చారిత్రక ఆధారాలు లేని కాల్పనిక కథ హరిహర వీరమల్లుపై ప్రజలకు వాస్తవాలు చెప్పాలని కోరుతూ.

 

(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఉప ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
విజయవాడ,
తేది : 24 జూలై, 2025.
శ్రీయుత కొణిదెల పవన్‌కళ్యాణ్‌ గారికి,
గౌరవ ఉప ముఖ్యమంత్రి,
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం,
అమరావతి.

విషయం : చారిత్రక ఆధారాలు లేని కాల్పనిక కథ హరిహర వీరమల్లుపై ప్రజలకు వాస్తవాలు చెప్పాలని కోరుతూ...
అయ్యా!
మీరు ప్రముఖ పాత్రలో నటించి విడుదల చేసిన ‘‘హరిహర వీరమల్లు’’ చిత్రం చారిత్రక వాస్తవాలపై ఆధారపడి కాకుండా ఊహాజనితమైన కాల్పనిక కథతో తీశారు. కానీ మీ అభిమానులు, ప్రజలు దీన్ని ఒక చారిత్రక ఘట్టంగా భావిస్తున్నారు. అపోహలతో కూడిన ఈ ఊహజనిత చిత్రం ముస్లిం వ్యతిరేక విద్వేషాలు పెరగటానికి దారి తీస్తుంది. ఇది జాతీయ ఐక్యత, సమగ్రతలకు ఏమాత్రం తోడ్పడే విషయం కాదు. కావున ఈ చిత్రం కాల్పనిక కట్టు కథ ఆని మీరు ప్రజలకు స్పష్టం చేయాలని కోరుతున్నాను. బాధ్యతాయుతమైన రాజకీయ హోదాలో ఉన్న మీరు ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత మీపై ఉంది.
హరిహర వీరమల్లు పాత్రకు ఎలాంటి చారిత్రక ఆధారాలు లేవు. ఇది ఒక ఫాంటసీ సృష్టి మాత్రమే. దీనితో ముడిపడి ఉన్న మొఘల్‌ సామ్రాజ్యం, కోహినూర్‌ వజ్రం లాంటివి వాస్తవాలు. వాస్తవాలకు కట్టు కథలను జోడిరచడంవల్ల ప్రజలకు చరిత్రపై అపోహలు ఏర్పడతాయి.
కృష్ణానది పరివాహ ప్రాంతంలో లభించిన కోహినూర్‌ వజ్రం ఆనాడు (దాదాపు 700 సంవత్సరాల క్రితం) కాకతీయుల సామ్రాజ్యానికి చేరింది. ఆ తర్వాత ఢల్లీి సుల్తానులకు, వారి నుండి మొగల్‌ చక్రవర్తులకు, వారి నుండి నాదిర్‌షాకు, వారి నుండి ఆఫ్ఘనిస్తాన్‌ రాజులకు, వారి నుండి పంజాబ్‌ సిక్కు రాజుకు, అక్కడినుండి బ్రిటిష్‌ వారికి అది లభించింది. బ్రిటిష్‌వారు దానిని దొంగతనంగా లండన్‌ తరలించారు. ఇది చరిత్ర చెబుతున్న వాస్తవం. ఇంతవరకు అది తిరిగి భారతదేశానికి రాలేదు. బ్రిటిష్‌ వారి పాత్ర గురించి మీరు ఎలాంటి ప్రస్తావన చేయకపోవడం దురదృష్టకరం.
మొఘలుల కాలంలో సృష్టించిన సంపద వారి తదనంతరం కూడా ఇక్కడే ఉండిపోయింది. వారు భారతదేశంలో అంతర్భాగం అయిపోయారు. కానీ బ్రిటిష్‌ వాళ్ళ కాలంలో సృష్టించిన మన సంపద తరలిపోయింది. యావన్మంది ప్రజలు ఒక్క తాటి పైకి వచ్చి పోరాడి స్వాతంత్య్రం సాధించుకున్నాము. బ్రిటిష్‌ వాళ్ళు హిందూ ముస్లిం ఘర్షణలు సృష్టించి  దేశాన్ని విభజించి వెళ్ళి పోయారు. ఈ చారిత్రిక వాస్తవాన్ని కూడా మీరు గుర్తించడం అవసరం.
మీరు ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో అత్యంత పలుకుబడి కలిగిన స్థానంలో ఉన్నారు. గత 11 సంవత్సరాలుగా దేశభక్తి గురించి మాట్లాడుతున్న మోడీ ప్రభుత్వం కోహినూర్‌ వజ్రాన్ని తిరిగి భారతదేశానికి రప్పించడానికి ఎలాంటి ప్రయత్నం చేయలేదు. ఇప్పటికైనా మీరు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి లండన్‌లో ఉన్న కోహినూర్‌ వజ్రాన్ని భారతదేశానికి రప్పించగలిగితే ప్రజలు సంతోషిస్తారు. అది మన వారసత్వ సంపద. ఆ పని చేయకుండా కట్టు కథలతో ప్రజల్లో మత విద్వేషాలు రగిలిస్తే అది దేశానికి, ప్రజలకు నష్టమని గుర్తించాలని కోరుతున్నాను.
అభివందనములతో...
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి

--

COMMUNIST PARTY OF INDIA (MARXIST)
            Andhra Pradesh Committee

H.No. 27-30-9,

Akula vari Street,
Governorpet, 

Vijayawada - 520 002.
Phone: 0866-2577202;
Web: www.cpimap.org