
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 11 జూలై, 2025.
విద్యార్థుల ‘‘స్థానికత’’ కొనసాగించాలి
ఉన్నత విద్యాశాఖ పరిధిలోని ప్రవేశ పరీక్షలకు స్థానికతను మార్పు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జి.వో. నెం. 20 తాత్కలికంగా నిలుపదల చేసి స్థానికతను కొనసాగించాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది. తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌లలో విద్య, ఉపాధికి సమాన అవకాశాలు కలిపించేందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 371(డి) ప్రకారం మూడు రీజియన్‌ల వ్యవస్థ వుండేది. 2014 రాష్ట్ర విభజన తర్వాత మరో పది సంవత్సరాలు ఇదే స్థితిని కొనసాగిస్తూ రాష్ట్రపతి ప్రత్యేక ఆర్డర్ ఇచ్చారు. దీని కాలపరిమితి గత సంవత్సరంతో ముగియడంతో తెలంగాణ రాష్ట్రం గత ఏడాది నుండే ఆంధ్ర విద్యార్థులను స్థానికేతరులుగా పరిగణిస్తూ జి.వో ఇచ్చి అమలు చేస్తుంది.
కానీ మన రాష్ట్ర ప్రభుత్వం ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకోకుండా ఈ సంవత్సరం మే 21న జివో ఇచ్చింది. ఆ జివో ప్రకారం ఇంజనీరింగ్, డిగ్రీల్లో చేరేదానికి ముందు వరుసగా నాలుగేళ్లలో ఒక సంవత్సరం ఇతర రాష్ట్రాల్లో చదివిన విద్యార్థులను స్థానికేతరులుగా పరిగణిస్తున్నది. దీనివల్ల విద్యార్థుల్లో, తల్లితండ్రుల్లో తీవ్ర గందరగోళం మరియు ఆందోళన ఏర్పడిరది.
అలాగే ఏపిలో స్థానికత నిరూపించుకోవాలంటే విద్యార్థుల తల్లిదండ్రులు 10 సంవత్సరాలు రాష్ట్రంలో నివాసం వున్నట్లు రెసిడెన్సియల్ సర్టిఫికెట్ వుండాలి. లేదా ఆ తల్లితండ్రులు ఏపిలో పది సంవత్సరాలు చదివినట్లు స్టడీసర్టిఫికేట్స్ ఉండాలనే నిబంధనలు సమస్యను మరింత జఠిలం చేసాయి.
స్థానికతను మార్చే విషయంపై తల్లిదండ్రుల్లో, విద్యార్థుల్లో ఎలాంటి అవగాహన కలిగించకుండా తీసుకున్న ఈ నిర్ణయాన్ని వాయిదా వేయాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది. ఈ విద్యా సంవత్సరం నష్టపోకుండా విద్యార్థులను ఆదుకోవాలని అందుకు అవసరమైన చర్యలను ప్రభుత్వం తక్షణమే చేపట్టాలని డిమాండ్ చేస్తున్నది.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి
