రాష్ట్ర ప్రజలను నిరాశ పర్చిన ప్రధాని విశాఖ పర్యటన

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 21 జూన్‌, 2025.

 

రాష్ట్ర  ప్రజలను  నిరాశ పర్చిన  ప్రధాని విశాఖ పర్యటన

యోగాంధ్ర పేరుతో విశాఖ వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రానికి సంబంధించిన కీలకమైన సమస్యలతో సహా విశాఖ ఉక్కుపై ఒక్క మాట కూడా చెప్పకపోవడం రాష్ట్ర ప్రజలను తీవ్ర నిరాశకు గురిచేసింది. తన ప్రసంగంలో విశాఖ నగరం ప్రకృతి, అభివృద్ధిల సంగమం అని పేర్కొన్నారు కానీ విశాఖ నగరాభివృద్ది ఆనాటి పోర్టు నుండి స్టీల్‌ప్లాంట్‌ వరకు జరిగిన ప్రభుత్వ రంగ సంస్థల వృద్దితోనే సాధ్యమైందన్న విషయం వాస్తవం. మూడు నెలల వ్యవధిలో రెండుసార్లు విశాఖ సందర్శించిన ప్రధాని ‘‘ఉక్కు’’ విషయంలో దాటవేయడం దారుణం. ఆ సభలోనే ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌ ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకువచ్చి స్టీల్‌ప్లాంట్‌ను ప్రయివేటీకరించబోమని స్పష్టమైన ప్రకటన చేయిస్తారని నగర ప్రజలు, కార్మికులు ఆశించారు. కానీ అలా జరగలేదు. గతంలో ఏ ప్రధానమంత్రి రాష్ట్రానికి వచ్చినా పర్యటించిన   ప్రాంతాల ప్రజల సమస్యలు ప్రస్తావించి నిర్దిష్టమైన హామీలు ఇవ్వడం ఒక చారిత్రాత్మక వాస్తవం.

మనిషి ఊబకాయం మొదలు ప్రపంచ దేశాల మధ్య ఉద్రిక్తతల నివారణకు సైతం యోగా పరిష్కారమన్న రీతిలో ప్రధానమంత్రి ప్రసంగం సాగింది. అమెరికా పనుపున ఇజ్రాయెల్‌ పెట్రేగిపోయి గాజాలో చిన్న పిల్లలను సైతం చంపడం, ఇరాన్‌పై మారణహోమం సాగిస్తుండడం వంటి అఘాయిత్యాలకు పాల్పడుతుంటే వాటిపై కిమ్మనకుండా  ఇటువంటి హితబోదలు చేయడం దేశ ప్రజలను తప్పుదారి పట్టించేందుకే దోహదపడుతుంది. అమెరికా, ఇజ్రాయెల్‌ దుర్మార్గాలను ఖండిరచకుండా మౌనం వహించి యోగాతో శాంతి సమకూరుతుందని చెప్పడం మరో పెద్ద దుర్మార్గం. ఇప్పటికైనా ప్రజల సమస్యలపైనా, రాష్ట్రాభివృద్ధికి విభజన హామీలు, ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు పరిరక్షణ, కడప ఉక్కు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి, రాజధాని, పోలవరం నిర్వాసితులకు నిధులు వంటి అంశాలపై ప్రధాని దృష్టి పెట్టాలని కోరుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం యోగా పేరుతో ప్రధాని మెప్పు పొందాలని కాకుండా రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ కోరుతున్నది.

 

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి