
రాష్ట్రంలో చేనేత పరిశ్రమ సంక్షోభంలో చిక్కుకుంది. దీన్ని రక్షించాలంటే కేరళలో గతంలో వామపక్ష ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెల్ఫేర్ బోర్డు తరహాలో ఇక్కడా ఏర్పాటు చేయాలి. రాష్ట్రంలో మూడు లక్షల మగ్గాలపైనా, వీటి ఉప వృత్తులపైనా ఆధారపడి సుమారు నాలుగు లక్షల మంది జీవిస్తున్నారు. చేనేత సహకార రంగంలో కార్మికులకు 5 శాతానికి మించి పని దొరకడం లేదు. మిగతా వారంతా ప్రైవేటు రంగంలోని మాస్టరు వీవర్ల వద్ద చేనేత పని చేస్తున్నారు. వీరికి కనీస వేతనం (మజూరీ) లభించడం లేదు. వస్తున్న ఆదాయంతో భుక్తి గడవక అప్పులు చేస్తూ ఆకలి చావులకు, ఆత్మహత్యలకు బలవుతున్నారు. తెలుగుదేశం అధికారానికి వచ్చిన ఈ సంవత్సర కాలంలోనే ఒక్క అనంతపురం జిల్లా ధర్మవరం ప్రాంతంలోనే 31 మంది మృతి చెందారు.
చేనేతకు కేటాయించిన (రిజర్వు చేసిన) 11 వస్త్ర రకాలను.. నిబంధనలను ఉల్లంఘించి పవర్‌లూమ్‌లపై తయారు చేస్తున్నారు. దీంతో మార్కెట్లో పవర్లూమ్ వస్త్రంతో చేనేత వస్త్రం పోటీ పడలేకపోతోంది. చేనేత సహకార రంగంలో తయారైన వస్త్రాలను మార్కెట్ చేయడానికి 1976లో 'ఆప్కో'ను ప్రారంభించారు. అవిర్భావం నుంచీ 'ఆప్కో' నాలుగు లక్షల చేనేత కుటుంబాలకు ఉపాధి చూపించింది. అలాంటి ఈ సంస్థకు ప్రభుత్వ చేయూత క్రమంగా తగ్గిపోయి నామమాత్రావ శిష్టంగా తయారైంది. చేనేత కార్మికుల వేతనాలు పెంచటానికి ప్రభుత్వం నిధులివ్వడం లేదు. మరోవైపు ప్రైవేటు రంగంలోని మాస్టరు వీవర్ల వద్ద తయారైన వస్త్రాల కొనుగోలుకు 'ఆప్టెక్స్'ను ఏర్పాటు చేసి నిధులు కేటాయించకుండా నిర్వీర్యం చేశారు. ఆ తరువాత 'ఆప్టెక్స్'ను ఏకంగా మూసేశారు. దీంతో మాస్టరు వీవర్లు వస్త్రోత్పత్తిని తగ్గించుకోవలసి వచ్చింది. ఫలితంగా చేనేత కార్మికులు పనులు కోల్పోయి ఈ రంగం నుంచి ఇతర రంగాలకు వలస పోవడం ప్రారంభించారు. ఈ పరిస్థితుల్లో తిరుమల తిరుపతి దేవస్థానం, వైద్య, రవాణా, పోలీసు వంటి 100 శాఖలకు అవసరమైన వస్త్రాల తయారీకి 'ఆప్కో'కు ఆర్డరు ఇస్తే ఏడాది పొడవునా చేనేత కార్మికులకు పని కల్పించవచ్చు. కానీ ప్రభుత్వం అందుకు తగిన చర్యలు తీసుకోలేదు. కొన్ని శాఖలు మాత్రమే వస్త్రాల తయారీకి ఆర్డరు ఇస్తున్నాయి. 50 శాతం అడ్వాన్సుగా డబ్బు చెల్లించి, వస్త్రాలు అందించిన తరువాత మిగతా 50 శాతం ఇవ్వాలి. కానీ అడ్వాన్సు చెల్లించక పోవటం, తయారైన తరువాత నిధులు ఇవ్వకపోవటం వల్ల 'ఆప్కో' అప్పులు చేయాల్సి రావటంతో అది పూర్తిగా నష్టాల బారిన పడింది. దీనికితోడు 'ఆప్కో' పాలకవర్గంపై అవినీతి ఆరోపణలు ఉండనే ఉన్నాయి.
రాజీవ్ విద్యా మిషన్ ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలకు చేనేత వస్త్రాలను ఉచితంగా ఇచ్చే స్కీమును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. రూ.400 కోట్ల విలువైన యూనిఫారం దుస్తులను తయారుచేసి అందించేందుకు 'ఆప్కో' ఆర్డరు తీసుకుంది. పూర్తిగా అందించగలిగే శక్తి 'ఆప్కో'కు లేదు. ఇంత భారీ స్థాయి ఆర్డరుకు తగిన వస్త్రాలను తయారు చేయించడానికి సహకార సంఘాల్లో మగ్గాలు లేవు. దీంతో ఆప్కో పవర్లూమ్ యజమానుల నుంచి వస్త్రాలు కొని తామే తయారు చేయించినట్లుగా స్కూలు పిల్లలకు అందిస్తున్నారు. చేనేత వస్త్రం ధర రూ.80 ఉంటే, పవర్లూమ్ వస్త్రం ధర రూ.35 మాత్రమే ఉంటుంది. రికార్డుల్లో మాత్రం చేనేత వస్త్రం కిందనే చూపి వాస్తవంగా పవర్లూమ్ వస్త్రాలను అందజేస్తారు.పై అంశాలను ఆధారం చేసుకుని చంద్రబాబు 2014 ఎన్నికల్లో చేనేత కార్మికుల సంక్షేమం కోసం సంవత్సరానికి రూ.10 వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.50 వేల కోట్లు ఖర్చుచేస్తామని చెప్పారు. ప్రతి బడ్జెట్లోనూ రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తానని, 3,276 మందికి కొత్తగా పింఛన్లు ఇస్తానని, 2,656 మందికి అంత్యోదయ అన్నయోజన కార్డులిచ్చి ఉచిత బియ్యం అందిస్తానని, సంవత్సరానికి 901 మందికి వర్కుషెడ్తో కూడిన ఇళ్ల నిర్మాణం చేపడతాననీ, చేనేత వృద్ధులకు ఉరవకొండ, ధర్మవరం, పెడన, మంగళగిరిల్లో వృద్ధాశ్రమాలు, ప్రత్యేక ఆస్పత్రులు ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. అధికారంలోకి వచ్చాక ఆ మాటలన్నీ నీటిమూటలయ్యాయి. 2013-14 బడ్జెట్లో రూ.99.87 కోట్లు, 2014-15 బడ్జెట్లో రూ.46 కోట్లు కేటాయించారు. దీనిలో 90 శాతం ఉద్యోగుల జీతభత్యాలకే సరిపోతుంది. రైతు రుణ మాఫీకి జీవో నెం.174 విడుదల చేశారు. కానీ చేనేత రుణాల మాఫీకి జీవో జారీ చేయలేదు. రాష్ట్రంలో మొత్తం రూ.202 కోట్ల చేనేత రుణాలున్నాయి. బ్యాంకర్లు రుణాలు తీసుకున్న చేనేత కార్మికులకు నోటీసులు పంపుతున్నారు. మంగళగిరిలో 91 మందికి, చీరాల ప్రాంతంలో 1,200 మందికి బ్యాంకర్లు నోటీసులు పంపారు. ఇప్పుడు ఏకంగా కోర్టు నుంచి దావా నోటీసులు పంపారు. తీసుకున్న అప్పుకు ఆస్తులు జప్తు చేస్తామని నోటీసులు పంపడంతో చేనేత కార్మికులు ఆందోళన చెందుతున్నారు.
తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తరువాత పవర్లూమ్ యజమానులు రంగప్రవేశం చేశారు. చేనేతకు కేటాయించిన 11 రకాలు వస్త్ర రిజర్వేషన్లనూ పవర్లూమ్ యజమానులు తయారు చేస్తూ చేనేత మార్కెట్‌ను కబళిస్తున్నారు. దీన్ని అరికట్టాల్సిన తెలుగుదేశం ప్రభుత్వం పవర్లూమ్ యజమానుల కొమ్ముకాస్తోంది. పట్టు చీరెల తయారీలోకి పవర్‌లూమ్‌లు రంగ ప్రవేశం చేయడంతో 70 వేల చేనేత మగ్గాలు మూలనబడ్డాయి. ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం ఢిిల్లీ ఎన్ఫోర్సుమెంటు వారిని పిలిపించి పవర్లూమ్ షెడ్లను చూపించింది. ఎన్ఫోర్సుమెంటు అధికారులపై మంత్రులు సైతం ఒత్తిడి తెచ్చి పవర్లూమ్ యజమానులపై ఎటువంటి చర్యలు లేకుండా చేశారు. దీన్నిబట్టి చంద్రబాబు ప్రభుత్వానికి చేనేతను రక్షించాలనే ఉద్దేశం లేదని తేలిపోతోంది.
