
(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
విజయవాడ,
తేది : 05 జూలై, 2025.
శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,
గౌరవ ముఖ్యమంత్రి,
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,
అమరావతి.
విషయం: విదేశాల్లో వైద్య విద్య పూర్తి చేసుకున్న మన రాష్ట్ర వైద్య విద్యార్థులకు పర్మినెంట్ రిజిస్ట్రేషన్ (పి.ఆర్) ఇవ్వాలని కోరుతూ...
అయ్యా!
విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించి పూర్తిచేసుకుని మన దేశం వచ్చిన వైద్య విద్యార్థులు వారి పర్మినెంట్ రిజిస్ట్రేషన్ కోసం గత కొంతకాలంగా ఆందోళన చేస్తున్న విషయం మీ దృష్టికి తీసుకు వస్తున్నాను.
విదేశాల్లో ఎంబిబిఎస్ యూజీ డిగ్రీ పూర్తి చేసుకున్న వైద్య విద్యార్థులు పీజీ చేయాలన్నా లేదా వైద్య వృత్తిలో స్థిరపడాలన్నా నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసి) నిబంధనల ప్రకారం పర్మినెంట్ రిజిస్ట్రేషన్ అవసరం. అందులో భాగంగా విదేశాల్లో చదువు పూర్తి చేసుకొని ఇక్కడికి వచ్చిన విద్యార్థులకు మనం మెడికల్ కౌన్సిల్ స్క్రీనింగ్ టెస్ట్ పెట్టి అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి ఇక్కడ హాస్పిటల్‌లో ఏడాది పాటు ఇంటర్న్‌షిప్ చేయించి అనంతరం వారికి పర్మినెంట్ రిజిస్ట్రేషన్ ఇస్తారు. కానీ ఈ ప్రక్రియ ఎపి మెడికల్ కౌన్సిల్ పొరపాటు వైఖరి కారణంగా ఈ సంవత్సరం దారి తప్పింది. వైద్య విద్యార్థులను సంక్షోభంలోకి నెట్టింది. దానివలన రాష్ట్రంలో సుమారు 1500 మందికి పైగా జూనియర్ డాక్టర్లు విదేశాల్లో వైద్య విద్య పూర్తి చేసుకొని ఎన్‌ఎంసి పెట్టిన స్క్రీనింగ్ టెస్ట్ పాసై ఏడాది పాటు ఇంటర్న్‌షిప్ పూర్తి చేసుకొని గత 13 నెలలుగా మెడికల్ కౌన్సిల్ చుట్టూ తిరుగుతున్నారు. అధికారులు పర్మినెంట్ రిజిస్ట్రేషన్ ఇవ్వకుండా మరో సంవత్సరం లేదా రెండు సంవత్సరాలు పొడిగించారు. ఈ పొడిగింపులో ఏ పద్దతి పాటించినట్లు కనిపించడం లేదు. వారి ఆదేశాలు హేతు విరుద్దంగా ఉన్నాయి. దీనితో విద్యార్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.
శాంతియుతంగా తమ న్యాయమైన సమస్య పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్న వారిపై పోలీసులు బలప్రయోగం చేసి హడలెత్తించారు. ఆడపిల్లలని కూడా చూడకుండా చావబాదారు. ప్రజలకు సేవ చేయాల్సిన డాక్టర్లు ఈరోజు రోడ్లపై నిరసనలు చేయాల్సి రావడం బాధాకరం.
కావున మీరు ఈ విషయంలో వ్యక్తిగత శ్రద్ద తీసుకొని వైద్య శాఖ అధికారులతో మరియు ఎపి మెడికల్ కౌన్సిల్ అధికారులతో మాట్లాడి విద్యార్థుల సమస్యను తక్షణమే పరిష్కారం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
అభివందనములతో...
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి