
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 03 ఆగష్టు, 2025.
హైకోర్టు క్వాష్ చేసిన 15 ఏపిఏసిబి కేసులపై ప్రభుత్వం అప్పీల్ చేయాలి
కేవలం సాంకేతిక కారణాలు చూపి 01/08/2025న హైకోర్టు 15 అవినీతి కేసులను రద్దు చేయడం విస్మయం కలిగించింది. ఈ కేసుల్లో ఒక్కొకరు ఒక్కొక్క రకమైన అవినీతిపరులని, రూ.100 కోట్లకు పైగా చొప్పున సమాజాన్ని ప్రభుత్వ ఉద్యోగుల ముసుగులో దోచుకున్న నేరస్తులని వ్యాఖ్యనాలున్నాయి. ఆ 15 కేసులలోని ఆ తీవ్రమైన అవినీతిపరులనీ నాటి ఏపీ ఏసీబీ పట్టుకొని చట్టం ముందు దోషులుగా నిలబెట్టి సమాజం ముందు వారి నేరాలని ఎండగట్టినా ఇలా రద్దు కావడం ద్వారా అవినీతికి పట్ట పగ్గాలు లేకుండా పోయే పరిస్థితి. సిఆర్‌పిసి సెక్షన్ 2(ఎస్) ప్రకారం ఏదైనా కార్యాలయం పోలీస్ స్టేషన్‌గా పరిగణించబడాలంటే ప్రభుత్వం గజిట్ నోటిఫికేషన్ ఇవ్వాలి. జీవో రిలీజ్ చేయని కారణంగా ఏసీబీసిఐ యూ యూనిట్ నమోదు చేసిన కేసులన్నీ ఉన్నపలంగా రద్దు అయిపోయినాయి.
2014లో రాష్ట్ర విభజన తర్వాత జివో ఎమ్‌ఎస్ నెంబర్ : 137 ద్వార 2022 సెప్టెంబర్ 14న ఏపి ఏసీబీ సిఐయూ యూనిట్ నోటిఫై చేసింది. దీంతో 2014 నుంచి 2022 జీవో విడుదలకు ముందు నమోదు చేసిన సెంట్రల్ యూనిట్ కేసులన్నీ ఒక్క హైకోర్టు క్వాష్ తో రద్దైపోయినాయి. స్పెషల్ కోర్టులు` నోటిఫై కాని పోలీస్ స్టేషన్ నుండి వచ్చిన కేసులను స్వీకరించటాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తప్పు పట్టింది. ఏసీబీ సెంట్రల్ యూనిట్ లోని కేసులన్నీ void ab initio (ప్రారంభం నుంచే చెల్లనివి)గా ఏపీ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఈ విషయం లో రాష్ట్రం లోని ప్రధాన పార్టీలు, పెద్ద పత్రికలు నోరు మెదపకపోవటంతో మున్ముందు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అప్పీల్‌కి వెళ్తుందా? లేదా అన్న సందేహాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.
కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా మేల్కొని సుప్రీంకోర్టుకు పోయి నెట్‌వర్క్ కేసులను తిరిగి విచారణ, అవినీతి పరులపై కఠిన చర్యలు తీసుకొనేలా నిర్ణయం తీసుకోవాలని సిపిఐ(యం) డిమాండ్ చేస్తోంది.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి
