ఈరోజు (14 జూలై, 2025) విలేకర్ల సమావేశం (విజయవాడలో) జరిగింది.
ఆ వివరాలను ప్రచురణార్థం/ ప్రసారర్థం పంపుతున్నాము. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి
ఓటర్ల నమోదు పేరుతో పౌరసత్వ గుర్తింపు
బిజెపికి అనుకూలంగా ఎన్నికల కమిషన్ వ్యవహారం
సుప్రీం కోర్టులో కేసు ఉండగానే రాష్ట్రాలకు లేఖలు
టారిఫ్ పేరుతో అమెరికా ప్రపంచ పెత్తనం
వ్యతిరేకిస్తేనే మనుగడ సాధ్యం
సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు
బీహార్లో ఓటర్ల నమోదు పేరుతో ఎన్నికల కమిషన్ దొడ్డిదారిన పౌరసత్వ నమోదు ప్రక్రియ చేపడుతూ కేంద్రంలో బిజెపికి అనుకూలంగా వ్యవరిస్తోందని, సుప్రీం కోర్టులో కేసు ఉండగానే ఇతర రాష్ట్రాలకు బీహార్ తరహా ఓటర్ల నమోదు ప్రక్రియ చేపట్టాలని లేఖలు పంపించిందని, ఇటువంటి చర్యలను వెంటనే ఆపేయాలని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు అన్నారు. సోమవారం విజయవాడ బాలోత్సవ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావుతో కలిసి ఆయన మాట్లాడారు. బీహార్లో తాము చేపట్టిన ఎస్‌ఐఆర్‌లో నేపాల్, బంగ్లాదేశ్, మయన్మార్ ప్రజలు ఉన్నట్లు తేలిందని, ఎన్నికల కమిషన్ ప్రకటించడం ఏమిటని ప్రశ్నించారు. ఓటర్ల నమోదు ప్రక్రియకు పరిమితం కాకుండా పౌరసత్వ గుర్తింపు చేపట్టినట్లు ప్రకటనలు చేయడం సరికాదని తెలిపారు. సుప్రీం కోర్టు కూడా అధార్, రేషన్ కార్డు, గత ఓటర్ల లిస్టును పరిశీలించి ఓటర్ల నమోదు ప్రక్రియ చేపట్టాలని సూచించిందని, దానికి అనుగుణంగా నమోదు ప్రక్రియ చేపట్టాలని తెలిపారు. పైగా 28వ తేదీ నాటి విచారణ ఏమవుతుందో తేలకముందే బీహార్ తరహా ఎస్‌ఐఆర్ చేపట్టాలని అన్ని రాష్ట్రాలకు ఎన్నికల కమిషన్ సూచించడం బిజెపి అనుకూల చర్య తప్ప మరొకటి కాదని అన్నారు. ఈ దేశంలో పౌరసత్వాన్ని గుర్తించేందుకు వేరే సంస్థలు ఉన్నాయని తెలిపారు. ఓటర్ల నమోదు పేరుతో ఎన్నికల కమిషన్ దొడ్డిదోవన పౌరసత్వ గుర్తింపు చేపట్టడం సరైన చర్య కాదని పేర్కొన్నారు. బీహార్లో అనుభవాన్ని సమీక్ష చేయకుండానే, సుప్రీం కోర్టు తీర్పు చెప్పకుండానే ఎన్నికల కమిషన్ హడావుడి చేస్తుందని, ఈ చర్య రాజ్యాంగ వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం లేకుండా చేసే విధంగా ఉందని పేర్కొన్నారు.
అమెరికాతో ఒప్పందం రైతాంగానికి నష్టం
మన దేశంపై ఒత్తిడి చేసి తనకు అనుగుణంగా మార్చుకునేందుకు అమెరికా ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. దీనిలో భాగంగానే సుంకాలకు సంబంధించి మరో దఫా చర్చలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. మన సరుకులపై అమెరికా పన్నులు గతంలో 5.6 శాతం ఉండేవని, ఇప్పుడు 26 శాతం విధిస్తామని ట్రంప్ చెబుతున్నారని, అయితే 25 లేదా 23 శాతానికి తగ్గించాలనే దిశగా చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోందని తెలిపారు. దీనివల్ల రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అయినా ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయడం లేదని పేర్కొన్నారు. జన్యు పరమైన మార్పులు చేసిన విత్తనాలను దేశంలోకి అనుమతించడం లేదని, గోధుమలు, మొక్కజొన్నలు, సోయాను జిఎం పంటలతో సహా దిగుమతి చేసుకోవాలని ఒత్తిడి చేస్తోందని తెలిపారు. అమెరికా ఒత్తిడికి కేంద్రం తలొగ్గినట్లు వార్తలు వస్తున్నాయని, అదే జరిగితే రైతాంగానికి మరణ శాసనం అవుతుందని పేర్కొన్నారు. డైరీ ఉత్పత్తులను దిగుమతి చేసుకునే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని, దీనివల్ల 8 కోట్ల మంది పాల ఉత్పత్తిదారులు దెబ్బతింటారని అన్నారు. స్టీలుపై 50 శాతం సుంకం విధిస్తామని ట్రంప్ చెబుతున్నా కేంద్రం నోరెత్తడం లేదని అన్నారు. అటోమొబైల్ ఎగుమతులపై ఇప్పుడు 5 శాతం ట్యాక్స్ అంటే దాన్ని పెంచుతామని చెబుతున్నారని, ఫార్మాకు ఆంక్షలు పెడుతున్నారని తెలిపారు. మల్టీ ప్రొడక్ట్ రిటైల్‌లోకి కార్పొరేట్ కంపెనీలు వచ్చేలా అమెరికాకు కేంద్రం తలొగ్గినట్లు వార్తలు వస్తున్నాయని, దీనివల్ల వ్యాపారులు తీవ్రంగా నష్టపోతారని పేర్కొన్నారు. బోయింగ్, హెలికాఫ్టర్లు, అణు రియాక్టర్లు కొనుగోలకు సంబంధించి రహస్య ఒప్పందాలు చేసుకున్నట్లు తెలుస్తోందన్నారు. డిజిటల్ డేటాను కూడా స్వేచ్చగా తీసుకెళ్లే ఒప్పందాల కోసం అమెరికా ప్రయత్నిస్తోందన్నారు. వీటిపై ప్రజల్లో పెద్దఎత్తున అనుమానాలు వ్యక్తమవుతుంటే కేంద్రం నోరెత్తడం లేదని విమర్శించారు. ఇటువంటి ప్రమాదకరమైన నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తెచ్చేదిశగా కార్యాచరణ చేపట్టాలని సిపిఎం నిర్ణయించిందని వివరించారు. యుద్ధాల పేరుతో ప్రపంచంపై పెత్తనం చేస్తున్న అమెరికా ఇప్పుడు టారిఫ్ పేరుతో పెత్తనం చేయాలని చూస్తోందని, దీన్ని ప్రతిఘటిస్తేనే దేశానికి మనుగడ ఉంటుందని అన్నారు.
పవన్ యోగనిద్రలో ఉన్నారు
రాజ్యాంగంలో అన్ని భాషలూ సమానమని బి.వి.రాఘవులు తెలిపారు. హిందీని అనుసంధాన భాషగా ప్రోత్సహించాలేగానీ బలవంతంగా రుద్దకూడదని పేర్కొన్నారు. పవన్ బిజెపికి లొంగిపోయి ఎలా చెప్పాలో అర్థంగాక భాషలను చిన్నమ్మ, పెద్దమ్మగా వర్ణించారని పేర్కొన్నారు. మాతృభాషలో చదువు లేకుండా ఏ దేశమూ ముందుకు పోలేదని తెలిపారు. చైనా, జర్మనీ, ఫ్రాన్స్ వంటి దేశాల్లోనే వారి మాతృభాషను అమలు చేస్తున్నారని వివరించారు. అన్ని భాషలూ పెట్టి ఏ ఒక్కభాష రాకుండా విజ్ఞానం నేర్చుకోలేని విధంగా రాష్ట్రం తయారవుతోందని తెలిపారు. ఎపిలో అన్ని భాషలూ వచ్చినట్లు ఉంటుందని, ఏదీ రావడం లేదని తెలిపారు. గతంలో పవన్ దక్షిణాదిపై హిందీ రుద్దితే ఖబడ్డార్ అన్నారని, ఇప్పుడు ఆయనే హిందీని రుద్దాలంటున్నారని అన్నారు.
ప్రభుత్వానికి రియల్ ఎస్టేట్ ప్రయోజనాలు
కరేడులో ఇండోసోల్‌కు భూమలు తీసుకోవడంపై రైతులు పార్టీలకు అతీతంగా వ్యతిరేకిస్తున్నారని, తెలుగుదేశం ఎమ్మెల్యే దాన్ని చీల్చేందుకు ప్రయత్నిస్తున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు తెలిపారు ప్రజాభిప్రాయాన్ని తుంగలో తొక్కి భూములు తీసుకుంటామంటే తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరించారు. పలువురు మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆయన స్పందించారు. ఏజెన్సీలో పంప్డ్ స్టోరేజీ విద్యుత్ పేరుతో గ్రామసభతో సంబంధం లేకుండా భూములు తీసుకుంటున్నారని అన్నారు. నిర్బంధంగా భూములు సేకరించడాన్ని సిపిఎం వ్యతిరేకిస్తోందని తెలిపారు. ఇప్పటికే అభివృద్ది పేరుతో 1.60 లక్షల ఎకరాలు తీసుకున్నారని, కృష్ణపట్నంలో 6000 ఎకరాలు, ప్రకాశంలో నిమ్జ్ కోసం తీసుకున్న 2500, దొనకొండలో 20 వేల ఎకరాలు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. కాకినాడ సెజ్‌లో పదివేల ఎకరాలు ఖాళీగా ఉందని, అక్కడ ఉన్న బిపిసిఎల్‌ను రామాయపట్నం తీసుకెళ్లి అక్కడున్న ఇండోసోల్‌ను కరేడులో పెడుతున్నారని తెలిపారు. భూములు తీసుకోవడమే లక్ష్యమా లేదా అభివృద్ధి చేస్తారా ప్రభుత్వం సమాధానం చెప్పాలని అన్నారు.
గాడి తప్పిన విద్యా వ్యవస్థ
రాష్ట్రంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, ఇప్పటి వరకూ డిగ్రీ అడ్మిషన్లు చేపట్టడం లేదని శ్రీనివాసరావు పేర్కొన్నారు. మంత్రి లోకేష్ విద్యావ్యస్థను గాడిలో పెట్టానంటున్నాడని, కానీ ప్రైవేటు కాలేజీలను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వ తీరు ఉందని అన్నారు. ఇప్పటికే మూడు లక్షల మంది విద్యార్థులు ప్రైవేటు విద్యా సంస్థలకు వెళ్లిపోయారని తెలిపారు. తక్షణం డిగ్రీ అడ్మిషన్లు చేపట్టాలని కోరారు. ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ కూడా గందరగోళంగా ఉందని, వెబ్‌సైట్లలో సీట్ల వివరాలు కూడా ఓపెన్ కావడం లేదని విమర్శించారు. గత ప్రభుత్వం విద్యారంగంలో 117 జిఓ తెచ్చి తొమ్మిది చీలికలు చేస్తే ఈ ప్రభుత్వం దాన్నే అమలు చేస్తోందని అన్నారు.
రాజధాని రైతుల్లో అంతర్గత ఆందోళన
రాజధాని భూసమీకరణ విషయంలో గతంలో భూములు ఇచ్చిన రైతులకు ఇంతవరకు ప్లాట్లు ఇవ్వలేదని, మరలా తెచ్చిపెడితే మా పరిస్థితి ఏమిటనే ఆందోళన రైతుల్లో ఉందని అన్నారు. కౌలు, పెన్షన్ల చెల్లింపు పెండిరగ్ ఉందని వివరించారు. గతంలో భూములిచ్చిన రైతులకే న్యాయం లేదు, మాకెలా జరుగుతుందనే భయం కొత్త సమీకరణ ప్రాంత రైతుల్లో తీవ్రంగా ఉందని అన్నారు. భూసమీకరణ పేరుతో రైతులను రకరకాల ప్రలోభాలకు గురిచేస్తున్నారని అన్నారు. తామే 30 ఏళ్లు అధికారంలో ఉంటామని చెబుతున్నారని, గతంలో జగన్ కూడా ఇదే మాట చెప్పారని అన్నారు. రాజధానిపై చట్టం చేస్తే కొంత ఆశలు ఉంటాయని, కానీ చేయడం లేదని పేర్కొన్నారు. రైతుల నుండి తీసుకున్న భూములను ప్రైవేటు కంపెనీలకు మార్కెట్‌రేటు ప్రకారం ఇవ్వాలని అన్నారు. మొత్తంగా రాజధాని రైతుల్లో అభద్రతాభావం ఉందని తెలిపారు.
పోలవరం నిర్వాసితుల గుండెల్లో రైళ్లు
గోదావరికి వరద వస్తోందంటే పోలవరం నిర్వాసితుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని పేర్కొన్నారు. ప్రాజెక్టుకు ఇప్పటి వరకూ మూడుసార్లు ధరలు పెంచిన ప్రభుత్వాలు పునరావాస పరిహార లెక్కలు మాత్రం మార్చడం లేదని అన్నారు. 2004లో నిర్ణయించిన కాంటూర్ లెక్కలనే ఇప్పటికీ కొనసాగిస్తున్నారని అన్నారు. ప్రాజెక్టు 41 మీటర్ల ఎత్తులో 36 వేల నిర్వాసిత కుటుంబాల్లో 12 వేలకు పునరావాసం చేశారని అన్నారు. డయాఫ్రం వాల్ దెబ్బతింటే రాష్ట్రం రీయింబర్స్ చేసిందని, పునరావాసులకు మాత్రం న్యాయం జరగడం లేదని పేర్కొన్నారు. ఎగువ కాఫర్ డ్యామ్ వద్ద 37 మీటర్ల నీరు వస్తే 120 గ్రామాలు మునిగిపోయాయని అన్నారు. ప్రాజెక్టు వద్ద 41 మీటర్ల ఎత్తుకు వరద వస్తే ఏజెన్సీ మొత్తం మునుగుతుందని వివరించారు. 45 మీటర్లు వస్తే భద్రాచలం కూడా మునుగుతుందని పేర్కొన్నారు. అక్కడుండే మునక ప్రాంతంలో ఖాళీ చేసే నాటికి 18 ఏళ్లు ఉండేవారికి పరిహారం ఇవ్వాలని అన్నారు. పోలవరంలో గతంలో సేకరించిన భూములను జనసేన ఎమ్మెల్యే తదితరులు లీజుకు ఇచ్చారని అన్నారు. నిర్వాసితుల పేరుతో అధికార పార్టీ నాయకుల భూ మాఫియా నడుస్తోందని వివరించారు.
--
COMMUNIST PARTY OF INDIA (MARXIST)
Andhra Pradesh Committee
H.No. 27-30-9,
Akula vari Street,
Governorpet,
Vijayawada - 520 002.
Phone: 0866-2577202;
Web: www.cpimap.org
