పి - 4 భారాన్ని ఉద్యోగులపై నెట్టకండి.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 27 జూలై, 2025.

పి - 4 భారాన్ని ఉద్యోగులపై నెట్టకండి
- సిపిఐఎం విజ్ఞప్తి
గత నాలుగైదు మాసాలుగా రాష్ట్రంలో పి`4 పేరుతో పేదరిక నిర్మూలన చేస్తామని సంపన్నులు ముందుకు వచ్చి మార్గదర్శకులుగా నిలబడాలని, పేదవాళ్ళను బంగారు కుటుంబాలు చేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు ఊదరగొడుతున్నారు. కానీ వారికి కార్పొరేట్లు, సంపన్నుల నుండి ఆశించిన స్పందన రాలేదు. ఇప్పుడు ఆ భారాన్ని ఉద్యోగులపై నెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. టీచర్లందరూ ఒక్కొక్కరు ఐదుగుర్ని దత్తత తీసుకోవాలని డిఇఓ ల ద్వారా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మరొకవైపు ప్రతి సచివాలయ కార్యదర్శి తప్పనిసరిగా ఇద్దరిని దత్తత తీసుకోవాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. తాజాగా విజయనగరం జిల్లా సాలూరు మున్సిపాలిటీ విడుదల చేసిన మెమోను ఇందువెంట జత చేస్తున్నాము. కార్మికులకు, ఉద్యోగులకు జీతభత్యాలు ఇవ్వకుండా, వారి హక్కులను హరిస్తూ, వారిపై భారాలు మోపుతూ, లేబరు కోడ్స్‌ లాంటి దుర్మార్గ చట్టాలను రుద్దుతూ మరోవైపు వారిపై పి`4 భారాన్ని నెట్టటం అమానుషం. తక్షణం ఈ ప్రతిపాదన ఉపసంహరించుకోవాలని సిపిఎం డిమాండ్‌ చేస్తున్నది. కార్పొరేట్లు, పెద్ద పెద్ద కంపెనీలు ఎగ్గొట్టిన పన్నులు, బ్యాంకు రుణాలను ప్రభుత్వం పట్టుదలతో చట్టాన్ని ఉపయోగించి వసూలు చేస్తే 20 లక్షల మంది పేదలకు అవసరమైన అన్ని సౌకర్యాలు సులభంగా ఏర్పాటు చేయొచ్చు. దానికి బదులుగా వారికి రాష్ట్రాన్ని, రాష్ట్ర సంపదను ధారాదత్తం చేస్తూ వారి నుండి దయతో దానాలు స్వీకరించాలని ప్రభుత్వం భావించటం సముచితం కాదు. ఆచరణలో ఇది విఫలమైంది. కానీ ఇప్పటికైనా ప్రభుత్వం వాస్తవిక దృక్పథంలో ముందుకు వచ్చి పేదరిక నిర్మూలనకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, ఉపాధి కల్పన జీతాల పెంపుదల, భూ పంపిణీ వంటి చర్యల ద్వారా పేదరిక నిర్మూలన చర్యలు తీసుకోవాలని సిపిఎం డిమాండ్‌ చేస్తున్నది.

(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి