
భారత్, పాకిస్తాన్ మధ్య ఎన్‌ఎస్‌ఎ స్థాయి చర్చలు రద్దుకావడం దురదృష్ట కరమని సిపిఎం అఖిలభారత ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. రెండు దేశాల మధ్య సరిహద్దుల్లోని ఉద్రిక్తతలను నివారించాలంటే భారత్ చర్చల ప్రక్రియను కొనసాగించాలని ఆయన తెలిపారు. భారత్, పాక్ మధ్య యుద్దోన్మాదం పెరగడం ఇరువైపుల మత ఛాందసవాద శక్తులు బలోపేతానికి దారితీస్తుందని, ఇది రెండు దేశాల ప్రజల ప్రయోజనాలకు విఘాతమని, ముఖ్యంగా జమ్మూకాశ్మీర్‌పై తీవ్ర ప్రభావం పడుతుందని ఆయన చెప్పారు.'వేర్పాటువాదులతో పాకిస్తాన్ దౌత్యవేత్తలు చర్చలు జరిపారనే కారణంతో భారత్ ఎన్‌ఎస్‌ఎ స్థాయి చర్చలను రద్దు చేసింది. ఇదే కారణంతో గతంలో విదేశాంగ కార్యదర్శుల స్థాయి చర్చలనూ రద్దు చేసింది. కానీ పాకిస్తాన్ నేతలు వేర్పాటువాదులతో చర్చలు జరపడం ఇది కొత్తేమీ కాదు. దశాబ్దాలుగా కొనసాగుతున్న తంతు. ఒకవేళ ఇదే కారణంతో చర్చలను ప్రభుత్వం రద్దు చేయాలనుకుంటే రష్యాలో ఎన్‌ఎస్‌ఎ స్థాయి చర్చలకు బీజం పడిన 'ఉఫా' సమావేశంలోనే ఈ మేరకు షరతు విధించాల్సింది' అని ఆయన అన్నారు. పాకిస్తాన్‌తో చర్చలకు ప్రభుత్వం తగిన కసరత్తు జరపలేదని ఏచూరి విమర్శించారు.