నిషిద్ద మరియు ఫ్రీ హోల్డ్‌ భూముల పై అఖిల పక్ష సమావేశం జరపాలి.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 05 జూలై, 2025.

నిషిద్ద మరియు ఫ్రీ హోల్డ్‌ భూముల పై నిన్న (జూలై 4) ముఖ్యమంత్రి రెవెన్యూ శాఖా మంత్రి, అధికారులతో చేసిన సమీక్ష సందర్భంగా ఫ్రీహోల్డ్‌ భూములపై ఇచ్చిన ఆదేశాలు టిడిపి ఎన్నికల హామీలకు భిన్నంగా పేదలకు అన్యాయం జరిగే విధంగా ఉన్నాయి. పేదల భూములను పెత్తందార్లకు, కార్పొరేట్లకు కట్టబెట్టే విధంగా చర్యలు ఉన్నాయి. తక్షణమే అఖిల పక్ష సమావేశం జరిపి భూ సమస్యపై సమగ్ర విధానం రూపొందించాలని సిపిఐ(యం) డిమాండ్‌ చేస్తున్నది. 

నిషిద్ద జాబితా నుంచి తప్పించిన ఫ్రీహోల్డ్‌ భూముల విషయంలో అక్టోబర్‌ 2 నాటికి సమగ్రమైన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తామని అధికారులు ప్రకటించారు. ఈ లోగా అన్ని రాజకీయ పార్టీలు, భూసమస్యలపై అవగాహన ఉన్న వ్యక్తులు, వ్యవసాయ కార్మిక సంఘాలతో భూ కమిటీలను నియమించి సమగ్రంగా చర్చించి నిజమైన పేదలకు, సన్నా,చిన్నకారు రైతులకు న్యాయం చేకూర్చేలా ముందుకెళ్ళాలని సిపిఐ(యం) కోరుతున్నది.

1970 నుంచి ఉమ్మడి రాష్ట్రంలో విభజిత ఆంధ్రప్రదేశ్‌కి చెందిన జిల్లాల్లో సుమారు 32 లక్షల ఎకరాల మిగులు భూములను పేదలకు పంచినట్లు ప్రభుత్వాలు తెలియజేశాయి. ఇందులో సుమారు 15 లక్షల ఎకరాలు అన్యాక్రాంతమై పెద్దల చేతుల్లో ఉన్నట్లు గత ప్రభుత్వం ప్రకటించింది. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అనర్హుల అక్రమంగా ఆధీనంలో ఉన్న అసైన్డ్‌ భూములను స్వాధీనం చేసుకొని నిజమైన లబ్ధిదారులకు ఇస్తామని ప్రకటించారు. ఇందుకోసం 40 రోజులు పాటు రెవెన్యూ సదస్సులు జరిపి భూములను గుర్తించి గ్రామ సభల్లో బహిర్గతం చేస్తామని ఈ ప్రభుత్వం అధికారికంగా మెమో విడుదల చేసింది. రెవెన్యూ సదస్సులు జరిగినప్పటికీ ఇప్పటి వరకు ఆ జాబితాను బహిరంగ పరచలేదు. అనర్హుల నుండి ఒక ఎకరం బయటికి తీసి భూములు కోల్పోయిన పేదలకు ఇవ్వలేదు. కాబట్టి తక్షణమే అన్యాక్రాంతమైన అసైన్డ్‌ భూములను నిజమైన అర్హులకు ఇవ్వాలని సిపిఐ(యం) కోరుతున్నది. 5ఎకరాల్లోపు మెట్ట లేదా 2.5 ఎకరాల్లోపు మాగాణీ భూములు కల్గిన పేదల మధ్య లావాదేవీలు జరిగితే కొనుగోలు చేసిన ఆ పేదలకే క్రమబద్ధీకరించాలని, ఆ పైన కొన్నవారి భూములను చట్టవిరుద్దంగా ప్రకటించి తిరిగి పేదలకు స్వాధీనం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నది.

లక్షలాది మంది సన్నా, చిన్నకారు రైతుల జిరాయితీ భూములు 22ఎ జాబితాలో ఉండడం వల్ల ఎటువంటి అమ్మకాలు, కొనుగోలు హక్కులు లేక, ప్రభుత్వ సబ్సిడీలు లేక అనేక అవస్థలు పడుతున్నారు. ఈ భూములను తక్షణమే విముక్తి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.  కాని నేటికి ఆచరణ రూపం దాల్చలేదు. అన్ని రకాల రికార్డులు, హక్కులు కలిగి ఉన్న రైతుల భూముల నుండి చుక్కల జాబితా నుండి తొలగించి పూర్తి హక్కులు కల్పించాలని కోరుతున్నాము.

నాలా రద్దును ఉపసంహరించాలి

నాన్‌ అగ్రికల్చరల్‌ ల్యాండ్‌ అసెస్‌మెంట్‌ యాక్ట్‌ వ్యవసాయ యోగ్యమైన భూమిని వ్యవసాయేతర వాటికి మళ్ళించాలంటే నాలా చట్టం అడ్డు వస్తుంది కాబట్టి కార్పొరేట్లకు, పెట్టుబడిదారులకు వ్యవసాయ భూములను అడ్డంగా దోచి పెట్టడానికే నాలా ను రద్దు చేయాలని మంత్రి వర్గ ఉపసంఘం నిర్ణయించింది. ఈ ఆలోచనను వెంటనే విరమించుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాము. అదే విధంగా అర్హులైన జర్నలిస్టులకు ఉచితంగా ఇళ్ళస్థలాలు ఇవ్వాలని కోరుచున్నాము.

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి