(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. -జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)
విజయవాడ,
తేది : 17 మే, 2025.
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,
గౌరవ ముఖ్యమంత్రి,
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,
అమరావతి.
విషయం: విశాఖ స్టీల్‌ప్లాంట్ కార్మికుల ముఖ్య సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకొని సమ్మె నివారణకు చర్యలు చేపట్టాలని కోరుతూ...
అయ్యా!
విశాఖ స్టీల్‌ప్లాంట్ రివైవల్ కోసం కేంద్రప్రభుత్వం ప్రకటించిన రూ.11,440 కోట్లు ఆర్ధిక ప్యాకేజీవలన సంస్థ మరియు కార్మికుల కీలక సమస్యలు పరిష్కారమౌతాయని విశాఖ ఉక్కు కార్మికులు భావించారు. కానీ ఈ నిధులు సంస్థ ఉత్పత్తికి అవసరమైన రామెటీరియల్, కొత్త యంత్రాలు, పాత యంత్రాల మరమ్మత్తులు, కార్మికుల జీతభత్యాలకు వినియోగించరాదని కేంద్రం ఆంక్షలు పెట్టింది. జిఎస్టీ, బ్యాంకుల రుణాలు, పాత బకాయిలకు రూ.9,346 కోట్లు జమచేసింది. ఉద్యోగులు, కార్మికులకు గత 8 నెలలుగా సగం జీతాలు మాత్రమే చెల్లిస్తున్నది. హెచ్‌ఆర్‌ఎ వంటి సదుపాయాలు నిలిపివేసింది. వేలాది మంది కాంట్రాక్ట్ కార్మికులకు జీతాల బకాయిలున్నాయి. ప్రభుత్వ చర్యలు ఉత్పత్తికి కారకులైన కార్మికులను, వీరి కుటుంబాలను మరింత ఆర్ధిక కష్టాల్లోకి నెడుతున్నాయి. ఈ చర్యలను నివారించాలి. కార్మికుల వేతన బకాయిలు వెంటనే చెల్లించాలి.
సంస్థలో 3వ బ్లాస్ట్ ఫర్నేస్‌ను ప్రారంభించి పూర్తి ఉత్పత్తి సామర్ధ్యంతో ప్లాంట్‌ను నడిపించి లాభాల బాట పట్టిస్తామని కేంద్రం ప్రకటించింది. విశాఖ ఉక్కు లాభాల బాట పట్టాలంటే స్వంతగనులు కేటాయించాలి. దేశంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు రంగ స్టీల్‌ప్లాంట్‌లకు కేంద్రం స్వంత గనులు కేటాయించిన సంగతి మీకు తెలుసు. కేవలం విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై మాత్రమే వివక్షత చూపుతోంది. స్వంత గనులు లేక విశాఖ ఉక్కు ప్రతి టన్ను ఉత్పత్తికి రూ.4 నుండి 6 వేలు అదనపు ఖర్చు భరించవలసి వస్తోంది. నష్టాలకు కారకమవుతోంది. కనుక విశాఖ ఉక్కుకు స్వంత గనులు సాధించాలి. సంస్థ 7.3 మిలియన్‌టన్నుల పూర్తి ఉత్పత్తి సాధించాలంటే 19,000 మంది పర్మినెంట్ కార్మికులు అవసరం. కానీ నేడు 10,900 మంది మాత్రమే ఉన్నారు. వీరి సంఖ్యను కూడ 9,500మందికి తగ్గించడానికి పూనుకున్నారు. సంస్థ ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను చట్టాలను పూర్తిగా ఉల్లంఘించి సుమారు 3,000 మందిని అమానుషంగా తొలగించారు. మరో 2,600మందిని తొలగింపుకు సిద్ధపడ్డారు. ఉత్పత్తిపై దీని ప్రతికూలప్రభావం ఉంటుందని డిపార్ట్‌మెంటు స్థాయి అధికారులు మొరపెట్టుకుంటున్నా కేంద్ర ఆదేశాలంటూ స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం కార్మికులను తొలగిస్తోంది. ఇది ప్లాంట్ ఉత్పత్తికి విఘాతం కలిగించే చర్య. కార్మికుల తొలగింపులను నిలుపుచేయించాలి.
తమ సమస్యలపై మీటింగ్‌కు హాజరయ్యారని నలుగురు పర్మినెంట్ కార్మికులను యాజమాన్యం సస్పెండ్ చేసింది. ఏడుగురు యూనియన్ నాయకులకు షోకాజ్ నోటీసులు ఇచ్చింది. కాంట్రాక్ట్ కార్మికుల నాయకులను అక్రమంగా తొలగిస్తున్నది. పరిశ్రమ లోపల డిపార్ట్‌మెంట్ స్థాయివరకు రాష్ట్ర పోలీసులను నియమించి కార్మికులపై నిర్భంధం ప్రయోగిస్తున్నది. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా స్టీల్‌ప్లాంట్ లోపల ఏనాడూ ఇటువంటి నిర్భంధ చర్యలు లేవు. వీటిని వెంటనే నిలిపివేయాలి.
స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు కోసం భూములు, ఆస్తులు త్యాగాలు చేసిన 8,500 మంది నిర్వాసితులకు నేటికి పర్మినెంట్ ఉపాధి లభించలేదు. వీరి జీవితాలు కడుదుర్భరంగా ఉన్నాయి. సంస్థలో సుమారు 6,000 ఉద్యోగాల ఖాళీలున్నాయి. వీటిని భర్తీ చేయడం ద్వారా నిర్వాసితులకు పర్మినెంట్ ఉపాధి కల్పించాలి. కేంద్ర ప్రభుత్వం పూనుకుంటే 20 మిలియన్ టన్నుల ఉత్పత్తికి విస్తరించేందుకు అన్ని అవకాశాలు, నైపుణ్యం గల కార్మికులు విశాఖ ఉక్కుకు ఉన్నాయి. ఈ విస్తరణ జరిగితే మరో 20,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టాలి. విశాఖ ఉక్కు ఏర్పాటుతో 1,00,000 మందికి ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ఉపాధి లభిస్తోంది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇంతవరకు పన్నులు, డివిడెండ్లు రూపంలో సుమారు రూ.54,000 కోట్లు ఆదాయం సమకూర్చింది. అణగారిన వర్గాలకు సామాజిక న్యాయం అందిస్తోంది. విశాఖ పట్నం, రాష్ట్ర అభివృద్ధికి తలమానికంగా ఉన్నది. దీనిని ప్రభుత్వరంగంలోనే కాపాడుకొని అభివృద్ధి చేయడం రాష్ట్ర ప్రయోజనాలకు అత్యంత అవసరం. కేంద్ర ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న మీ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం దీనికి అనుగుణంగా చర్యలు చేపట్టాలని కార్మికులు, ప్రజలు ఆశిస్తున్నారు. వీరి ఆకాంక్షలకు అనుగుణంగా మీ ప్రభుత్వ పాత్ర ఉండాలి.
కేంద్ర ప్రభుత్వం స్టీల్‌ప్లాంట్‌ను, కార్మికులకు అభివృద్ధి చేసే బదులు మరింత అగాధంలోకి నెడుతోందని, రాష్ట్ర కూటమి ప్రభుత్వం తాము అశించిన విధంగా అండగా నిలవడం లేదనే భావన నెలకొంది. దీంతో స్టీల్‌ప్లాంట్ పర్మినెంట్ కార్మికులు మే 20న ఒక రోజు సమ్మెకు, కాంట్రాక్ట్ కార్మికులు మే 20 నుండి నిరవధిక సమ్మెకు సిద్ధపడుతున్నారు. తమను సమ్మెలోకి ప్రభుత్వాలే నెడుతున్నాయని కార్మికులు ఆందోళనతో ఉన్నారు.
కనుక దయచేసి తమరు వెంటనే కలుగజేసుకొని కేంద్రంతో చర్చించి స్టీల్‌ప్లాంట్ మరియు కార్మికుల ప్రధాన సమస్యలను పరిష్కరించి సమ్మె నివారణకు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
అభివందనములతో...
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి