సుప్రీం కోర్టుకు రాష్ట్రపతి లేఖపై మన రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ప్రకటించాలి.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 16 మే, 2025.

 

సుప్రీం కోర్టుకు రాష్ట్రపతి లేఖపై మన రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ప్రకటించాలి

-సిపిఐ(యం) డిమాండ్‌

 

భారత రాజ్యాంగంలోని ఫెడరల్‌ స్వభావాన్ని పరిరక్షిస్తూ రాష్ట్రాల హక్కులను కాపాడేలా సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును నిర్వీర్యం చేసేందుకు రాష్ట్రపతి ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రశ్నలు సంధింపచేయడం గర్హనీయం. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలపై గవర్నర్‌లు దొడ్డిదారిన పెత్తనం చేసే విధానాలను వ్యతిరేకిస్తూ ప్రజాస్వామిక శక్తులన్నీ ఐక్యంగా నిలవాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ కోరుతున్నది. రాష్ట్రాల హక్కుల కోసం, తెలుగు ప్రజల ఆత్మగౌరవ నినాదంతో స్థాపించబడిన తెలుగుదేశం పార్టీ రాష్ట్రపతి సంధించిన ప్రశ్నలపై తన వైఖరిని స్పష్టం చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం తరపున సుప్రీం కోర్టుకు తమ వైఖరిని తెలియజేయాలని కోరుతున్నది.

తమిళనాడు శాసనసభ ఆమోదించిన 10 బిల్లులకు సమ్మతి తెలపకుండా ఆ రాష్ట్ర గవర్నర్‌ ఎ.ఎన్‌.రవి వ్యవహరించిన రాజ్యాంగ వ్యతిరేక వైఖరికి అడ్డుకట్ట వేస్తూ సుప్రీం కోర్టు చారిత్రాత్మకమైన తీర్పునిచ్చింది. భారత రాజ్యాంగాన్ని, ఫెడరల్‌ స్వభావాన్ని, రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను కాపాడే విషయంలో ఆ తీర్పు ఆదర్శవంతమైనది. దానిని చిత్తశుద్ధితో అమలు చేసి రాజ్యాంగబద్దంగా వ్యవహరించవలసింది పోయి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి ద్వారా ఆ సుప్రీంకోర్టుకే ప్రశ్నలు సంధింపచేయడం ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్దం. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను బలహీనపర్చే ప్రయత్నమేగాక సుప్రీంకోర్టు అధికారాన్ని సవాలుచేసే ఈ వైఖరిని కేంద్ర ప్రభుత్వం విడనాడాలి. ప్రజలచే ఎన్నికైన శాసనసభలు, పార్లమెంటు ఆమోదించిన బిల్లులకు నిర్దిష్ట సమయంలో సమ్మతినివ్వడం లేదా ఏదైనా వివరణ అవసరమైతే అది కూడా వెంటవెంటనే చేపట్టడం రాజ్యాంగాధినేతలుగా రాష్ట్రపతి, గవర్నర్ల విద్యుక్త ధర్మం. ఆ ప్రకారం వారు వ్యవహరించాలని, బిల్లుల సమ్మతికి కాల వ్యవధిని నిర్ణయిస్తూ సుప్రీంకోర్టు చెప్పింది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలపై పెత్తనంచేసే వైఖరి విడనాడి, సుప్రీం కోర్టు తీర్పును తు.చ. తప్పక అమలు చేయాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేస్తున్నది. ఫెడరల్‌ హక్కులకు భంగం కలిగించే ఇటువంటి చర్యలకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యవాదులందరూ తమ నిరసన వ్యక్తం చేయాలని కోరుతున్నది.

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి