
(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
విజయవాడ,
తేది : 09 సెప్టెంబరు, 2025.
శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,
గౌరవ ముఖ్యమంత్రి,
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,
అమరావతి.
విషయం : పాడేరు ఏజెన్సీలో బెరిబొరార్ తెగులు సోకి నష్టపోతున్న గిరిజన కాఫీ రైతులకు ప్రభుత్వం తక్షణమే ఆదుకొని, తెగులు విస్తరించకుండా యుద్ధ ప్రతిపదికన చర్యలు తీసుకోవాలని కోరుతూ...
అయ్యా!
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఏజెన్సీలో ఆర్గానిక్ కాఫీ ఎక్కువ సాగువుతుంది 2.58 లక్షల ఎకరంలో 2.48 లక్షల మంది కాఫీ రైతులు ఆధారపడి జీవిస్తున్నారు. మరో లక్ష ఎకరాల్లో కాఫీ పంటలకు విస్తరించినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో కాఫీ పంటలకు తెగులు సోకడం ఆందోళన కలిగిస్తుంది. కాఫీ పంట చేతికి వచ్చిన సమయంలో బెరిబొరార్ తెగులు తీవ్రంగా వ్యాప్తి చెందుతూ ఉండడంతో ఆదివాసీ కాఫీ రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తక్షణమే తెగులు విస్తరించకుండా యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుని కాఫీ తోటలను పరిరక్షించాలని కోరుతున్నాను.
అరకువేలి మండలం చినలబుడు పంచాయతీ పకనకుడి గ్రామంలో ఆగస్టు 28 తేదీన సింగారం, సువర్ణ కాఫీ రైతు తోటలో మొదటగా బెరిబోరర్ తెగులు సోకినట్లు కేంద్ర కాఫీ బోర్డు అధికారులు గుర్తించారు. అరకువేలి చినలబుడు పంచాయతీ పకనకుడి 29, మాలివల్స 29, మాలిసింగారం7, చినలబుడు 5, తురైగూడ గ్రామంలో 2 ఎకరాల్లో బెరిబెరర్ తెగులు సోకినట్లు ప్రభుత్వం గుర్తించినది. చినలబుడు పంచాయతీలో 90 ఎకరాల్లో తెగులు సోకిన ప్రాంతాన్ని రెడ్‌జోన్‌గా ప్రభుత్వం ప్రకటించింది. సకాలంలో స్పందించి నివారణ చర్యలు తీసుకొని ఉంటే నష్టం చాలా తక్కువ స్థాయిలో ఉండేది. ఇప్పటికే ఈ ప్రాంతానికి గిరిజన సంక్షేమ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, జిల్లాకలెక్టర్ శ్రీ దినేష్ కుమార్ పర్యటించారు. కాని ఎలాంటి నిర్దిష్ట చర్యలూ అమలు కాలేదు. నష్టపోయిన రైతులకు న్యాయం చేసేవిధంగా లేదు.
తెగులు సోకిన కాఫీ పళ్ళకు కిలో రూ.250లు కాఫీ రైతులకు ఎకరానికి 20 వేలు పరిహారం మంజూరు చేస్తామని మీరు ప్రకటించినట్లుగా అధికారులు చెప్తున్నారు. కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటనా రాలేదు. కాఫీ రైతుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని కిలో రూ.50లు కొనుగోలు చేయాలని ఎకరాకు రూ.50 వేలు పరిహారం ఇవ్వాలని కోరుతున్నాను. ఏజెన్సీ కాఫీ తోటల రక్షణకు చర్యలు తీసుకోవాలని, తెగులు నివారణకు ప్రభుత్వ ఖర్చుతో మందులు, కూలీలు ఏర్పాటు చెయ్యాలని కోరుతున్నాను.
ఇప్పుడిప్పుడే పాడేరు ఏజెన్సీ ఆర్గానిక్ కాఫీకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఏజెన్సీ కాపీని ప్రమోట్ చెయ్యడానికి పార్లమెంట్లో ప్రత్యేక స్టాల్ కూడ ఏర్పాటు చేసింది. ప్రధాని స్వయంగ మన్ కి భాత్ కార్యక్రమంలో ఏజెన్సీ కాపీ రైతుల గొప్పతనం గురించి ప్రస్తావించారు. కానీ కాఫీ రైతులకు కేంద్రం నుండి ఎలాంటి రాయితీలు ప్రకటించలేదు. తోటలకు ఇన్సూరెన్స్ సదుపాయం లేదు. పాడేరు ఏజెన్సీలో కాఫీ తోటల విస్తరణ, విత్తనాలు చీడపీడలు నివారణకు కాఫీ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయడం అవసరం. కాఫీ బోర్డు, జిసిసి ద్వారా మార్కెట్‌లో అరకు కాఫీని ప్రమోట్ చేయాలని కోరుతున్నాను.
ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని పాడేరు ఏజెన్సీలో బెరిబొరార్ తెగులు సోకి నష్టపోతున్న కాపితోటలను ఆదుకోవాలి. కాఫీ రైతుల కేంద్రం నుండి వచ్చే రాయితీలు వచ్చేవిధంగా ఈ క్రింది చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను.
(1) బెరిబొరార్ తెగులు సోకిన తోటలకు ప్రభుత్వ ఖర్చుతో అన్ని రకాల నివారణ చర్యలు తీసుకోవాలి.
(2) తెగులు సోకి న పళ్ళకు కిలో 200 రూపాయలు ఇవ్వాలి.
(3) నష్టపోయిన కాపీ తోటలకు ఎకరాకు 50 వేలు నష్టపరిహారం చెల్లించాలి.
(4) పాడేరు కేంద్రంగా కాపీ పరిశోధన కేంద్రం ఏర్పాటు చెయ్యాలి. ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా మార్కెటింగ్ బాధ్యత చూడాలి.
అభివందనములతో...
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి
