బిజెపి తీరుతో ప్రమాదంలో ప్రజాస్వామ్యం...

బిజెపి తీరుతో 

ప్రమాదంలో ప్రజాస్వామ్యం

సీతారాం ఏచూరి వర్థంతి సభలో సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు 

ప్రజాస్వామ్యాన్ని రక్షించడంలో తెలుగురాష్ట్రాల వామపక్షాలదే గురుతర బాధ్యత

 

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో విదేశాంగ విధానం, లౌకికవాదం, ప్రజాస్వామ్యం, ఫెడరలిజం ప్రమాదంలో పడ్డాయని, ఆర్థిక వ్యవస్థ కూడా కుంటుపడుతోందని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు అన్నారు. సిపిఎం పూర్వ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రథమ వర్థంతి సభ గురువారం సాయంత్రం మాకినేని బవసపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగింది. దీనికి ముఖ్యఅతిధిగా హాజరైన రాఘవులు తొలుతు ఏచూరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం బిజెపి ఫాసిస్టు, మతోన్మాద ధోరణి నుండి  ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సి ఉందని, ఈ విషయంలో తెలుగు రాష్ట్రాల వామపక్ష ఉద్యమానికి గురుతర బాధ్యత ఉందని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ఉన్న పార్టీలు బిజెపికి సాగిలపడుతున్నాయని అన్నారు. ఇదే పద్ధతి కొనసాగితే తెలుగు రాష్ట్రాల్లో బిజెపి విస్తరణకు అవకాశం ఇచ్చిన వారవుతారని పేర్కొన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తెలుగుదేశం కంటే ముందే వైసిపి మద్దతు ప్రకటించిందని విమర్శించారు. అంత అవసరం ఏమొచ్చిపడిరదో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. దేశంలో సోషలిజం ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నా సీతారాం ఏచూరి మార్క్సిస్టు భావజాలాన్ని ముందుకు తీసుకెళుతున్నారని అన్నారు. ఆయన స్ఫూర్తితో భవిష్యత్‌ కర్తవ్యాలను నిర్వహించాలని సూచించారు. ఏచూరి మరణించారనే విషయాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నామని వివరించారు. ఈ ఏడాది కాలంలో భారత రాజకీయాల్లో వస్తున్న పెనుమార్పులు, అభ్యుదయ, లౌకిక, ప్రజాస్వామ్యశక్తులు వారిపాత్రను ముందుకు తీసుకెళ్లడంలో ఏచూరి లేనిలోటు కనిపిస్తోందని అన్నారు. అయినా ముఖ్యమైన ఘట్టాల్లో ఆయన నిర్వహించిన తీరు, రాజకీయ పాత్రను గుర్తుచేసుకుంటే రాబోయే కాలంలో చేయాల్సిన పోరాటాలకు ఆత్మవిశ్వాసం కలుగుతుందని అన్నారు. బిజెపి ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రమాదాన్ని నిరంతరం చెప్పేవారన్నారు. దేశంలో బూర్జువా పార్టీలకు, బిజెపికి ఉన్న వ్యత్యాసం ఉందని, ఫాసిస్టు సిద్ధాంతానికి అది ప్రతినిధని చెప్పేవారన్నారు. అందుకే ఇతర బూర్జువా, భూస్వామ్య పార్టీలు పెట్టుబడిదారులకు ఊడిగం చేస్తున్నా  బిజెపితో వ్యత్యాసంతో చూస్తామని అన్నారు. బిజెపి పాలనలో దేశం లౌకిక, ప్రజాస్వామ్య, ఫెడరల్‌, సామాజిక న్యాయవిలువలకు నష్టం చేసిందని, రాబోయే కాలంలో మరింత ఎక్కువ చేస్తుందని అన్నారు. ఈ ప్రమాదాన్ని దేశ ప్రజల ముందు మార్క్సిస్టు దృక్ఫదాన్ని చెప్పకపోతే అందరికీ నష్టం జరుతుందని, ఎన్నికల విధానాన్ని నష్టం జరుగుతుందని ఏచూరి నిరంతరం చెప్పేవారన్నారు. సోషలిజాన్ని, కమ్యూనిజాన్ని సాధించాలంటే కనీసం ప్రజాస్వామ్యం, లౌకికభావం ఉండాలన్నారు. వాటిని నాశనం చేస్తే సోషలిజం సాధ్యం కాదని అన్నారు. ఎన్ని భిన్నత్వాలు ఉన్నా ప్రతిపక్షాలు కలిసి బిజెపికి వ్యతిరేకంగా ఒకతాటిపైకి వచ్చాయంటే వామపక్షాలు ,అందులోనూ సీతారాం ఏచూరి కీలకపాత్ర పోషించడం వల్లే సాధ్యమైందని అన్నారు. ఇటీవల జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కొన్ని ప్రతిపక్షపార్టీలు ఎన్నికలకు దూరంగా ఉన్నాయని, ఎపిలో తెలుగుదేశం, వైసిపి, జనసేన బిజెపి పంచన చేరాయని, రాష్ట్ర రాజకీయాలను దౌర్బాగ్యస్థితికి తీసుకెళ్లారని అన్నారు. బిజెడి, బిఆర్‌ఎస్‌, అకాళీదళ్‌ కూడా ప్రతిపక్షాలతో కలిస్తే బాగుండేదని, సీతారాం ఉంటే ఆ కర్తవ్యాన్ని నెరవేర్చేవారని తెలిపారు. బీహార్లో ఎన్నికల్లో బిజెపి ఓడిపోతే అఖిల భారతస్థాయిలో ఓడిపోతామని బిజెపికి భయం పట్టుకుందన్నారు. అందువల్లే ఎస్‌ఐఆర్‌ పేరుతో ఓట్ల తొలగింపు చేపడుతోందని అన్నారు. ఎస్‌సి, ఎస్‌టిల జనాభాను తెగల, కులాల వారీగా గణిస్తున్నారని, మిగతా కులాలను గణించాలంటే ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి వ్యతిరేకించాయని, ఇప్పుడు ఓటమి భయంతో కులగణన చేపట్టేందుకు ముందుకు వచ్చిందని తెలిపారు. కేంద్రంలో బిజెపి పూర్తి అధికారం కోల్పోయి రెండు పార్టీల భుజానా మీద నిలబడాల్సి వచ్చిందని, ఈ సమయంలో వెనుకబడిన తరగతుల వారిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు చేస్తోందని అన్నారు. ఓటర్ల జాబితాలో మార్పుల ద్వారా ఎన్నికల్లో గెలుపొందేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీయడమేనని పేర్కొన్నారు.     భారతదేశ భావన అంటేనే అందరం ఒకటని ఏచూరి ఎప్పుడూ చెప్పేవారని పేర్కొన్నారు. ఇప్పుడు సంఘపరివార్‌  ఏకత్వం తప్ప భిన్నత్వం ఉండకూడదని చెబుతున్నారన్నారు. సింధూనాగరికత, గ్రీకు నుండి వచ్చిన హిందూ, ఇండియా అనే పదాలకు ఇప్పుడు మతం రంగు పులిమారని పేర్కొన్నారు. గ్రంథాల్లోనూ, మరెక్కడా కూడా హిందూ ఇజం అనే మాటే లేదన్నారు. జంబూద్వీపం, భరతవర్షలో కూడా మతం లేదన్నారు. ఇలాంటి చరిత్రను చెప్పకుండా మతప్రాతిపదికన నడుస్తున్న దేశంగా ఉన్నట్లు రాజ్యాంగలోనూ, అన్నిట్లోనూ మార్పులు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. లౌకికవాదాన్ని రక్షించుకోకపోతే ఏ దేశమూ ముందుకు పోదని తెలిపారు. దేశం అభివృద్ధిని కోరుకునేవారు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో ముందుకు పోవాలనేవారు మతోన్మాదాన్ని అడ్డుకోవాలన్నారు. ఫాసిజం కఠినమైనదే అయినా పిరికిశక్తిగా ఉంటుందని పేర్కొన్నారు. అందువల్లే నేడు ట్రంప్‌ బెదిరిపోతున్నాడని తెలిపారు. ఎన్ని జరుగుతున్నా కనీసం ప్రశ్నించలేని వ్యక్తి ఎవరయినా ఉన్నారంటే మోడీ ఒక్కరేనన్నారు.సుంకాలతో మోడీకి దిమ్మతిరిగిపోయిందని అన్నారు. వెంటనే చైనా, రష్యా వద్దకు పరిగెత్తారని తెలిపారు. ఇప్పుడు అమెరికాతో ఉంటాడో, చైనాతో ఉంటాడో తేల్చుకోలేని మోడీ తీరు దేశానికి అవమానపరిచే విధంగా ఉన్నారన్నారు. విదేశాంగ విధానంలో తలదించుకునే పరిస్థితి తీసుకువచ్చారని అన్నారు. గాజాలో అమెరికా, ఇజ్రాయిల్‌ విధ్వంసం చేస్తుంటే నాలుగు వేలమంది మేధావులు యుద్ధాన్ని ఆపాలని కోరుతుంటే ఇజ్రాయిల్‌ను ఒక్కమాట అనలేనిస్థితిలో మోడీ ఉన్నారని తెలిపారు. ప్రజలు సామాన్యులు కాదని వారిని కష్టం వస్తే ఐక్యంగా పోరాడి ప్రజాస్వామ్యాన్ని రక్షించుకున్నారని, ఆ ప్రజలే రేపు దేశాన్ని రక్షించుకుంటారని అన్నారు. ఫెడరిలిజానికి నష్టం చేసే ప్రయత్నాలు చేస్తే అప్పట్లో యువకుడిగా ఉన్న ఏచూరి దాన్ని కాపాడే ప్రయత్నం చేశారని, ఇప్పుడు పాలకులు మరలా నష్టాన్ని తీసుకువస్తున్నారని అన్నారు. జిఎస్‌టి శ్లాబుల్లోనూ మార్పులు చేశారని తెలిపారు. దానివల్ల రాష్ట్రాలకు ఒరిగిందేమీ లేకపోగా వారి వాటాను కేంద్రం దోచుకుంటోందని అన్నారు. రాష్ట్రాలకు ఆదాయం లేకపోతే చిప్పపట్టుకుని కేంద్రాన్ని అడుక్కునే పరిస్థితి తీసుకువచ్చారని అన్నారు. సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు డి.రమాదేవి మాట్లాడుతూ ప్రస్తుత  పాలకులకు ప్రజాస్వామ్యం పట్టడం లేదన్నారు. భూములు యధేచ్చగా కార్పొరేట్లకు కట్టబెడుతున్నారని విమర్శించారు. సభకు అధ్యక్షత వహించిన సిహెచ్‌.బాబూరావు మాట్లాడుతూ మార్క్సిజాన్ని, లెనినిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఏచూరి నిర్వహించిన పాత్ర మరువలేదనిదని అన్నారు. ఆయనకు నివాళి అర్పించడం అంటే ప్రస్తుత పరిస్థితులను గుర్తుచేసుకుని భవిష్యత్‌ను నిర్దేశించుకోవడం అన్నారు. సోషలిజం ఎప్పుడూ వెనక్కు వెళ్లదని ఏచూరి ఎప్పుడూ చెప్పేవారన్నారు. తొలుత వక్తలను సిపిఎం ఎన్‌టిఆర్‌ జిల్లా కార్యదర్శి డి.వి.కృష్ణ వేదిక మీదకు ఆహ్వానించారు. ప్రజానాట్యమండలి కళాకారులు విప్లవ గేయాలు ఆలపించారు. అభ్యుదయ గేయాలకు నృత్యప్రదర్శన చేసిన కళాకారులను రాఘవులు, రమాదేవి సత్కరించారు. ఈ సందర్భంగా ఏచూరి వ్యాసాలతో ప్రజాశక్తి ప్రచురించిన ఓ సోషలిస్టు ఆచరణ పథకం పుస్తకాన్ని రాఘవులు ఆవిష్కరించారు.