
విద్యావ్యవస్థల్లో హిందుత్వ భావాలు జొప్పించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం తీవ్ర జోక్యం చేసుకుంటోందని ప్రఖ్యాత ఆర్థిక వేత్త అమర్థ్యసేన్ వాపోయారు. విద్యా సంబంధిత విషయాల్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసు కోవడం సర్వసాధా రణంగా మారిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. పెరుగుతున్న రాజకీయ జోక్యానికి ఇది పరాకాష్టని అన్నారు. గతంలో యూపిఎ ప్రభుత్వం కూడా జోక్యం చేసుకున్నప్పటికీ పరిధి దాటలేదని ఎన్‌డిఎ ప్రభుత్వం మాత్రం పదేపదే తలదూరుస్తూ బిజెపి విధానాల్ని విద్యావ్యవస్థలోకి చొప్పించేందుకు ప్రయత్నిస్తోందని చెప్పారు. తన తాజా పుస్తకం 'ది కంట్రీ ఆఫ్ ఫస్ట్ బార్సు'లో అమర్థ్యసేన్ ఈ అంశాలను పేర్కొన్నారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థలన్నింటిలోనూ హిందుత్వవాద భావాలను చొప్పించేందుకు ఏన్డీయే సర్కార్ విశ్వ ప్రయత్నం చేస్తోందని తెలిపారు. ఇందులో భాగంగానే దేశంలో ప్రఖ్యాత విద్యా, పరిశోధన సంస్థల్లో హిందుత్వ వ్యక్తులను నియమిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. భారత చారిత్రక పరిశోధన మండలి (ఐసిహెచ్ఆర్) ఛైర్మన్‌గా యల్లాప్రగడ సుదర్శనరావు నియమించారని, 'అయనకు చరిత్ర పరిశోధన కంటే హిందుత్వ భావాలు ఎలా జొప్పించాలో బాగా తెలుసని' అమర్థ్యసేన్ అన్నారు. అలాగే ఇటీవల భారత సాంస్కృతిక సంప్రదింపుల మండలి (ఐసిసిఆర్) కొత్త అధిపతిగా నియమితులైన లోకేష్ చంద్ర కూడా 'ప్రధాని మోడీ భగవంతుని అవతారం' అని చెబుతున్నారని ఆయన వాపోయారు. హిందుత్వ భావాలు జొప్పించేందుకు కేంద్ర సర్కార్ ప్రయత్నిస్తోందనడానికి వీరి నియామకాలే ఉదాహరణ వివరించారు. నలందా విశ్వవిద్యాలయంలో ఉపకులపతి నియామక విషయంలో ప్రభుత్వం తనను అవమానపరిచిందని అమర్త్యసేన్ ఆరోపించారు. తాను నామినేషన్ వేసిన రెండునెలల తర్వాత సింగపూర్‌కు చెందిన జార్జ్ యేని విసిగా నియమించిన విషయాన్ని గుర్తుచేశారు. బీజేపీ నాయకులతో తనకు అంతగా సాన్నిహిత్యం లేకపోవడమే దీనికి కారణమై ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. స్వతంత్రంగా వ్యవహరించే వెసులుబాటు కల్పిస్తే, జార్జ్యే కూడా పరిస్థితులను చక్కదిద్దగలరన్నారు. నలందా లాంటి విశ్వవిఖ్యాత విద్యాసంస్థల్లోనే ప్రభుత్వం రాజకీయాలు చేస్తుంటే సామాన్య విద్యాలయాల పరిస్థితి ఏమిటని అమర్త్యసేన్ ఆవేదన వ్యక్తం చేశారు.