(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
విజయవాడ,
తేది : 01 ఆగష్టు, 2025.
శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,
గౌరవ ముఖ్యమంత్రి,
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,
అమరావతి.
విషయం: నర్సీపట్నం బ్రిటీషు సమాధుల చారిత్రక స్థల దురాక్రమణలను తొలగించి, స్వాతంత్య్ర పోరాట చిహ్నంగా అభివృద్ధి చేయాలని కోరుతూ...
అయ్యా!
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాల్టీ పరిధిలో అల్లూరి సీతారామరాజు వీరోచిత పోరాట స్ఫూర్తికి ప్రతిబింబాలుగా నిలిచిన సర్వే నెంబర్ 9 లోని 46 సెంట్లలో బ్రిటిష్ సమాధుల స్థలాన్ని కొంతమంది ఆక్రమించి శాశ్వత భవన నిర్మాణాలు చేపడుతున్నారు. 46 సెంట్లు సమాధి స్థలంలో ఇప్పటికే 27 సెంట్లు ఆక్రమణకు గురైంది. మిగిలిన 19 సెంట్లలో ప్రస్తుతం నిర్మాణ పనులు చేస్తున్నారు. ఈ నిర్మాణాలకు అనుమతులు కూడా లేవు. ఇటీవలే లీగల్‌సెల్ చైర్మన్, పురావస్తు శాఖ సిబ్బంది స్థలాన్ని సందర్శించి, మున్సిపల్ అధికారుల సహకారంతో తుప్పలు డొంకలతో ఉన్న స్థలాన్ని క్లీన్ చేయించారు. సమాధి స్థలాన్ని కాపాడాల్సిన మున్సిపల్, రెవెన్యూ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఆక్రమణలు తొలగించాల్సిన యంత్రాంగం మౌనం వహించడం పలు అనుమానాలకు తావిస్తోంది.
ఇది కేవలం సమాధులున్న స్థలం మాత్రమే కాదు. దీనికొక చరిత్ర ఉంది. అల్లూరి సీతారామరాజు బ్రిటీషు వారికి వ్యతిరేకంగా సాగించిన మన్యం పోరాటంలో చనిపోయిన పోలీసుల శవాలను నాటి కలెక్టర్ రూథర్‌ఫర్డ్, సీతారామరాజు నాయకత్వంలోని మన్యం వీరులకు కప్పం కట్టి అక్కడ పూడ్చిపెట్టారు. ఇలాంటి చారిత్రక స్థలాన్ని భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది. అల్లూరి సీతారామరాజు ఉద్యమ స్ఫూర్తి చిహ్నాలుగా వున్న ఈ బ్రిటీషు సమాదుల స్థల ఆక్రమణలు తొలగింపునకు తక్షణ చర్యలు చేపట్టాలి. ఆక్రమణదారులు, వారికి సహకరిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తిచేస్తున్నాను.
బ్రిటిష్ సమాధుల స్థలం పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్ది, పోరాట చిహ్నంగా అక్కడ పార్కుగా అభివృద్ధి చేయాలి. స్థల వివాదం కోర్టులో ఉండగా నిర్మాణాలు చేపట్టడం చట్ట విరుద్ధం. ఆక్రమణలు తక్షణమే తొలగించాలని కోరుచున్నాము. కోట్లు విలువైన ప్రభుత్వ స్థల ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
అభివందనములతో...
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి
గమనిక :- ఇందువెంట అవసరమైన అధికారిక ఉత్తర్వులను జతపరుస్తున్నాను.