ప్రత్యామ్నాయ విధానాలు
కేరళలో వామపక్ష ప్రభుత్వం గతంలో చేనేత రక్షణకు కొన్ని చర్యలు తీసుకున్నది. అక్కడ సహకార సంఘాలదే ప్రధానమైన పాత్ర. ప్రైవేటు రంగంలో మాస్టరు వీవర్లు నామమాత్రమే. 1951 నుంచి ఇప్పటివరకూ నష్టాలు వచ్చిగానీ, అవినీతి జరిగిగానీ ఒక్క సహకార సంఘమూ మూతబడలేదు. 1989లో 15 మందితో కేరళ హ్యాండ్లూమ్ వర్కర్సు వెల్ఫేర్ ఫండు బోర్డు ఏర్పాటు చేశారు. దీనిలో ఐదుగురు అధికారులు, ఐదుగురు యూనియన్ కార్మికులు సభ్యులుగా ఉంటారు. దీనికి ప్రభుత్వం రూ.65 కోట్లు కేటాయిస్తుంది. కమిటీ లేబర్ ఎన్ఫోర్సుమెంటు ఆధీనంలో పని చేస్తుంది. అయిదు కేంద్రాల్లో ప్రాంతీయ బోర్డులున్నాయి. వీటిలో 75 వేల మంది సభ్యులుగా ఉన్నారు. 58 ఏళ్లు నిండిన చేనేత కార్మికులకు నేరుగా వెల్ఫేర్ బోర్డు నుంచి పింఛను అందజేస్తున్నారు. వివాహం కోసం రూ.2 వేలు, ప్రసూతికి 6 నెలల ముందు, 6 నెలల తర్వాత నెలకు రూ.500 ఇస్తున్నారు. కంటి అద్దాలకు రూ.500, డెత్ బెనిఫిట్ రూ.5 వేలు ఇస్తున్నారు. 'ఇఎంయస్ హౌసింగ్ స్కీము' కింద రూ.3,17,000 మంజూరు చేస్తున్నారు. ఒకటి నుంచి 10వ తరగతి వరకూ యూనిఫారాలుగా చేనేత వస్త్రాలు ఉచితంగా ఇస్తున్నారు. ఇంటర్ చదివే విద్యార్థులకు నెలకు రూ.500, డిగ్రీ చదివే వారికి రూ.800 ఇస్తున్నారు. స్కూలు పిల్లలకు ఇచ్చే వస్త్రాలు మండల పరిధిలో ఉన్న స్కూళ్లకు ఆ మండల పరిధిలో ఉన్న సహకార సంఘాలే నేరుగా బట్టలు కుట్టి అందిస్తాయి.
ఆ సంఘాలకు ప్రభుత్వం నేరుగా డబ్బు చెల్లిస్తుంది. సహకార సంఘంలో పనిచేసే చేనేత కార్మికులకు ఇఎస్ఐ, ప్రావిడెంట్ ఫండ్ సౌకర్యం కల్పించారు. చేసిన పనికి డిఎ కూడా వర్తింపజేశారు. ఈ విధంగా కేరళలో ప్రత్యామ్నాయ విధానాల ద్వారా ప్రభుత్వం చేనేత కార్మికులను ఆదుకుంటోంది. సహకార సంఘంలో తయారయ్యే వస్త్రాలు ఈ రోజు రెడీమేడ్ షర్టుల రూపంలో పెద్ద షోరూమ్‌లకు సరఫరా చేస్తోంది కేరళ ప్రభుత్వం.
ఇటువంటి ప్రయత్నం చంద్రబాబు చేయకుండా చేనేతను ధ్వంసం చేసే కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తూ పవర్‌లూమ్‌ను ప్రోత్సహిస్తున్నారు. చేనేత ఉనికి లేకుండా చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు కనబడుతున్నది. ఇదే జరిగితే ఆంధ్రప్రదేశ్‌లో రానున్న కాలంలో మగ్గాన్ని ఎగ్జిబిషన్లో చూడాల్సి వస్తుంది. ఇప్పటికైనా తెలుగుదేశం ప్రభుత్వం కేరళ రాష్ట్రంలో మాదిరిగా వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి సహకార రంగాన్ని పటిష్టపరిచి చేనేత కార్మికులందరినీ సహకార రంగంలోకి తీసుకువచ్చి రక్షించాలని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతోంది.
- పిల్లలమర్రి బాలకృష్ణ
(వ్యాసకర్త ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి)