
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 18 ఆగష్టు, 2025.
అక్రమ అరెస్టులకు ఖండన
నెల్లూరు జిల్లా కరేడులో ఇండోస్సోల్ కంపెనీకి బలవంతంగా వేలాది ఎకరాల రైతుల భూములను కట్టబెట్టే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజాసంఘాలు ఇచ్చిన ఛలో కరేడు పిలుపుపై పోలీసులు నిర్బంధం ప్రయోగించడాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ ఖండిస్తున్నది. ప్రజాస్వామ్య పద్దతిలో శాంతియుతంగా నిర్వహించతలపెట్టిన సభకు వెళ్తున్న పార్టీ, రైతు, ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకొని అరెస్టు చేయడం గర్హనీయం. అరెస్టు చేసినవారిని వెంటనే విడుదల చేయాలని సిపిఐ(యం) డిమాండ్ చేస్తున్నది. పోలీసు నిర్బంధాన్ని ఎదుర్కొని కరేడు గ్రామంలో సభ జరగడాన్ని సిపిఐ(యం) హర్షిస్తున్నది.
ఈ కార్యక్రమానికి అనుమతులు లేవని 30వ సెక్షన్, 144 సెక్షన్ ప్రకటించి ప్రధాన రహదారులను పోలీసులు నిర్బంధించడం అప్రజాస్వామికం. ముందురోజే అనేకమంది నాయకులను గృహ నిర్బంధం చేశారు. తమకు తీవ్ర నష్టం కలిగించే భూసేకరణను నిరసిస్తూ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నవారిపై పోలీసు నిఘా పెట్టారు. నిరసన వ్యక్తం చేసేందుకు కరేడు గ్రామం వెళ్తున్న ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు సుమారు 100 మందిని అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు వి.వెంకటేశ్వర్లు, దడాల సుబ్బారావు, సిపిఐ(యం ఎల్) నాయకులు లక్ష్మీరెడ్డి, లిబరేషన్ నాయకులు హరినాథ్, కె.గణేష్, నల్లమడ రైతు ఉద్యమ నాయకులు డా॥ కొల్లా రాజమోహన్, నెల్లూరు సిపిఐ(యం) జిల్లా కార్యదర్శి మూలం రమేష్, ప్రకాశం జిల్లా సిపిఐ(యం) కార్యదర్శి ఎస్.కె.మాబు, కౌలురైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి యం.హరిబాబు, నెల్లూరు జిల్లా నాయకులు మోహనరావు, రైతుసంఘం జిల్లా కార్యదర్శి వెంగయ్య, నాయకులు జి.వెంకటేశ్వర్లు ఉన్నారు. గృహ నిర్బంధం అయినవారిలో నెల్లూరు జిల్లా సిపిఐ(యం) సీనియర్ నాయకులు చండ్ర రాజగోపాల్, నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు, టి.మాల్యాద్రి, కట్టా సతీష్ మొదలగువారు ఉన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా భూసేకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రజలపై పోలీసు నిర్బంధాన్ని ఆపాలని, ప్రభుత్వం తన మొండి వైఖరి విడనాడి ఇండోస్సోల్ కంపెనీకి భూముల కేటాయింపు రద్దు చేయాలని సిపిఐ(యం) డిమాండ్ చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరిని నిరసించవలసిందిగా ప్రజలకు, మేధావులకు సిపిఐ(యం) విజ్ఞప్తి చేస్తున్నది.
(జె.జయరాం)
ఆఫీసు కార్యదర్శి
