
హౌరా జిల్లాలో గురువారం వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించేందుకు వెళ్లిన అసెంబ్లీ ప్రతిపక్ష నేత, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి డా.సూర్యకాంత మిశ్రాపై అధికార తృణమూల్ కాంగ్రెస్ గూండాలు పట్టపగలు దాడికి తెగబడ్డారు. రాజాపూర్ ప్రాంతంలో డా.మిశ్రా కారును అడ్డుకున్న తృణమూల్ గూండాలు ఆయన వాహనాన్ని ధ్వంసం చేశారు. ఆయన్ను అనుసరిస్తున్న సిపిఎం జిల్లా కార్యదర్శి విప్లవ్ మజుందార్, మీడియా ప్రతినిధులు వున్న వాహనాలను కూడా వారు ధ్వంసం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాలైన జగత్వల్లభ్పూర్, అమ్తా, ఉదరు నారాయణ్‌పూర్ తదితర ప్రాంతాలలో ప్రజలను పరామర్శించేందుకు మిశ్రా గురువారం అక్కడికి వెళ్లారు. వరద ప్రభావిత ప్రాంతాలలో కొన్ని గ్రామాలను సందర్శించి వస్తున్న సమయంలో డా.మిశ్రా బృందాన్ని తృణమూల్ గూండాలు రాజాపూర్ వద్ద అటకాయించారు. మిశ్రాను గ్రామాల్లోకి రానివ్వబోమంటూ నినాదాలు చేస్తూ ఆయన కార్లపై రాళ్లు రువ్వటంతో వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీనితో పాటు వాహనాలపై చేతి కర్రలతో దాడి చేసి అద్దాలను ధ్వంసం చేశారు. మధ్యాహ్నం 12.40 గంటలకు ప్రారంభమైన ఈ దాడి దాదాపు 40 నిముషాలు కొనసాగింది. దాడి నుండి తప్పుకునేందుకు వెనుదిర గాలంటూ పోలీసు అధికారులుచేసిన సూచనను డా.మిశ్రా తిరస్కరించారు. ఏది ఏమైనా తాను ముందుకే సాగుతానని ఆయన స్పష్టం చేయటంతో సీనియర్ పోలీసు అధికారులు అక్కడికి చేరుకుని తృణమూల్ గూండాలను బలవంతంగా అక్కడి నుండి పంపివేశారు. ప్రతిపక్ష నేతపై దాడిని నిరసిస్తూ సిపిఎం రాష్ట్ర కమిటీ, లెఫ్ట్ ఫ్రంట్ రాష్ట్ర వ్యాప్త నిరసన ప్రదర్శనలకు పిలుపునిచ్చాయి.