జీవనసాయి ఆత్మహత్య కారకులను కఠినంగా శిక్షించాలి.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 17 జూలై, 2025.

 

జీవనసాయి ఆత్మహత్య కారకులను కఠినంగా శిక్షించాలి

నారాయణ విద్యాసంస్థల వేదింపులు తాళలేక ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి జీవన సాయి ఆత్మహత్యకు పాల్పడటంతీవ్ర దిగ్బ్రాంతిని కలిగించింది. ఈ ఘటనకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని, విద్యార్థి  కుటుంబానికి న్యాయం చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేస్తున్నది.

విద్యార్థి జీవన సాయికి పరీక్షల్లో సరైన మార్కులు రాలేదంటూ భవానిపురం నారాయణ విద్యాసంస్థల యాజమాన్యం మానసిక ఒత్తిడికి గురిచేసింది. దీనితో విద్యార్ధి మనస్తాపం చెంది తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కళాశాల యాజమాన్యమే తమ బిడ్డ చనిపోవడానికి కారణమని విద్యార్థి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నా నేటి వరకూ కారణమైన కళాశాల యాజమాన్యంపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయం. పైగా చర్యలు తీసుకోవాలని ప్రశ్నించిన విద్యార్థి సంఘాల నాయకులపై కేసులు బనాయించడం దుర్మార్గం.

ర్యాంకులు, మార్కుల పేరుతో విద్యార్ధులను వేధింపులు గురిచేయడంతో వందల సంఖ్యల కార్పోరేట్‌ విద్యాసంస్థల్లో విద్యార్ధులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వం వారి సమస్యలను ఎన్నడు పట్టించుకోకపోగా కార్పోరేట్‌ విద్యాసంస్థలకు వంతపాడుతున్నది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థి జీవన్‌ సాయి మరణానికి కారకులైన నారాయణ యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలి. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తగు చర్యలు చేపట్టాలని సిపిఐ(యం) డిమాండ్‌ చేస్తున్నది.

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి