
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 09 జూలై, 2025.
లెనిన్ సెంటర్ విజయవాడ ప్రజల అభీష్టం
బిజెపి కుత్సిత బుద్దితో వివాదం చేయడాన్ని నగర ప్రజలు అంగీకరించరు
-సిపిఐ(యం)
బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మాధవ్ చేసిన వ్యాఖ్యలపై సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్. బాబురావు నేడు తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ విజయవాడలో లెనిన్ సెంటర్ ఎవరో నిర్ణయించిన పేరు కాదు, కాలక్రమంలో ప్రజలు నిర్ణయించుకున్న పేరని, దానిని రద్దు చేసే అధికారం ఎవరికి లేదని అన్నారు. బిజెపి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే (బుధవారం) వివాదం సృష్టించి ప్రజల మధ్య విద్వేషాలు రాజేయాలని మాధవ్ ప్రయత్నించడాన్ని బాబూరావు తీవ్రంగా ఖండిరచారు. లెనిన్ విగ్రహాన్ని విజయవాడ పౌర కమిటీ ఏర్పాటు చేసిన తరువాత ఆ కేంద్రాన్ని ప్రజలు లెనిన్ సెంటర్‌గా పిలుచుకోవడం ప్రారంభించారు. తరువాత అధికారికంగా రికార్డులకెక్కింది. లెనిన్ విదేశీయుడంటూ అరిగిపోయిన రికార్డునే మాధవ్ వేశారు. లెనిన్ అంతర్జాతీయ శ్రామికవర్గ నేత. శ్రమను గౌరవించేవారెవరైనా ఆయనను గౌరవిస్తారని అన్నారు.
ప్రముఖ కవి గౌరవనీయులు విశ్వనాథ సత్యనారాయణ గారి పేరుతో విజయవాడ, మాచవరంలో వీధికి నామకరణం చేయబడిరది. ఆయన గ్రంథాలు, భావాలపై ఎన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నా అందరూ గౌరవిస్తారు. విజయవాడలో అని బీసెంట్ పేరుతో బీసెంట్ రోడ్ దశాబ్దాల క్రితమే రూపుదిద్దుకున్నది, ప్రముఖ ప్రజాస్వామ్య వాది నెల్సన్ మండేలా పేరుతో పార్కు ఏర్పడిరది. విజయవాడ నగరంలో అనేకమంది ప్రముఖులను పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా గౌరవించుకునే సంప్రదాయం ఉందన్నారు.
పార్టీలతో సంబంధం లేకుండాభిన్న సంస్కృతులు, సంప్రదాయాలు, మహోన్నత వ్యక్తులను గౌరవించుకోవటం విజయవాడ సంప్రదాయంగా రూపుదిద్దుకున్నది. మాధవ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా వివాదాలను సృష్టించేకన్నా ప్రజల సంక్షేమానికి, అభివృద్ధికి తన హోదాను ప్రభుత్వంలో తన పలుకుబడిని ఉపయోగించడం మంచిది. ఇప్పటికైనా వివాదాలు కట్టి పెట్టి దశాబ్దాల నుండి ప్రజలు నామకరణం చేసుకున్న లెనిన్ సెంటర్‌ను గౌరవించాలని బాబూరావు కోరారు.
(జె.జయరాం)
ఆఫీసు కార్యదర్శి
