ఈరోజు (04 సెప్టెంబరు, 2025) విలేకర్ల సమావేశం (విజయవాడలో) జరిగింది. ఆ వివరాలను ప్రచురణార్థం/ ప్రసారర్థం పంపుతున్నాము. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి
రాష్ట్రంలో కూటమి ఎమ్మెల్యేల అరాచకం
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు
అత్యధిక మంది వసూల్ రాజాలయ్యారు
ఈ రోజుల్లో ఫ్యాక్షనిజం చెల్లదు
రాష్ట్రంలో కూటమి ఎమ్మెల్యేలు వసూల్ రాజాలుగా మారి అరాచకం చేస్తున్నారని, కార్పొరేట్ కంపెనీలకు ఏజెంట్లుగా మారి ప్రజలను బెదిరిస్తూ కాలం చెల్లిన ఫ్యాక్షన్ భాష వాడుతున్నారని, గొంతులు కోసే ఫ్యాక్షన్ భావజాలాన్ని ఎవరూ సహించరని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం సిపిఎం రాష్ట్ర కార్యాలయంలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కిల్లో సురేంద్రతో కలిసి ఆయన మాట్లాడారు. ప్రజాప్రతినిధులుగా వారి సంక్షేమం కోసం పనిచేయాల్సిన ఎమ్మెల్యేలు ప్రజలను బెదిరించి దోచుకుంటున్నారని తెలిపారు. గుత్తి దగ్గర భూసేకరణ పేరుతో పేదలకు అన్యాయం చేస్తుంటే ప్రశ్నించిన రైతు సంఘం రాష్ట్ర నాయకులు ప్రభాకరరెడ్డిని ఎంఎల్‌ఎ బెదిరించడాన్ని ఆయన తీవ్రంగా ఖండిరచారు. సుగాలి ప్రీతి తల్లి గురించి జనసేన నాయకులు అన్యాయంగా మాట్లాడుతున్నారని, 2017లో ఈ ఘటన జరిగిన సమయంలో పవన్‌కల్యాణ్ గొంతుచించుకుని ప్రచారం చేశారని, ఇప్పుడు మౌనంగా ఉండటం తగునా అని అడిగారు. సిబిఐకి కేసు అప్పగించామని చేతులు దులుపుకుంటున్నారని, రాష్ట్ర పరిధిలో ఉన్న సిఐడిని మాత్రం గత ప్రభుత్వం లాగానే రాజకీయ నేతలను వేధించేందుకు వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల గురించి తప్పుగా మాట్లాడే ఎంఎల్‌ఎ లపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేసినందువల్ల ప్రయోజనం లేదని వెంటనే చర్యలుతీసుకోవాలని లేనిపక్షంలో ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.
యూరియాను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారు
రాష్ట్రంలో యూరియా కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్‌కు తరలించి రైతులను ఇబ్బంది పెడుతున్నారని శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు, అధికార పార్టీ నాయకులు దీనికి బాధ్యత వహించాలన్నారు. బ్లాక్‌మార్కెట్‌ను నివారించి కేంద్రం నుండి తెప్పించి రైతు సేవా కేంద్రాల ద్వారా పంపిణీ చేయాలని కోరారు. అలాగే స్టీలు ప్లాంటు విషయంలో అధికార కూటమి నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం కాదని, ప్రైవేటీకరణ ఆపాలని డిమాండు చేశారు. ఆ పనిచేయకుండా కార్మిక సంఘాల నాయకులపై అపవాదులు మోపడం దుర్మార్గమని, నిజంగా అక్రమాలు చేస్తే పేర్లు బయటపెట్టి చర్యలు తీసుకోవాలని సవాలు విసిరారు. బాధ్యతాయుత స్థానాల్లో ఉన్నవారు ఇలా ఆరోపణలు చేయడం సరికాదని, అవినీతికి పాల్పడిన వారి వివరాలు బయటపెట్టాలని డిమాండు చేశారు.
గిరిజన హక్కులు కాలరాస్తున్నారు : కిల్లో సురేంద్ర
రాష్ట్రంలో ఆదివాసీలకు చట్ట ప్రకారం లభించిన హక్కులను కూటమి ప్రభుత్వం కాలరాస్తోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కిల్లో సురేంద్ర విమర్శించారు. 5వ షెడ్యూలులో ఉన్న ఏజెన్సీ ప్రాంతంలో 10 వేల ఎకరాలను అదానీ, నవయుగ కంపెనీకి కేటాయించారని అక్కడ గెడ్డను మూసేసి భూములు స్వాధీనం చేసుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తెలిపారు. అడవీ, భూమి లేకుండా ఆదివాసీలు జీవించలేరని అన్నారు. ఆదివాసీ బిడ్డలకోసం స్పెషల్ డిఎస్‌సి వేయాలని కోరారు. గిరిజన ప్రాంతాల్లో 766 పోస్టులు ఉంటే ఇప్పుడున్న పద్ధతుల్లో భర్తీ చేస్తే 42 పోస్టులు మాత్రమే వస్తాయని ఇంతకంటే అన్యాయం మరొకటి లేదని అన్నారు. చంద్రబాబు ఎన్నికల ముందు ఆ ప్రాంతంలోకి వచ్చిన సమయంలో మరోజన్మంటూ ఉంటే గిరిజన బిడ్డగా పుడతానని చెప్పారని, ఇప్పుడు ఉన్న గిరిజనులకు మరణశాసనం రాస్తున్నారని విమర్శించారు. పవన్‌కళ్యాణ్ గారు అడవితల్లి బాట పేరు చెప్పి ఇప్పుడు ఆదానీ బాట పట్టారని మండిపడ్డారు. ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని కార్పొరేట్లకు ఇచ్చిన భూములు రద్దు చేయాలని కోరారు. గిరిజనులు నిర్వహిస్తున్న ఆందోళనకు సిపిఎం సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలిపారు. ఇవే అంశాలపై గరవ్నర్‌కు వినతిపత్రం ఇవ్వనున్నట్లు తెలిపారు.
ఎస్‌ఆర్‌ఎం, విట్‌లో రైతులకు అన్యాయం
రాజధాని పరిధిలో భూములిచ్చిన రైతుల పిల్లలకు అక్కడ ఏర్పాటు చేసిన ఎస్‌ఆర్‌ఎం, విట్ వంటి యూనివర్శిటీల్లో సీట్లు ఇవ్వడం లేదని, కనీసం ఫీజు రాయితీ కూడా లేదని శ్రీనివాసరావు తెలిపారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు ఏమి న్యాయం చేస్తారో తెలియడం లేదని పేర్కొన్నారు. తమ జీవనాధారమైన భూముల్ని రాజధానికి అప్పగించిన రైతుల బిడ్డలకు కనీసం ప్రవేశం లేకపోతే ఎలాగని ప్రశ్నించారు.
జిఎస్‌టి పేరుతో రాష్ట్రాలకు అన్యాయం
తాజాగా ప్రకటించిన జిఎస్‌టి రేట్ల మార్పుకు శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు. సిపిఎం ఎప్పటినుండో నిత్యావసరాలపై జిఎస్‌టి తగ్గించాలని డిమాండ్ చేస్తోందన్నారు. అయితే జిఎస్‌టి పేరుతో రాష్ట్ర ఆదాయాలను కూడా కేంద్రం తన గుప్పిట్లో పెట్టుకుని అన్యాయంగా వ్యవహరిస్తోందని తెలిపారు. ఇప్పుడు ఇచ్చిన జిఎస్‌టి శ్లాబుల వల్ల రాష్ట్రాలకు రావాల్సిన వాటాలు తగ్గితే వాటిని కేంద్రం పూడుస్తుందా లేదా సమాధానం చెప్పాలన్నారు. జిఎస్‌టిని సమర్థించిన చంద్రబాబు, పవన్‌కల్యాణ్ కేంద్రం నుండి రావాల్సిన నిధులు తగ్గితే ఒత్తిడి చేసి తెచ్చుకుంటారా? లేదా ఆ భారం ప్రజలపై మోపుతారా? చెప్పాలన్నారు. అనేక రాష్ట్రాలు జిఎస్‌టి పరిహారం కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తుంటే మన రాష్ట్రం మిన్నకుండి పోయిందని, ఇప్పటికైనా కేంద్రంపై ఒత్తిడి చేసి పరిహారం సాధించాలని కోరారు. ఆ భారాన్ని రాష్ట్ర ప్రజలపై వేస్తే అంగీకరించబోమన్నారు.
ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేటు ఉపాధ్యాయులు, అధ్యాపకులకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో పనిచేస్తున్న లక్షలాది మంది ఉపాధ్యాయులు జాతిభవిష్యత్‌ను తీర్చిదిద్దుతున్నారని అన్నారు. అయితే వారిపై రాజకీయ పెత్తనం పెరిగిందని, అకడమిక్ పనికూడా చేయనీయడం లేదని తెలిపారు. ఉపాధ్యాయులు భయపడుతూ బోధన చేయలేరన్నారు. విద్యావ్యవస్థ ఆపదలో పడిరదని పేర్కొన్నారు. నాలుగో తరగతిని ఇంటర్మీడియట్ విద్యకు కలిపారని, ఒకటి రెండు తరగతులను అంగన్‌వాడీలో విలీనం చేశారని తెలిపారు. హైస్కూళ్లను గ్రామాలకు నాలుగైదు కిలలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేస్తూ పేదలకు విద్యను దూరం చేస్తున్నారని అన్నారు. విద్యాయేతర పనులు అప్పగించి ఉపాధ్యాయులను వేధిస్తున్నారని, వారికి అకడమిక్ స్వేచ్ఛ ఇవ్వాలని కోరారు. అయితే ప్రస్తుత ప్రభుత్వాలు ఆపనిచేయకుండా ముఖ్యంగా బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత శాస్త్రీయ విద్యావిధానం స్థానంలో మతోన్మాదాన్ని పెంచే సిలబస్ తీసుకొచ్చి భవిష్యత్ తరాలను పాడు చేస్తున్నారని మండిపడ్డారు. వాస్తవాలను తెలియనీయకుండా విద్యార్థుల మెదళ్లలో విషబీజాలు నాటుతున్నారని తెలిపారు. ఒకప్పుడు మనకంటే వెనుకున్న చైనా శాస్త్ర సాంకేతిక రంగాల్లో దూసుకుపోతోందని 156 క్యూబిట్ కంప్యూటర్ల తయారు చేస్తుంటే మనదేశం మాత్రం పురాణాల పేరుతో వెనక్కు పోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాస్త్ర, సాంకేతిక రంగాలు, చరిత్రను సరైన కోణంలో బోధించారు.
రైతు నాయకులు ప్రభాకరరెడ్డిని బెదిరించిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలి
భూములు చూసేందుకు వెళ్లిన రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ప్రభాకరరెడ్డిని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఫోన్‌లో అసహ్యంగా, అవమానకరంగా మాట్లాడారని, కార్పొరేట్ ఏజెంటుగా మారి రైతుల్ని దోపిడీ చేస్తున్నారని అన్నారు. ఫ్యాక్షనిజాన్ని మరలా ముందుకు తెచ్చి ప్రజల్ని అణచివేస్తామంటే సహించే రోజులు పోయాయన్నారు. ఆయనపై ముఖ్యమంత్రి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు. అలాగే శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి అటవీ అధికారులపై దాడి చేశారని, అనంతపురం ఎమ్మెల్యే ప్రసాదు జూనియర్ ఎన్‌టిఆర్ తల్లిని కించపరిచారని ఇలాంటి వ్యక్తులు ప్రజలను ఏమి న్యాయం చేస్తారని ప్రశ్నించారు. చంద్రబాబు, లోకేష్ పేర్లు చెప్పి అక్రమ వసూళ్లకు దిగుతుంటే వారిపై చర్యలు తీసుకోకపోవడం ఏమిటని ప్రశ్నించారు. ఎక్కువ మంది ఎమ్మెల్యేలు వసూళ్లు చేసుకోవడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. ఇలాంటి వారిపై ముఖ్యమంత్రి చర్యలు తీసుకోకపోతే ప్రజలు తిరగబడే రోజు అతి త్వరలోనే వస్తుందని హెచ్చరించారు.
