
(ఈరోజు (11 సెప్టెంబర్, 2025) విలేకర్ల సమావేశం (విజయవాడలో) జరిగింది. ఆ వివరాలను ప్రచురణార్థం/ ప్రసారర్థం పంపుతున్నాము. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)
మోడీని వదిలించుకుంటేనే దేశం ముందుకు
బిజెపికి బలవబోతున్న టిడిపి
భూసమీకరణ పేరుతో మిత్రులకు లాభం
లోకేష్ ప్రకటనల్లో రాష్ట్ర భవిష్యత్‌పై ఆలోచన లేదు
రుషికొండ భవనాల్లో సైన్స్, ఆర్ట్, హెరిటేజ్ మ్యూజియం
సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు
దేశ రాజకీయాల్లో ప్రధాని మోడీ అనుసరిస్తున్న మతోన్మాద, విభజన విధానాల వల్ల దేశ ఐక్యతకు నష్టం వస్తుందని, ఇటువంటి వారిని వదిలించుకుంటేనే దేశం ముందుకు పోతుందని, ఈ విషయాన్ని తాము ముందు నుండీ చెబుతున్నామని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు అన్నారు. గురువారం విజయవాడ బాలోత్సవ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.రాంభూపాల్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. మోహన్‌భగవత్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ భిన్న సంస్కృతులను అంగీకరిస్తామని తెలిపారని, ఒకవైపు మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ, ప్రజల మధ్య చిచ్చుపెడుతూ ఇలాంటి మాటలు చెబితే ప్రజలు అంగీకరించరన్నారు. ఈ పద్ధతి నోటితో నవ్వి నొసటితో వెక్కిరించినట్లు ఉందని అన్నారు. మోహన్ భవగత్ కూడా రాజ్యాంగాన్ని అంగీకరిస్తామని, అయోధ్య రామాలయం తప్ప ఏ విషయంలోనూ ఆర్‌ఎస్‌ఎస్ జోక్యం చేసుకోదని చెబుతూనే కార్యకర్తలు కాశి మధురలలో తమ స్వయం జోక్యం చేసుకోవచ్చని చెప్పారని అన్నారు. వీటిని అంగీకరించడానికి ప్రజలు అవివేకులు, అర్థం చేసుకోలేనివారు కాదని అన్నారు. విచ్ఛిన్నకర పాలన చేస్తున్న మోడీ లాంటి వారికి ఎపి లాంటి రాష్ట్రాలు ఊతం ఇస్తున్నాయని, ఇలాంటి చర్యలతో రాష్ట్ర రాజకీయాలకు దుర్ఘతి పట్టిస్తున్నారని అన్నారు. బిజెపికి బేషరతుగా మద్దతు ఇస్తున్నామని రాష్ట్ర మంత్రి లోకేష్ చెబుతున్నారని, అంటే రాష్ట్రానికి ఏమి కావాలో కేంద్రాన్ని అడగరా అని ప్రశ్నించారు. దీనివల్ల టిడిపి ఉనికినే ప్రశ్నించుకునే పరిస్థితి ఏర్పడుతుందని విమర్శించారు. అలాగే 30 రోజులు జైల్లో ఉంటే పదవులు కోల్పోతారనే బిల్లుకూ ఆమోదం తెలిపారని, చంద్రబాబు, జగన్ కూడా జైల్లో ఉన్నారని, వీరందరూ రాజకీయాలకు దూరం అవ్వాలా అని ప్రశ్నించారు. బిజెపితో విడిపోయిన సమయంలో పొరపాటు జరిగిందని లోకేష్ చెబుతున్నారని, అంటే భవిష్యత్ మొత్తం బిజెపితోనే కలిసి నడుస్తారా అదన్నా చెప్పాలన్నారు. బిజెపికి టిడిపి దూరం జరిగితేనే రాష్ట్రానికి లాభమని, అంటకాగితే టిడిపి మాయం అవడానికి ఎంతో సమయం పట్టదని అన్నారు. దేశంలో బిజెపితో కలిసిన ప్రాంతీయ పార్టీలకు పట్టిస్తున్న గతిని తెలుసుకోకుండా టిడిపి నాయకులు బిజెపికి అంటకాగడం సరికాదన్నారు. పైగా తెలుగుదేశం పార్టీకి ఒక ప్రత్యేకత ఉందని, దాన్ని నిలబెట్టుకోవాలని అన్నారు.
ట్రంప్ సుంకాల వల్ల రాష్ట్రంలో ఆక్వా రైతులు దెబ్బతిన్నారని, 50 లక్షల మంది పాడి రైతులు కూడా ట్రంప్‌తో ఒప్పందం జరిగితే నష్టపోతారని తెలిపారు. ట్రంప్ సుంకాలపై కేంద్రం ఏమి చేస్తుందో అడిగే ధైర్యం రాష్ట్ర పాలకులకు లేకుండా పోయిందన్నారు. పైగా మా ఆలోచనలకు మాకు ఉన్నాయని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇలాంటి చర్యల ద్వారా టిడిపి బిజెపికి గులాంగిరీ చేస్తోందని మండిపడ్డారు.
విశాఖలో రుషికొండ భవనాలు పాతకాలపు రాజమందిరాల్లా ఉన్నాయని, వాటిని ఎలా వినియోగించుకోవాలో రాష్ట్రం ఇంతవరకు తేల్చుకోలేకపోవడం అన్యాయం అన్నారు. ప్రజల సొమ్ముతో నిర్మించిన భవనాలను కల్యాణ మండపాలు, రిసార్టుల్లా కాకుండా భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా సైన్స్, ఆర్ట్, హెరిటేజ్ మ్యూజియంగా అభివృద్ధి చేయాలని, సిపిఎం పార్టీ వైఖరి కూడా అదేనని అన్నారు. క్వాంటం టెక్నాలజీ వైపు వెళుతున్నామని చంద్రబాబు ఇలాంటివి చేయడం ద్వారా యువతను టెక్నాలజీ, సైన్స్ వైపు మళ్లించవచ్చని అన్నారు. రుషికొండ రిసార్టు కళ్యాణ మండపం, కాన్ఫరెన్సు హాలు చేస్తే ధనవంతుల విలాసాలకు మాత్రమే ఉపయోగపడతాయని, మ్యూజియం చేస్తే భవిష్యత్ తరాలకు ఉపయోగమని అన్నారు. ఇలాంటివి ఇప్పటికే ఢల్లీి, చైన్నై, బెంగుళూరులో ఉన్నాయని పేర్కొన్నారు. అమరావతి రాజధాని పరిధిలోనూ జంతు ప్రదర్శనశాల బొటానికల్ గార్డెన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. రాయలసీమలోనూ మరొకటి నిర్మించాలని తెలిపారు.
విద్య, వైద్యం ప్రభుత్వరంగంలోనే ఉండాలి
విద్య, వైద్యం ప్రైవేటురంగంలోనే ఉండాలని, వాటిని ప్రైవేటుపరం చేయడం ద్వారా సామాన్యులకు అవి అందకుండా పోతాయని తెలిపారు. ప్రైవేటుపరం చేయడంసరికాదని అన్నారు. ఏదైనా ప్రభుత్వ రంగంలోనే ఉండాలని అన్నారు. ప్రైవేటీకరణ అంటే మిత్రులకు దోచిపెట్టడం తప్ప మరొకటి కాదని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆస్తుల ప్రైవేటీకరణలోనూ, పిపిపి పద్దతి అనుసరించడంలోనూ జగన్‌కు, చంద్రబాబుకు పెద్ద తేడా లేదని అన్నారు. పిపిపి అంటేనే అందినకాడికి దోచుకోవడమని, ఈ రెండు పార్టీలూ ఆదే పద్దతిని పాటిస్తున్నాయని తెలిపారు.
ప్రజల భూములతో ప్రభుత్వ వ్యాపారం
రాష్ట్రంలో భూ సమీకరణ పేరుతో ప్రజల భూములను బెదిరించి లాక్కుని వాటితో ప్రభుత్వం వ్యాపారం చేస్తోందని రాఘవులు అన్నారు. వాటిని ఎక్కువ ధరకు అమ్మితే ప్రభుత్వానికి లాభమని, తక్కువ ధరకు అమ్మితే ప్రభుత్వంలో ఉన్న పెద్దల మిత్రులకు లాభమని తెలిపారు. జగన్, టిడిపి, బిజెపి పార్టీలన్ని అంతేనని, రైతుల భూములతో వ్యాపారం చేసుకుంటున్నాయని విమర్శించారు. ప్రజావసరాలకు భూ సమీకరణ, సేకరణ ఏదైనా సరే రైతుల అనుమతితో జరగాలని, అదీ పంటలు పండే భూములు తీసుకోకూడదని, పర్రలుగా ఉన్న వాటిని తీసుకుని అభివృద్ధి చేయాలని అన్నారు. నష్టపరిహారం 2013 భూ సేకరణ చట్టం కింద ఇస్తేనే భూములిచ్చిన వారికి న్యాయం జరుగుతుందని తెలిపారు. సమీకరణ అంటే రైతులను నయానో భయానో బెదిరించి లాక్కోవడం తప్ప మరొకటి కాదని అన్నారు.
