పుష్కర ఏర్పాట్ల పరిశీలన..

కృష్ణా పుష్కరాల్లో పని చేస్తున్న దాదాపు 25 వేల మంది పారిశుధ్య కార్మికులకు ప్రతి రోజూ రూ.400 చొప్పున వేతనం అందేలా చర్యలు తీసుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు బుధవారం ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆయన పున్నమీ, భవానీ ఘాట్‌లలో పుష్కర ఏర్పాట్లు, కార్మికులకు అందజేస్తున్న వేతనాలు, పనుల వివరాలను కార్మికులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుష్కరాలకు ప్రతి రోజూ 35 లక్షలకు తగ్గకుండా యాత్రికులు వస్తారనీ, ప్రభుత్వం అంచనా వేసి అందుకు తగ్గట్టుగా నిధులు ఖర్చు చేసిందనీ చెప్పారు. కానీ అధికారిక లెక్కల ప్రకారం కేవలం 12.70 లక్షల మందే వస్తున్నారన్నారు. పుష్కరాల హడావుడితో ట్రాఫిక్‌ ఆంక్షలను అంచనాలను మించి పెట్టారని, వాస్తవంగా ట్రాఫిక్‌ ఆంక్షలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.