నేడు దేశవ్యాప్తంగా హింస, సామాజిక అణచివేత, ఆర్థిక దోపిడీ మతం పేరుతో జరుగుతున్నాయి. దేశం ఆర్థికంగా కుంగిపోవ డానికి, సమాజం నేరస్థంగా మారడానికి కారణం హిందూవాదమే. హిందూవాదం హింసావాదం, అణచివేతవాదం, అమానవవాదం. హిందూత్వ పేరిట నేడు బిజెపి, విశ్వహిందూ పరిషత్ మైనార్టీలు, దళితులపై జరుపుతున్న దాడులు మోడీ జీవన శైలిలో ఉన్న పయోముఖ విషకుంభత్వాన్ని బయట పెడుతున్నాయి. ఒకసారి మనం వెనక్కి వెళ్ళి చూస్తే 'హిందూత్వ' పేరిట బిజెపి పరివార్ ప్రభుత్వం మైనారిటీ ప్రజలపై అమలు జరిపిన 'మారణకాండ' రెండవ ప్రపంచ యుద్ధ కాలానికి ముందు నాజీ ఫాసిస్టు జర్మనీలో హిట్లర్ హంతక ముఠా లక్షలాది మంది యూదులపై అమలుజరిపిన జాత్యహంకార పూరితమైన మూకుమ్మడి హత్యాకాండతో సమానం. భారత జాతీయ జీవనంలో శతాబ్దాలుగా కలగలసిపోయి జీవిస్తున్న మైనార్టీలపై పరివార్ 'గోద్రా' (2002) రైలు దుర్ఘటనను ఆసరాగా చేసుకొని (ఈ దుర్ఘటనకు కారణం కూడా స్టేషన్‌లో ప్రయాణీకులకు 'టీ'లు సరఫరా చేసే మైనార్టీలకు చెందిన బాలికతో 'కరసేవకులు' అసభ్యంగా ప్రవర్తించి, బండిలోకి బలవంతంగా లాక్కెళ్ళడమేనని ఆనాడు ప్రతికలన్నీ రాశాయి) ఆ మరునాడు 2,000 మందికి పైగా మైనార్టీల ప్రజలను మూకుమ్మడి హత్యాకాండకూ, అరాచకానికీ గురిచేయడం లోకానికి తెలిసిన నగసత్యం. మొదటి నుంచీ ఆర్‌ఎస్‌ఎస్ రాజ్యాంగాన్ని ఉల్లంఘించటమే పనిగా పెట్టుకొంది. దేశ పౌరులందరినీ ఒక న్యాయం కిందకు, ధర్మం కిందకు తేవడానికి అంబేద్కర్ గొప్ప సాంఘిక, సాంస్కృతిక పోరాటం చేశారు. అంబేద్కర్ కుల నిర్మూలన, భారత రాజ్యాంగ నిర్మాణ ఎజెండాను తిప్పికొట్టడానికే ఆర్‌ఎస్‌ఎస్ నిరంతరం ప్రయత్నం చేస్తూ వచ్చింది. దేశం సుభిక్షంగా ఉండాలంటే దళితులను బలివ్వాలి అనే ఒక ఆంతరంగిక సూత్రం ఆర్‌ఎస్‌ఎస్‌కు ఉంది. దాన్ని మనసులో పెట్టుకుని ఇప్పుడు దళితులను బలిస్తున్నారు. 'అశ్వమేధ యాగంలో తప్ప గుఱ్ఱాన్ని వేరొక చోట బలివ్వకూడదు, గజమేధంలో తప్ప ఏనుగును ఇతరంగా బలివ్వకూడదు. కానీ దళిత బలి నిరంతరంగా జరగాలి. బలి లేనిదే దేవతలు తృప్తి పడరు' అని ఆర్‌ఎస్‌ఎస్ నమ్ముతుంది. అంబేద్కర్ ఈ విషయం మీద చాలా చర్చలు చేశారు. ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ కాళీ పురాణంలోని వివరణలిచ్చారు. మద్యపానం, మాంసాహారం మొదలుపెట్టిన (తర్వాత) బ్రాహ్మణులు జంతుబలిని ప్రోత్సహిస్తూ పురాణాలు రాయటానికి ఏ మాత్రమూ సంకోచపడలేదు. అందులో ఒక పురాణం గురించి ప్రత్యేక ప్రస్తావన ఇవ్వవలసి ఉంది. దాన్ని కాళీ పురాణం అంటారు. పక్షులు, తాబేళ్ళు, మొసళ్ళు, చేపలు, తొమ్మిది రకాల అడవి జంతువులు, దున్నపోతులు, ఎద్దులు, మేకపోతులు, అడవి పందులు, ఖడ్గమృగాలు, లేళ్లు, ఉడుములు, జింకలు, సింహాలు, పులులు, మనుషులు, నైవేద్యం సమర్పించే వాని శరీరం నుంచి తీసిన రక్తం, ఇవన్నీ చండికకూ, భైరవ దేవతలకూ తగిన నైవేద్యాలని అంటారు. బలుల ద్వారా రాజకుమారులు ఆనందాన్ని, స్వర్గాన్ని, శత్రువులపై విజయాన్ని పొందుతారు. నీలిరంగు కంఠం, ఎర్రని తల, తెల్లని ఈకలు, నల్లటి కాళ్లు ఉన్న పక్షిని 'బ్హరీనాశ' అంటారు. అది పక్షిరాజు, అదంటే నాకూ విష్ణువుకూ చాలా ఇష్టం. యజ్ఞం చేసే వ్యక్తి ఇలా అనాలి ''హ్రాం, హ్రీం, కాళీ, కాళీ, ఉగ్రదంష్ట్రాం!: భుజించు, నరుకు, దుష్టులను సంహరించు, ఈ గొడ్డలితో నరుకు, కట్టివెయ్యి, పట్టుకో, రక్తం తాగు, భద్రం, భద్రం, రక్ష, రక్ష, కాళీ నీకు నమస్కారం'' ఇలా ముగుస్తుంది, కాళరాత్రీయ మంత్రం. పై విధంగా బలికోసం ఎత్తిన ఆయుధాన్ని (గొడ్డలిని) కాళరాత్రీయ మంత్రంతో పూజించటం వల్ల బలి సమర్పించే వాని శత్రువులను సంహరించటం కోసం ఆ యుద్ధాన్ని కాళరాత్రి (చీకటి దేవత) అధిష్ఠిస్తుంది. కాళీపురాణం బోధించే ధర్మం ఇది. మనువు ఆదేశించిన ప్రకారం శతాబ్దాల అహింస తరువాత, తంత్రాలు పూర్తి జోరులో హింసను అనుమతించాయి. మానవ హింస, జంతు హింసతో సహా హింస అత్యంత భీకర రూపంలో ప్రజ్వరిల్లింది. కాళీ పురాణంలో రుధిరాధ్యాయంలో బోధించిన హింసా విధానాలు చాలా విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. జంతుబలి పునరుద్ధరణ తర్వాత కలకత్తాలోని కాళీ దేవాలయం వద్ద ఏం జరుగుతున్నదనేది ఇందుకు తిరుగులేని తార్కాణం. కాళీ పురాణం వివరించి ఉండకపోతే దేవతను తృప్తిపరచడానికి రోజూ వందలాది మేకలను బలి ఇచ్చే ఆ దేవాలయం పెద్ద కసాయి దుకాణం అయ్యేది. ఈనాడు కాళీ దేవతకు నరబలులు ఇవ్వటం లేదు. అయితే ఇదివరకు ఎప్పుడూ ఇవ్వలేదని అనుకోకూడదు. కాళీపురాణంలో చెప్పినట్టు జంతుబలి ఇచ్చినట్టుగానే నరబలి కూడా జరుగుతుండేదనే దానికి విస్తారమైన ఆధారాలున్నాయి. డాక్టర్ బిఆర్‌అంబేడ్కర్ కాళీపురాణాన్ని ఆచరించటం మీద తన రచనల్లో పెద్ద చర్చ పెట్టారు. అందుకే ఆర్‌ఎస్‌ఎస్ మొదటి నుంచీ ఆయన మీద దుష్ప్రచారాలు చేసింది. అంబేద్కర్ బౌద్ధాన్ని బోధించడానికి కూడా ఈ హింసకు హింస కాకుండా, హింస నుంచి సమూహంగా మనం భారతీయులు ఈ హింసావాదుల్ని ఎదిరించాలని అంబేద్కర్ చెప్పారు. అందుకే ఆయన మనుస్మృతి, కాళీపురాణాలకు ప్రత్యామ్నాయంగానే బౌద్ధాన్ని బోధించారు. మనుస్మృతికి ప్రత్యామ్నాయాలను భారత రాజ్యాంగంలో పొందుపరచారు. భారతదేశంలో కొరవడింది సౌహార్ధ్రత, సౌభ్రాతృత్వం. మానవ సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్న సమయంలో అంబేద్కర్ వీటి పునరుద్ధరణకు నడుంకట్టారు. రాజ్యాంగంలో పొందుపరిచిన మానవ సౌహ్రార్ధ్రతను ఆయన బౌద్ధం నుంచి తీసుకున్నారు. ఈ కృషి నుంచి ఆధునిక యుగ ప్రవక్తగా, దార్శనికుడిగా గుర్తింపబడుతున్నారు. ఇది ప్రబలమైతే ఆయన కీర్తి సందేశం బుద్ధుడిలాగే భారతదేశపు ఎల్లలు దాటి ప్రవహిస్తుంది. ఈ పరిస్థితుల్లో హిందూమతం కుంచించుకుపోతుంది. భారత ఉపఖండం నుంచి విడిపోయిన భాగాలన్నింటా హిందూమతం తరిమివేయబడింది. భారతదేశంలో బౌద్ధ పునరుజ్జీవనం అంబేద్కర్ మార్గంలో ప్రబలమౌతోంది. అస్పృశ్య కులాల్లో విద్య పెరిగే కొలదీ కొన్ని వేల సంవత్సరాల తమ వెనుకబాటుతనానికి హిందూ మతమే కారణమని, హిందూ ధార్మిక గ్రంథాలే వీటికి మూలమని తెలుసుకోవడం పెరగాల్సి ఉంది. ఈ విషయాన్ని బిసిలు, మైనార్టీలు కూడా గుర్తిస్తున్నారు. హిందూ రాజ్య వ్యవస్థ పునాదులు వ్రయ్యలవుతున్నాయి. ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే అంబేద్కర్ ప్రాభవాన్ని తగ్గించాలని బహుముఖాలుగా ఆయనను కించపరచడానికి ప్రయత్నం జరుగుతోంది. ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి వాళ్ళు కాళీపురాణంలోని 'బలి'ని, హింసావాదాన్ని నమ్ముతారు. ఒక పులిని, సింహాన్ని తప్ప అన్నింటినీ బలిచ్చారు. ముఖ్యంగా దళితులను, మైనార్టీలను వధించడం వారి నిత్యకృత్యంగా భావించారు. అస్పృశ్యులను నిందించడం ద్వారా వారు ఆనందం పొందుతున్నారు. నిజానికి బ్రాహ్మణులు బౌద్ధం తరువాత తమరూపం మార్చారు. ప్రజల నుంచి కానుకలు దండుకోవడానికి, ప్రజలకుండే సందపనంతా కానుకలు, దానాల రూపంలో తమకు ఇవ్వమని దానసూత్రాలు సృష్టించారు. ''కన్యా కనక దాసీచ శకటాశ్వగజా గృహమ్ - లాంగలం కాలపురుష: కాలచక్రం తథాక్షితి:|| - మేధశ్చ మహిషీచైవ శయ్యాచో భయతోముఖీ - తిలపర్వత విజ్ఞేయా మహాదానాన్ని షోడశ:'' కన్యాదానం, సువర్ణ దానం, దాసీ దానం, శకట దానం, అశ్వ దానం, గజ దానం, లాంగల (నాగలి) దానం, కాల పురుష (నల్లని మనిషి-శూద్రుడు) దానం, కాలచక్ర (కాలరూపమైన చక్రము) దానం, మేష (మేక) దానం, మహిష (దున్నపోతు) దానం, శయ్యా (పడక) దానం, గోదానం, భూదానం, తిలకపర్వత దానం, వస్త్ర దానం. ఇంకా సాలగ్రామ (రాయి) దానం, పట్టువస్త్ర దానం, ఆజ్య (నెయ్యి) దానం, తండుల (బియ్యం) దానం, ఛత్ర (గొడుగు) దానం, ఉపాసవాహ (దారమువడుకు పరికరము) దానం, దండ (కర్ర) దానం, చందన (గంథం) దానం, శివమూర్తిదానం, వ్యజన (విసనకర్ర) దానం. తరతరాలుగా బ్రాహ్మణులు యాచనకు అలవాటు పడ్డారు. నిజానికి మోడీ ఒబిసిలకు చెందినవాడు. జందెం నిరాకరించబడినవాడు. ఏ గర్భాలయంలోకీ అతడు వెళ్ళడానికి వీలు లేదు. కానీ హిందూ మతోన్మాదాన్ని భుజాన వేసుకొన్నారు. దీనివల్ల బ్రాహ్మణాధిపత్యాన్ని ఆయన మోస్తున్నారు. ఒకపక్క హిందూ మతోన్మాదంతో వ్యవహరిస్తూ, పాకిస్తాన్‌తో చెలిమి ఎలా చేయగలరు, కాశ్మీర్‌కు పరిష్కారం ఎలా సాధించగలరు? మోడీ దళితులను అణచివేసే క్రమంలో అన్ని విశ్వవిద్యాలయాల్లో పోస్ట్ డాక్టరేట్ స్కాలర్‌షిప్పులు వేల నుంచి వందలకు తగ్గించారు. బిసిలకు జనాభా నిష్పత్తిని బట్టి బడ్జెట్ ఇవ్వకుండా సంఫ్‌ు పరివార్ ఎజెండాను అమలుజరుపుతున్నారు. దీనివల్ల అంతర్జాతీయంగా ఆయన స్వభావం అర్థమవుతుంది. చైనా, టిబెట్, థాయిలాండ్, శ్రీలంక వంటి బౌద్ధ దేశాలతో సంబంధం ఉండాలంటే ఈ హిందూ మతోన్మాదం అడ్డుపడటం లేదా! బౌద్ధంలో ఉన్న ప్రేమ, మైత్రి భావాలు అంబేద్కర్‌ను ఎంతో ఉత్తేజపరిచాయి. ఏ మతంలోనైనా, సంస్థలోనైనా అంతర్గత నిర్మాణంలో ప్రేమభావం లోపిస్తే ఆ మతాలు, సంస్థలు నశించడం ప్రారంభిస్తాయి. ముఖ్యంగా హిందూమతంలో ఈ ప్రేమ భావం లోపించిన తరువాతే దాని పతనం ప్రారంభమయ్యింది. ఇటీవల సంస్థలలో ప్రేమ భావం లేక ఆ సంస్థలు నిర్జీవమవటం మనం చూస్తున్నాం. విశ్వహిందూ పరిషత్, ఆర్‌ఎస్‌ఎస్‌లు హింసను ప్రబోధిస్తున్నాయి. వాటిలో ప్రేమ లేదు. బౌద్ధ సూత్రాలు అనుసరించనంత కాలం భారతదేశంలో హింసే రాజ్యమౌతుంది. ఏ సంస్థా ప్రేమ లేకుండా నిలవదు. హిందూ పీఠాధిపతుల్లో ప్రేమకాక అహం కనబడుతుంది. సాటిమనిషిని గుండెలకు హత్తుకోవాల్సింది పోయి పాదాలకు నమస్కరించడం కంటే హేయమేముంది. అందుకే అంబేద్కర్ హిందూమతం నుంచి దళితుల్ని బయటికి రమ్మని పిలుపునిచ్చారు. అది మతోన్మాద ఊబి, రక్తస్రవంతుల దాడికి శాంతి, కరుణ, ప్రజ్ఞ కలిగిన బౌద్ధ మార్గం మానవత్వ వికసనానికి, ప్రపంచ దర్శనానికి మూలమౌతుందని ఆయన దళితులకే కాక మొత్తం భారతీయులకు ఎలుగెత్తి చాటారు. నేడు అధికారాల్లో ఉన్న, ధనాన్ని కలిగి ఉన్న దళితులు నయా బ్రాహ్మణవాదం గుప్పెట్లోకి పోవడం మనం చూస్తుంటే నాడు అంబేద్కర్ ప్రబోధించిన మార్గం నేడు ఎలా చారిత్రాత్మకం అవుతుందో అర్థం చేసుకోవలసి ఉంటుంది. నేడు హిందూ వాదం అంటే కులవాదమే. కులం యొక్క సారమే హిందూ మతంగా మిగిలిపోయింది. ఇవ్వాళ పురోహిత వర్గం పీఠాధి వర్గం కులాన్ని నిర్మూలించడానికి సిద్ధంగా లేరు. అది వారి సుఖజీవనానికి పీఠాలు నిర్మిస్తుంది. ఇవాళ మార్క్సిస్ట్‌లు, అంబేద్కరైట్లు తమ జీవన శైలిలో హిందూవాదాన్ని తిలకించాలి. ముఖ్యంగా బ్రాహ్మణులను పిలిచి పెళ్ళిళ్లు చేయించుకోవడం, కులం పెళ్ళిళ్లే చేసుకోవడం, అంతర్గతంగా కులాన్ని ప్రోత్సహించడం, ఇంట్లో పూజా మందిరాలు నిర్మించడం, ప్రతి కర్మకాండకూ బ్రాహ్మణులను ఆహ్వానించడం, దక్షిణలు ఇవ్వడం వీటన్నింటి వల్ల మనం అంబేద్కరిజం, మార్క్సిజం చెప్పినా ఆచరణలో ప్రతిఫలించకపోతే దానికి అర్థం లేదు. పైగా మోడీ వాదమే బలపడుతుంది. ఇవాళ నవ్యాంధ్రప్రదేశ్ రూ.3 వేల కోట్ల రెవెన్యూ లోటులో ఉండటానికి కారణం గోదావరి పుష్కరాలకు, కృష్ణా పుష్కరాలకు రెండు సంవత్సరాల్లో ఖర్చు పెట్టిన వ్యర్థమైన ధనమేనని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడే ఒప్పుకుంటున్నారు. భారతదేశం సంక్షోభంలో ఉండటానికి కారణం ఉత్పత్తిలో ప్రజలు భాగస్వామ్యం కాకుండా సోమరులుగా జీవించేవారి సంఖ్య పెరగడమే. ఇది హిందూవాదం వల్ల, కర్మవాదం వల్ల పుట్టించినవాడు చూడకపోతాడా, పుట్టించినవాడిదే బాధ్యత అనే నిరాశావాదం వల్ల భారతదేశం వెనకబడి ఉంది. కుల, మత వైషమ్యాలతో నిరంతరం అట్టుడికిపోతున్నది. అందుకే మార్క్స్, అంబేద్కర్‌లు చూపిన తాత్విక మార్గం నిజాయితీతో, నీతితో, వ్యక్తిత్వంతో, సౌభ్రాతృత్వంతో, సౌజన్యంతో, శ్రమతో బతికే సమాజ నిర్మాణం. ఆ మార్గంలో పయనిద్దాం. ఆచరణ ద్వారా భారతదేశాన్ని లౌకికవాద దేశంగా నిర్మిద్దాం.