
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 01 ఆగష్టు, 2025.
మరో రూ. 12,771 కోట్ల విద్యుత్ భారం ఆపాలి - సిపిఎం డిమాండ్
ఆగష్టు 5 ‘‘ప్రజా వేదిక’’ ధర్నాలను జయప్రదం చేయాలని విజ్ఞప్తి
విద్యుత్ ఛార్జీలు పెంచడం లేదంటూనే మరలా ట్రూఅప్ పేరుతో మరో రూ.12,771 కోట్లు భారాన్ని మోపడాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. తక్షణం దీన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నది.
2019`20 నుండి 2023`24 సంవత్సరాలకు సంబంధించి విద్యుత్ రిటైల్ వ్యాపార లోటు పేరుతో రూ.12,771 కోట్లు ట్రూ అప్ భారం వేయడానికి విద్యుత్ పంపిణీ సంస్థలు విద్యుత్ నియంత్రణా మండలికి ప్రతిపాదనలు పంపి బహిరంగ ప్రకటన చేశాయి. రాష్ట్ర ప్రభుత్వానికి తెలియకుండా ఇది జరగదు. ప్రభుత్వం వెంటనే స్పందించి, ఛార్జీల పెంపుదలను నిలుపుదల చేయాలి.
గత 36 నెలల నుండి 2014`19 కాలానికి సంబంధించిన రూ.3 వేలకోట్లు ట్రూ అప్ చార్జీలు వసూలు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత 2022`23, 2023`24 సంవత్సరాల కాలానికి రూ.15,485 కోట్లు సర్దుబాటు చార్జీల భారం మోపారు. ఇదికాక 2024`25 సంవత్సరానికి ప్రతినెల యూనిట్‌కు 40 పై. చొప్పున ఒక్క సంవత్సరంలోనే రూ. 2787 కోట్లు వసూలు చేశారు. స్మార్ట్ మీటర్లు వలన అదనపు భారాలు సిద్ధంగా ఉన్నాయి.
గత ప్రభుత్వం వేసిన విధంగా విద్యుత్ భారాలు వేయబోమని, తగ్గిస్తామని కూటమి పార్టీలు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాయి.కూటమి సర్కార్ మాట తప్పింది. భారాలు మోపింది.ప్రజలు వీటిపై ఆందోళన చెందుతున్నారు. ఇటీవల రూ.449 కోట్లు ట్రూ డౌన్ ద్వారా చార్జీలు తగ్గిస్తామని ప్రచారం చేస్తున్నారు.ఈ తరుణంలో మరో రూ.12,771 కోట్లు భారం మోపుతూ పంపిణీ సంస్థలు, విద్యుత్ నియంత్రణ మండలికి ప్రతిపాదనలు పంపగా మండలి వాటిపై అభిప్రాయాలు తెలపాలని జూలై 30న నోటిఫికేషన్ ఇచ్చింది. నిర్ణయించిన విద్యుత్ చార్జీలు చెల్లించిన సంవత్సరం, 5 సంవత్సరాల తరువాత ఆదాయ, వ్యయాల మధ్య లోటు పేరుతో ట్రూ అప్ చార్జీలు వసూలు చేసే విధానమే అక్రమం. ఈ విధానాన్ని అడ్డం పెట్టుకుని ప్రభుత్వం, పంపిణీ సంస్థలు కార్పొరేట్ కంపెనీలతో అక్రమ ఒప్పందాలు,అవినీతి చర్యలతో అడ్డగోలుగా వ్యయం పెంచి ఆ భారాన్ని వినియోగదారులపై వేయడం గర్హనీయం.
విద్యుత్ ఛార్జీల పెంపుదలకు వ్యతిరేకంగా, ట్రూఅప్/ ఇందన సర్దుబాటు ఛార్జీల విధానం రద్దుచేయాలని, స్మార్ట్ మీటర్లు వద్దని ఆగష్టు 5న ప్రజావేదిక ఆధ్వర్యంలో జరిగే ధర్నాలను జయప్రదం చేయాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నది.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి
--
COMMUNIST PARTY OF INDIA (MARXIST)
Andhra Pradesh Committee
H.No. 27-30-9,
Akula vari Street,
Governorpet,
Vijayawada - 520 002.
Phone: 0866-2577202;
Web: www.cpimap.org
