
(ఈరోజు (24 జూన్, 2025) విలేకర్ల సమావేశం (విజయవాడలో) జరిగింది. ఆ వివరాలను ప్రచురణార్థం/ ప్రసారర్థం పంపుతున్నాము. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)
తలకిందులుగా ఏడాది పాలన
సుస్ధిర అభివృద్ధి ఎక్కడ?
సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు
డబుల్ ఇంజన్ సర్కారు కాదు డబుల్ భారాల సర్కారు
హామీలు అమలుకానందున ప్రజల్లో తీవ్ర అసంతృప్తి
కనీస వేతనాలు, గిట్టుబాటు ధరలు లేక మార్కెట్లు వెలవెల
ప్రజలపై భారాలు, కార్పొరేట్లకు వరాలు ఇస్తూ ఏడాది కూటమి పాలన తలకిందులుగా నడుస్తోందని సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విమర్శించారు. సూపర్ సిక్స్ సహా హామీల వైఫల్యం, ప్రజలపై విద్యుత్, పన్నుల భారాలు, గిట్టుబాటు ధరలు, కనీస వేతనాలు అమలు చేయకపోవడవంతో ప్రజలు అసంతృప్తి పెరుగుతుందని చెప్పారు. మంగళవారం విజయవాడ బాలోత్సవ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కూటమి ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా చంద్రబాబు ప్రజెంటేషన్‌పై ఆయన మాట్లాడారు. ప్రధాని మోడీ గత మూడు మాసాల్లో మూడు సార్లు రాష్ట్రాన్ని సందర్శించారని ఏ ఒక్క సభల్లో కూడా రాష్ట్ర ప్రజలు గుర్తుంచుకునేలా ఒక్క మాట కూడా చెప్పలేదని ఎత్తి చూపారు. ఈ సభల్లో ఒకరినొకరు పోటీలుపడి పొగుడుకోడానికే సరిపోయిందన్నారు. ప్రచార ఆర్బాటం తప్ప డబుల్ ఇంజన్ సర్కారు సాధించిందేమీ లేదని అన్నారు. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి ప్రజలను ఒప్పించాల్సింది పోయి వారిని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. టిడిపి మహానాడులో కార్యకర్తలే ముఖ్యమన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సుపరిపాలనపై జరిగిన సమావేశంలో అధికారులే ముఖ్యమంటూ ప్రకటించారని, ఇలాంటి గందరగోళ ప్రకటనలతో ప్రజలను భ్రమింపజేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. తొలి అడుగు 4.1 అని ప్రచారం చేస్తున్నారని, ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడికి ఇది 15వ సంవత్సరమని, 2014 తరువాత సమర్థత, అనుభవం ఉన్న చంద్రబాబులో కాలానుగుణ మార్పు ఆగిపోయిందని తెలిపారు. 2015లో ఐక్యరాజ్యసమితి రూపొందించిన సుస్థిరాభివృద్ధి సూచికలను (ఎస్‌డిజి) ఆయన పరిగణలోకి తీసుకోకుండా జిడిపి అంటూ పాత పాటే పాడుతున్నారన్నారు. భారాలు వేయడంలో గత ప్రభుత్వానికి, దీనికి తేడా లేదన్నారు.
ఎస్‌డిజి లక్ష్యాల సాధనలో వైఫల్యం
అభివృద్ధి అంటే జిడిపిలు కాదని, ఎస్‌డిజి(సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు)లని ఐక్యరాజ్యసమితి 17 అంశాలను ప్రస్తావించిందని సుదూరంలో ఉన్నామని పేర్కొన్నారు. అభివృద్ధికి సుస్థిర అభివృద్ధికి చాలా తేడా ఉందని వివరించారు. ఎస్‌డిజిలో దేశం 109వ స్థానంలో ఉండగా రాష్ట్రం 10వ స్థానంలో ఉందన్నారు. అలాగే డీప్‌టెక్, క్వాంటమ్‌వ్యాలీ, ఎఐ అంటున్నారని, ఈ విషయంలోనూ చైనా, అమెరికాతోపాటు ప్రపంచంలో చాలా దేశాలను అందుకోలేనంత దూరంలో ఉన్నామని పేర్కొన్నారు. గత 11 సంవత్సరాల్లో ప్రపంచంలో ఇండియా బ్రాండ్ ఉన్న ఒక్క ఉత్పత్తి లేదన్నారు. ఎంఓయుల ద్వారా రాష్ట్రానికి రూ.9.40 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెబుతున్నా వాటి వల్ల వచ్చిన పరిశ్రమలు ఏమిటి, ఉపాధి ఏమిటో ప్రజలకు చెప్పాలన్నారు. పైగా స్టీలు ప్లాంటులో ఐదువేలమందిని తొలగించారని, సచివాలయ సిబ్బందిని కుదించారని, విద్యావ్యస్థను దెబ్బతీస్తున్నారని, ఉపాధ్యాయ ఖాళీ పోస్టులను 40 వేల నుండి 16 వేలకు కుదించారని పేర్కొన్నారు. ప్రభుత్వ రంగంలో ఉన్న మెడికల్ కళాశాలను ప్రైవేటుపరం చేస్తున్నారని విమర్శించారు.
కార్పొరేట్లకు ప్రేమ ఉంటే కార్మికుల వేతనాలు పెంచాలి
పి4 పేరుతో కార్పొరేట్లు పేదలను ఆదుకుంటారని చెబుతున్నారని, నిజంగా వారికి అంత ప్రేమ ఉంటే వారి కంపెనీలు, పరిశ్రమల్లో కార్మికుల వేతనాలు పెంచేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సూచించారు. దీనివల్ల ప్రభుత్వంపై ఒక్కపైసా భారం పడదన్నారు. ఇప్పటికీ అసంఘటిత రంగంలో ఉన్న 50 లక్షలు కార్మికుల వేతనాల్లో 3 సంవత్సరాలుగా పెరుగుదల లేదని అన్నారు. పొగాకు, మిర్చి, పత్తి, చెరకు, పాల ధరల్లో పెరుగుదల లేక రైతులు అల్లాడుతున్నారని, అదే సమయంలో మార్కెట్లో వాటి ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయని విమర్శించారు. షేర్ మార్కెట్లో ఐటిసి ధరలు పెరుగుతున్నా పొగాకుకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా దోచుకుంటున్నారని అన్నారు. ప్రభుత్వం వారిని నియంత్రించకపోతోందని విమర్శించారు. ప్రభుత్వం కీలకమైన విశాఖ స్టీలు ప్లాంటు ప్రస్తావన చేయడం లేదని, రూ.11,440 కోట్లు ఇచ్చినా ఎక్కువభాగం తిరిగి వెనక్కి తీసుకుందని అందులో ప్లాంటు అభివృద్దికి మిగిలిందేమీ లేదని అన్నారు. తల్లికి వందనంపై సిపిఎం కార్యకర్తలు సర్వే నిర్వహించగా కొంతమందికి రూ.9000, 10,000 చొప్పున పడ్డాయని అన్నారు. ముగ్గురు పిల్లలు ఉంటే ఇద్దరికి, కొన్నిచోట్ల ఒక పిల్లవాడు ఉన్న కుటుంబానికి నలుగురికి తల్లికి వందనం డబ్బులు పడ్డాయని, స్కీమ్, కాంట్రాక్టు వర్కర్స్ సహా అనేకమందికి అర్హత ఉన్నా నిబంధనల పేరుతో అసలు వేయలేదని గుడ్ గవర్నెన్స్ అంటే ఇదేనా అని ప్రశ్నించారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ లేదని, కార్పొరేట్ స్కూళ్లలో విద్యాహక్కు చట్టం ప్రకారం 25 శాతం మంది విద్యార్థులకు ఉచిత విద్య బోధించాల్సి ఉన్నా నారాయణ, శ్రీచైతన్య వంటి బడా కార్పొరేట్ సంస్థలు అమలు చేయడం లేదని పేర్కొన్నారు.
స్మార్ట్ మీటర్ల కేసు ఏం చేస్తున్నారు ?
స్మార్ట్ మీటర్లతో సామాన్యులకు లక్షల్లో బిల్లులు వస్తున్నాయని, ప్రతిపక్షంలో ఉండగా పగలకొట్టాలని చెప్పడంతోపాటు ప్రస్తుత మంత్రి పయ్యావుల కేశవ్, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి స్మార్ట్‌మీటర్లకు వ్యతిరేకంగా కోర్టులో కేసులు వేశారని తెలిపారు. కేసు కొనసాగిస్తారా, వెనక్కు తీసుకుంటారా ప్రభుత్వ వైఖరి ఏమిటో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. మంగళగిరిలో కొన్నిచోట్ల తప్ప ప్రభుత్వ స్థలాల్లో ఉన్నవారికి రాష్ట్రంలో ఎక్కడా పట్టాలు ఇవ్వడం లేదని, ఉన్న ఇళ్లను కూలగొడుతున్నారని విమర్శించారు.
వాగ్దానాల అమలుకు షెడ్యూలు ప్రకటించాలి
ఏడాది అవుతున్నా అన్నదాత సుఖీభవ, నిరుద్యోగ భృతి, స్త్రీశక్తి నిధి ఇవ్వలేదని, ఉచిత బస్సు ఆగస్టని చెబుతున్నారని, ఏడాది తరువాతైనా కూటమి పాలకులు ఇచ్చిన వాగ్దానాల అమలుకు షెడ్యూలు ప్రకటించాలని డిమాండు చేశారు. ముఖ్యంగా ప్రజలు, మహిళలు, యువతకు భద్రత కల్పించడంలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని యువతులపై అత్యాచారాలు, దళితులపై దాడులు పెరిగాయని విమర్శించారు. సంక్షేమ పథకాల అమలు సరిగా లేకపోవడం, భారాలు పెరుగుతుండటంతో ప్రజల్లో అసంతృప్తి ఉందని అన్నారు. చేనేత కార్మికుల కు ఇస్తానన్న 200 ఉచిత విద్యుత్ అమలుకు నోచలేదని పేర్కొన్నారు. ప్రచారంతో గాల్లో ఎగరొద్దని, టిడిపి కార్యకర్తలను అడిగయినా పాలనా తీరును తెలుసుకోవాలని సూచించారు. ఉపాధి, విద్య, వైద్యం, వ్యవసాయం అభివృద్ధి చేయడం, పేదలకు భూములు పంచితే అభివృద్ధి జరుగుతుందని, కార్పొరేట్లకు భూములు కట్టబెట్టడం వల్ల కాదని అన్నారు.
తాటతీసి, నారతీస్తే శాంతి భద్రతలకు విఘాతం
సుపరిపాలన సభలో పవన్‌కళ్యాణ్ వాడిన భాష శాంతి భద్రతలకు విఘాతం కలిగించేదిగా ఉందని, మార్చుకోకపోతే అరాచకం, అశాంతి పెరిగిపోతుందని శ్రీనివాసరావు సూచించారు. ఇటీవల వైసిపి అధ్యక్షులు జగన్‌మోహన్‌రెడ్డి కార్యక్రమంలో రప్పారప్పా నరుకుతాం అనే బోర్డులు పెట్టారని, వాటిపై పెద్దఎత్తున విమర్శలు చేసిన అధికారపక్ష నాయకులు రాజకీయాల్లో సినిమా డైలాగుల వల్ల ఉన్మాదం వస్తుందని చెప్పారని గుర్తు చేశారు. సుపరిపాలన సభలో పవన్‌కల్యాణ్ తాటతీస్తాం, తొక్కి నారతీస్తాం అనే సినిమా డైలాగులు చెబుతున్నారని ఇదేనా శాంతి భద్రతలు కాపాడే తీరని అడిగారు. రాష్ట్రాన్ని అభివృద్థి పథంలో తీసుకెళ్లకుండా అరాచకం, అశాంతివైపు తీసుకెళుతున్నారని విమర్శించారు. ఇప్పటికైనా కూటమి, వైసిపి నాయకులు రెచ్చగొట్టే ప్రకటనలు మాని ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని సూచించారు. వైసిపి బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా వ్యవహరించాలని కోరారు.
= = = =