాకరించిన బిజెపి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి తీవ్ర హాని కలుగజేసింది. రాష్ట్ర ప్రజలను వంచిస్తూ మరోవైపున వామపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని మాధవ్ ఆరోపించడం తన మోసాన్ని కప్పిపుచ్చుకోవడానికే!
విశాఖస్టీల్ ప్లాంట్ ప్రత్యేక ప్యాకేజీతో పురోభివృద్ధి చెందుతుందని మాధవ్ బుకాయిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.11,440 కోట్లు జిఎస్టీ బకాయిలు, ఇతర పన్ను బకాయిల పేరిట కేంద్రమే తిరిగి తీసుకోగా బ్యాంకు రుణాలకు ఇంకొంత పోయింది. ప్లాంట్ వర్కింగ్ క్యాపిటల్‌గానీ, ఉద్యోగుల జీతాల నిమిత్తం గానీ అందులో ఖర్చు చేసిందేమీ లేదన్న నిజం మాధవ్‌కు తెలియదా? ఈ ప్యాకేజీ మూలంగా రెగ్యులర్ ఉద్యోగులకు గానీ, కాంట్రాక్టు కార్మికులకుగానీ ఒరిగిందేమీ లేకపోగా ఐదు వేల మంది కాంట్రాక్టు కార్మికులను ఇప్పటికే తొలగించారు. విఆర్‌ఎస్ పేరుతో పర్మినెంట్ ఉద్యోగులను, అధికారులను ఇంటికి పంపిస్తున్నారు. తాజాగా ఈవోఐ అని చెబుతూ ముక్కలు ముక్కలుగా స్టీల్‌ప్లాంట్‌ను ప్రయివేటుపరం చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఉక్కు ఫ్యాక్టరీకి కీలకమైన సొంత గనులను ఇన్నేళ్ళుగా కేటాయించకుండా విశాఖ ఉక్కుపై కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా ఎందుకు వ్యవహరిస్తుందో మాధవ్‌గానీ, ఆయన్ను సమర్థించే పెద్దలుగానీ సమాధానం చెప్పాలి.
పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయని చెబుతున్న మాధవ్ లోపభూయిష్ట నిర్మాణం మూలంగా డయాఫ్రమ్ వాల్, గైడ్‌బండ్ వంటి కీలక నిర్మాణాలు దెబ్బతింటే ఇప్పటి వరకు అందుకు బాధ్యులెవరో నిర్ణయించడంగానీ, జరిగిన నష్టానికి పరిహారం వసూలు చేయడంగానీ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని పోలవరం అథారిటీ చేయలేదు. పైపెచ్చు వాటి నిర్మాణానికి రూ.900 కోట్ల ప్రజా ధనాన్ని కాంట్రాక్టర్లకు కట్టబెట్టింది. ప్రాజెక్టు మూలంగా సర్వస్వం కోల్పోతున్న నిర్వాసితులు అందునా లక్షలాది మంది గిరిజనుల గురించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అసలు పట్టించుకోవడమే లేదు. ఆర్‌అండ్ ఆర్ ప్యాకేజీ నిమిత్తం నిధులు కేటాయించడం తన బాధ్యతే కాదన్నట్లు కేంద్ర ప్రభుత్వం వ్యవహరించడం దారుణం.
ప్రయివేటీకరణ అన్ని దేశాల్లో జరుగుతున్నదేనని ఇక్కడా అంతేనని చెప్పుకొచ్చిన మాధవ్ ప్రయివేటులో ఎస్సీ, ఎస్టీ, ఓబిసి, మహిళలు, వికలాంగులకు ఎటువంటి ఉపాధి లభించడం లేదని, సామాజిక న్యాయం మంటగలిసి పోతోందన్న వాస్తవాన్ని మాధవ్ దాచిపెడుతున్నారు. ప్రజల సొమ్ముతో నిర్మించిన ప్రభుత్వ రంగాన్ని తమ అధికారాన్ని అడ్డం పెట్టుకొని కొద్ది మంది సంపన్నులకు అదీ పాలకపార్టీ అనుయాయులకు కట్టబెడుతున్న వైనాన్ని నిస్సిగ్గుగా సమర్థించడం మాధవ్‌కే చెల్లింది. వామపక్షాలపై బురదచల్లే పనులు మానుకోవాలి. మాయమాటలు చెప్పి ఎల్లకాలం జనాన్ని మోసగించలేరని బిజెపి నాయకులు గుర్తెరగాలి.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి
--
COMMUNIST PARTY OF INDIA (MARXIST)
Andhra Pradesh Committee
H.No. 27-30-9,
Akula vari Street,
Governorpet,
Vijayawada - 520 002.
Phone: 0866-2577202;
Web: www.cpimap.org
