కామ్రేడ్‌ వి.ఎస్‌.అచ్యుతానందన్‌ మృతికి సంతాపం

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 21 జూలై, 2025.

కామ్రేడ్‌ వి.ఎస్‌.అచ్యుతానందన్‌ మృతికి సంతాపం

కేరళ మాజీ ముఖ్యమంత్రి సిపిఐ(యం) పూర్వ పోలిట్‌బ్యూరో సభ్యులు కామ్రేడ్‌ వి.ఎస్‌.అచ్యుతానందన్‌ (101) ఈరోజు 3.20  నిమిషాలకు ఆనారోగ్యంతో తిరువనంతపురం ఆసుపత్రిలో మరణించడంపట్ల సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ తీవ్ర సంతాపాన్ని, వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నది. ఈ సందర్భంగా కార్యాలయాలపై పార్టీ జెండాను అవనతం చేయాలని పార్టీ కమిటీలకు తెలియజేస్తున్నది.

ఉమ్మడి కమ్యూనిస్టు ఉద్యమ నాయకుడిగా అనేక పోరాటాల్లో కీలకమైన వ్యక్తిగా వ్యవహరించారు. 17 సంవత్సరాలకే కమ్యూనిస్టు పార్టీలో సభ్యుడిగా చేరారు. కామ్రేడ్‌ కృష్ణ పిళ్లై నాయకత్వంలో భూస్వాములకు వ్యతిరేకంగా అనేక పోరాటాల్లో పాల్గొన్నారు. కార్మికులు, వ్యవసాయ కార్మికుల పోరాటాలకు ప్రత్యక్ష నాయకత్వం వహించారు. కేరళలో కమ్యూనిస్టు పార్టీని అభివృద్ధి చేయడంలో కీలకమైన పాత్ర నిర్వహించారు. 1956లో ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ సభ్యుడిగా ఎన్నుకోబడ్డారు. 1964 సిపిఐ(యం) ఏర్పాటులో 32 మందిలో వి.ఎస్‌.అచ్యుతానందన్‌ ఒకరు. 1980 నుండి 1991 వరకు కేరళ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. 1964లో కేంద్ర కమిటీలోకి, 1985లో పోలిట్‌బ్యూరో సభ్యుడిగా ఎన్నుకోబడ్డారు. 2022 వరకు కేంద్ర కమిటీలో కొనసాగారు. కేరళ అసెంబ్లీకి 7 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రెండు పర్యాయాలు ప్రతిపక్షనేతగానూ, 2006 నుండి 2011 వరకు ముఖ్యమంత్రిగానూ సేవలందించారు. ముఖ్యమంత్రిగా ఆయన పాలనలో ప్రజలకు సంక్షేమానికి అనేక చర్యలు చేపట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అఖిలభారత మహాసభల్లో పాల్గొన్నారు. వివిధ సందర్భాల్లో ప్రజాసంఘాల కార్యక్రమాలు, బహిరంగ సభల్లో పాల్గొన్నారు.

8 దశాబ్దాల కమ్యూనిస్టు ఉద్యమంలో వి.ఎస్‌.అచ్యుతానందన్‌ కేరళ ఉద్యమానికి కీలకమైన మనిషిగా ప్రత్యక్షంగా పాల్గొన్న నాయకుడిగా ఉన్నారు. ప్రజల్లో మంచి పేరున్న నాయకుడు. నిరాడంబర జీవి. సామాజిక న్యాయం పట్ల కట్టుబడినవాడు. కేరళ రాజకీయాల్లో మంచి గుర్తింపు పొందినవారు. ఆయన మృతి పార్టీ ఉద్యమానికి, ప్రజలకు తీరని నష్టం.

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి